పుస్తకం పేరు : దణి
రచయిత : అగరం వసంత్
పేజీలు :207,
వెల :రూ.100
ప్రతులకు : ఎ.వసంత్, కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం,
హౌసూరు, తమిళనాడు.09488330209, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో
ఇవి హౌసూరు కతలు.... పల్లె పాటల కతలు. ఈ కతలు మొత్తం పాటలు, పద్యాలు, గువ్వల తెలుగు పలుకులతో నిండి వుంటాయి. కనుమరుగైపోతున్న జానపద సాహిత్యాన్ని వెలికితీసి... దానికి సరికొత్త సొబగులు అద్ది... జనరంజకం చేసిన ఘనత అగరం వసంత్ గారిది. 'దణి' పేరుతో ఆయన వెలువరించిన హౌసూరు కతలు రచయిత సాహిత్యాభిలాషకు నిదర్శనం. తమిళనాడుకు ఒక కొసన వున్న హౌసూరు ప్రాంతంలో పామరులైన వృద్ధుల నాల్కలపై అలవోకగా నర్తించే పాటలను సేకరించి, వాటికి రసవత్తరమైన కతలను జోడించి హౌసూరు యాసలో గుభాళింపజేశారు. 'హౌసూరు తావులో ఇప్పటికీ ఇక్కడి ప్రజలే కాదు పక్షులు కూడా తెలుగు 'దణి'ని పలుకుతాయి' అంటారు రచయిత. 'దణి'- అంటే... ధ్వని, పలుకు, శబ్దం. ఈ సంపుటిలో 126 పాటలున్నాయి. ఈ పాటలన్నింటికీ సజీవ పాత్రలను సృష్టించి, చమత్కారమైన సంభాషణలతో రక్తి కట్టించారు. దీనికోసం ఆయా గ్రామాల్లో తిరిగి, ఇప్పటికీ పాటలు పాడుతున్న వృద్ధులను గురించి, వారినుంచి ఆ పాటలను రికార్డ్ చేసి... వాటికి అక్షర రూపం ఇవ్వడమంటే... మామూలు విషయం కాదు. ఇదొక యజ్ఞం. ఈ జానపద సాహిత్యమంతా ఆ వృద్ధ తరంతోనే అంతరించిపోకుండా... భవిష్యత్తరాలకు అందించాలనే తపన, కృషి నిజంగా అభినందనీయం. ఈ సంపుటిలోని గేయాలను, పాడిన గాయకులకే అంకితమియ్యడం కళ పట్ల రచయిత చిత్తశుద్ధికి నిదర్శనం. ''ఆ కొండ ఈకొండ నట్టనడుమ నందికొండ/ నందికొండలోన నాది పుట్నిల్లు/ కట్టూరికారి మా వదిన పువ్వు యియ్యమ్మ/ నువ్వు పొయ్యే దోవలో అంగడి వుంది తీసుకోవమ్మా../ కట్టూరికారి మా వదిన పసుపు కుంకుమలే యియ్యమ్మ.../ నువ్వు పొయ్యే దోవలో గుడి వుంది ఆడ నువ్వు పెట్టుకోవమ్మా...'' అంటూ అవ్వ నోట పలికే పాట. ఈ పాటకు అర్థం ఏంటని రచయితే అడుగుతాడు. దానికి అవ్వే విడమర్చి అర్థం చెప్పడం... ఇలా ఒక సంభాషణతో 'పుట్టినిల్లు' కతను రక్తి కట్టిస్తాడు రచయిత. అలాగే... ''చిలకవన్నె చీర తెచ్చి- నెమలి కన్ను రవిక తెచ్చి/ నెలా ముప్పయినాళ్లు - పెండ్లి గనముగా చేసినారు'' అంటూ వినిపించే ఒక పాటకు- మన బిడ్డకి కూడా అట్లాగే పెళ్లి చెయ్యాలని మొగుడు అంటే... అంత పురసత్తు (సత్తా) మనకుందా అని భార్య అనడం- ఇలా 'చిలకవన్నె చీర కట్టె' కత ఆసక్తికరమైన సంభాషణతో సాగుతుంది. తెలుగునాట ఎన్నెన్నో యాసలతో లాలి పాటలు మొదలుకొని శ్రామిక గీతాల వరకూ అసంఖ్యాకమైన పాటలు, పదాలు పల్లెల్లో వృద్ధుల నోట జాలువారుతుంటాయి. వాటినన్నింటినీ సేకరించి, ఒక విందుభోజనాన్ని సిద్ధం చేశాడు రచయిత ఈ సంపుటిలో. భాష పట్ల, జానపదం పట్ల, పల్లెపదాల పట్ల ఆసక్తి వున్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలి.
- కె.ఎక్స్.రాజు