''ఆడదానివి. నేనే లేకపోతే నీకు జీవితం లేదు. బతుకు బస్టాండే. క్లబ్ డ్యాన్సులు చేస్తూ, ఒళ్లముకుని బతకాల్సిందే.'' పెళ్లయిన మూణ్నెళ్లకే భర్త వేధింపులు.. వెకిలి చేష్టల్ని గీతా టాండన్ భరించలేకపోయింది. భర్త అనే ప్రతి మాటకూ ఆమె గుండె పగిలేది. కళ్లు చెరువయ్యేవి. జీవితంలో ఏదో సాధించాలనే ఆలోచనలే తప్ప ఏం చేయాలనే దానిపై ఆమెకు స్పష్టత లేదు. భర్త నుంచి దూరంగా పారిపోయింది. ఒంటరి మహిళగా ఎన్నో సమస్యలను ఎదుర్కుంది. ముంబై మహానగరంలో బతుకు పోరాటం చేస్తున్న గీతా టాండన్ కథ తెలుసుకున్న ఒకావిడ ఆమె వద్దకు వచ్చింది. ''నీవు చూడడానికి టామ్ బారులాగున్నావు. సినిమాల్లో స్టంట్స్ చేస్తావా!'' అని అడిగింది. రెండు సంభాషణల మధ్య గీతా జీవితం ఒక ఎత్తు అయితే.. ఆ రెండో సంభాషణ తర్వాత స్టంట్ ఉమన్‌గా ఆమె కొత్త అవతార్ మరో ఎత్తు. టివి సీరియల్ 'షకీరా'తో మొదలైన ఆమె బతుకు స్టంట్ బాలీవుడ్ యాక్షన్‌కు స్టెంట్ అవుతోంది. హీరోయిన్‌కు హీరోయిజమ్ పెంచుతోంది.
బాల్యంలో తండ్రి, సోదరుడు.. పెళ్లయిన తర్వాత భర్త.. వృద్ధాప్యంలో కొడుకు.. ఇలా మహిళ సామాజిక, ఆర్థిక స్వేచ్ఛకు ప్రతిబంధకంగా పితృస్వామ్య వ్యవస్థ అడుగడుగునా అడ్డు పడుతూనే ఉంటోంది. సంప్రదాయాల రూపంలో పైకి కనిపించకుండా మహిళను మానసికంగా మరింత బలహీనురాలిని చేస్తోంది. గీతా టాండన్ వాటిని ఛేదించింది. ఉట్టికి ఎగిరింది. ఆకాశాన్నీ దాటింది. భవనాలు, పర్వతాలు, ఎత్తైన భవనాల చివరపుటంచుల మీద నుంచి ఎలాంటి బెరుకు లేకుండా స్టంట్లు చేస్తూ బాలీవుడ్ అంతా ప్రకంపనలు సృష్టించింది.
అర్ధాకలి నుంచి అర్ధాంతర పెళ్లి వరకు
గీతాకు తొమ్మిదేళ్లపుడు తల్లి చనిపోయింది. తండ్రి ఉన్న నలుగురు సంతానాన్ని పట్టించుకునేవాడు కాదు. రెండు ముద్దలు నోటికందని ఆ తోబుట్టువులకు ఇక బడి మాట నోటి కాడే ఆగిపోయింది. ఆకలి మంటను ఆటల, పాటల్లో చల్లార్చుకునేది. తనకంటే వయస్సులో పెద్ద కుర్రాళ్లతో కలిసి క్రికెట్ ఆడేది గీతా. అక్క వారించినా గీతా వినేది కాదు. షర్ట్, ప్యాంట్ వేసుకుని టామ్బారులా ఇంటికి మగదిక్కు అయ్యింది. బండ పని చేస్తూ అంతోకొంతో సంపాదించి అక్క చేతికిచ్చేది. అక్క చెల్లెళ్ల గురించి తండ్రితో వాదులాడేది. ఎదురిస్తోందన్న కోపంతో ఆమెను వదిలించుకోడానికి రెండే రోజుల్లో ఓ సంబంధం కుదుర్చుకుని గీతకు పదిహేనేళ్ల వయస్సుకే పెళ్లి చేసేశాడు. తోడుగా నిలుస్తాడనుకున్న భర్త ఆమె బతుకును తోలుబొమ్మలాట చేశాడు. తాగివచ్చి తీవ్రంగా కొట్టేవాడు. రోజూ అతడు చేసే చిత్ర హింసలకు కళ్లు తిరిగి పడిపోయేది. రోజురోజుకూ గృహ హింస ఎక్కువైపోయింది. జీవితంపై విరక్తితో ఆమె రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ తర్వాత గర్భిణి అయినా కూడా మానసికంగానూ, శారీకరంగానూ అతడు తీవ్రమైన రాక్షసత్వాన్ని ప్రదర్శించేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్లు వెనక్కి పంపించేశారు. దిక్కు తోచక సోదరి యింటికి వెళ్లింది. అయినా భర్త వెంటాడుతూనే ఉన్నాడు. అక్కసుతో ఒకరోజు గీత బావగారి రిక్షాను తగలెట్టేశాడు.
దూరతీరాల్లో..
ఇక భర్తతో ప్రమాదమేనని ఇద్దరి పిల్లలతో ముంబై చేరింది. ఓ గుడిలో తలదాచుకుంది. పని కోసం కనిపించిన వారందరినీ ప్రాధేయపడింది. చదువు లేకపోవడంతో పని దొరకలేదు. చివరకు ఓ వారం పాటు ఓ హోటళ్లో పనికి కుదిరింది. రోజుకు 250 రొట్టెల్ని చేసేది. తర్వాత ఓ ప్రదేశంలో పని కోసం వెళ్లింది. అక్కడున్న మహిళలు వృద్ధ మహిళలకు మసాజ్ చేస్తావా అని అడగడంతో కాదనలేకపోయింది. మసాజ్ పేరిట పడుపు వృత్తిని నడుపుతోన్న పార్లర్ అదని ఆమెకు తెలియదు. అక్కడ వాతావరణం అర్థమవడంతో భయపడి అక్కడి నుంచి తప్పించుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు ఓ భాంగ్రా డాన్సు గ్రూపులో జాయిన్ అయ్యింది. అలా మొదలైన ఆమె ప్రస్థానం బాలీవుడ్లో స్టంట్ వుమన్‌గా స్థిర పడే వరకు ఎన్నో ఆటుపోట్లను చూసింది. బాలీవుడ్లో స్థిరపడేందుకు చాలా ప్రమాదకరమైన సాహస కృత్యాలనే చేసింది. రెండో షూటింగ్‌లోనే మంటల్లో నుంచి దూకే ఆ స్టంట్‌లో తప్పిదం జరిగి ఆమె ముఖం కాలిపోయింది. ఆమె పెదాలు, కనురెప్పలు, నుదురు మంటల ధాటికి కందిపోయాయి. దాంతో రెండు నెలలపాటు వైద్యం తీసుకోవాల్సి వచ్చింది. మరో స్టంట్‌లో భవంతి నుంచి జారి పడి వెన్నెముకకు గాయాలయ్యాయి. అయినా ఆ సాహస కెరీర్‌ను వదల్లేదు. హైస్పీడ్ కార్ చేజ్ స్టంట్లను చేసింది. ఆరేళ్ల స్టంట్ ఉమన్ జీవితంలో గగుర్పాటు కలిగించే వందలాది స్టంట్లతో రికార్డు సృష్టించింది.
- క.వి.చుసరా
8519834468
బతుకు స్టంట్
