సిరియా శరణార్థుల విషాద గాధలకు విరామం రావడం లేదు. లక్షలాది మంది తమ పిల్లల ప్రాణాల్ని మిగుల్చుకోవడం కోసం, ఏదైనా భవిష్యత్తు మిగిలుందేమోనని వేలాది మైళ్ల వలస కాలి బాట పట్టారు. ఈ లక్షల బతుకు మజిలీలు కోట్లాది హృదయాల్ని కదలించివేశాయి. కొందరు పడవ నుంచి ఒడ్డుకు చేర్చారు. కొందరు ఉప్పు నీటి కన్నీటి చారల దేహాల గొంతు తడిపారు. మాడిపోయిన కడుపుకింత ముద్ద పెట్టారు. అయినా చానా జీవితాలు దారెంట ఖర్చయిపోయాయి. ప్రాణ బంధాలు దోవంతటా తెగిపోయాయి. ఆచూకీ లేని ప్రాణాలు, విడిపోయిన మనసులు, చెదిరిపోయిన కుటుంబాలు, కంపించిపోయిన చిన్నారి హృదయాలు ఇంకా భారీగానే కంచె దాటే యత్నంలో కోసుకుపోతున్నాయి. ఈ చేజారిన బంధాల్నే కలిపే ప్రయత్నం చేస్తున్నాడు గ్రీస్‌కి చెందిన పాపడోపోలస్. తమ ప్రాంతంలోని ఇడోమెని గ్రామంలో తలదాంచుకుంటున్న సిరియా, ఇరాక్ శరణార్థుల జీవితాల్ని దగ్గరగా చూసేందుకు ఆయన వెళ్లాడు. కదిలించిన ప్రతి కుటుంబంలో ఓ మిస్సింగ్. యుద్ధం అన్ని అవకాశాల్ని తుడిచిపెట్టేసింది. సరిహద్దు దాటగానే వారి నెట్వర్క్ కట్ అయిపోయింది. పాపడోపోలస్ పరిష్కారించాల్సిన, పరిష్కరించగలిగిన సమస్య ఇదేనని అర్థమైంది. ఎందుకంటే తానో నెట్వర్క్ ఇంజినీర్. అక్కడున్న వేలాది శరణార్థుల వద్ద స్మార్ట్ఫోన్లున్నాయని గమనించాడు. కానీ సిమ్‌కార్డులు, ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడంతో అవి ఎందుకు పనికిరాని వాటిలా మిగిలాయి. వెంటనే ఓ ఐడియా తట్టింది అతడికి. నవంబర్ నాటికి శరణార్థి శిబిరంలో ఒక ఉచిత వైఫై స్టేషను ఓ ఖాళీ ట్రైలర్లో ఏర్పాటు చేశాడు. సౌర ఫలకాల బ్యాటరీలని అమర్చాడు. సొంత టెక్నాలజీని అభివృద్ధి చేసి మొబైల్ ఫోన్లు ఆ దేశపు నెట్‌వర్క్‌ను అందుకునేలా చేశాడు. ఇప్పటి వరకు ఆ స్థానిక గ్రామస్తులకు ఇలాంటి సదుపాయాల గుంరించి తెలీదు కూడా! ఎనిమిది యాక్సెస్ పాయింట్స్ నుంచి వీరికి వైఫైని అందించేవాడు. ఒక్కో యాక్సెస్ పాయింట్ నుంచి కేవలం 120 మంది మాత్రమే వైఫైని వాడుకోగలరు. కానీ శిబిరంలో 15000 మంది ఉన్నారు. సర్వర్ సామర్థ్యం సరిపోయేది కాదు. చాలా మంది పగటి పూట వైఫైని వాడటంతో ఈ పరిస్థితులు తలెత్తేవి. కొన్ని రోజులకు కొందరు అర్ధరాత్రులు మేల్కొని తమ కుటుంబ సభ్యులకు కనెక్ట్ అయ్యే పనిలో పడేవారు. ఇలా తొలి రోజుల్లో కొంత కష్టపడ్డా చివరికి ఆ శిబిరంలో ఉన్న చాలా మంది శరణార్థులకి ఈ వైఫై వల్ల విడిపోయినవారి వివరాలు, వారి మంచి చెడుల సమాచారం అంతర్జాలం ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ఇతరత్రా స్వచ్ఛంద సంస్థల నెట్‌వర్క్‌ల ద్వారా తెలుసుకోగలిగారు. తన చిన్న ప్రయత్నం చాలా మంది కళ్లల్లో ఆశల్ని చివురింపజేసిందని గమనించిన పాపడోపోలస్ మరింత ఉత్సాహంగా తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. మరిన్ని వైఫై స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమ య్యాడు. ఎవరైనా సాయం అందిస్తే మరిన్ని శరణార్థ్ధి శిబిరాల్లోని వారిని వైఫైతో కనెక్ట్ చేస్తానని అంటున్నాడు.