ఇక్కడ రుతుక్రమం గురించి బహిరంగంగా మాట్లాడటం అదో పెద్ద నేరం. పురుషుడు అయితే వీటి చర్చలో నిషిద్ధం. స్త్రీలు గుసగుసల తోనే దాన్ని ఓ భూతం చేసేశారు. అంతే నిగూఢతే మహిళలకు శాపం అవుతోంది. శుభ్రమైన నాప్కి న్లు వాడక ఇన్ఫెక్షన్లు సోకి ఎన్నో గర్భధారణ సమస్యలకు కారణమవుతోంది. దీనిపైనే స్పందించి శానిటరీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు సంపాదించాడు అరుణాచలం మురుగనాథన్.
పెద్ద కంపెనీల బ్రాండెడ్ శానిటరీ నాప్కిన్ల ఖర్చు ఓ పేద కుటుంబానికి గుదిబండే. అంతగా చదువురాని, గ్రామీణ మహిళలకు వాటి మీద అవగాహన తక్కువే. ఇంటింటికీ టీవీలు చేరినా శానిటరీ నాప్కిన్ల వారిచ్చే యాడ్స్‌లో ఏం చెబుతున్నారో అర్థంకాని వారు చాలామందే. అందుకే భారత్‌లో వాటిని వాడని మహిళలు 88 శాతం మంది. పాఠశాల చదువులు ఆపేసేవారు 12 శాతం పైబడే. అటు ఖర్చు, ఇటు అవగాహన లోపంతో పాటు సంప్రదాయాలు, కట్టుబాట్లు, అలవాట్ల పేరిట సహజ విషయాన్ని అసహజం చేసేశారు. మహిళలకు మాత్రమే అని బోర్డు తగిలించుకున్న ఈ సమస్యపైనే స్పందించాడు అరుణాచలం మురుగనాథన్. అతి తక్కువ ఖర్చుతో శానిటరీ నాప్కిన్లు తయారుచేయాలని కంకణం కట్టుకున్నాడు. ఆడాళ్లు వెక్కిరిస్తే, మగాళ్లు పక్కకు తప్పుకున్నారు. దెయ్యాలు పట్టాయని రెండు కాళ్లూ వేలాడదీసి చింత బరికెతో వదిలించేలోపు తేరుకుని ఆ ఊరు నుంచి బయటపడ్డాడు. ఇన్ని అవమానాలు, వ్యథలు ఎదురైనా తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన అరుణాచలం ముందుకు సాగడానికి కారణం భార్య ద్వారా అతని దృష్టికి వచ్చిన రుతుచక్రం సమస్య. తాను బండిని కూడా తుడవడానికి ఇష్టపడని క్లాత్‌ను ఆమె ఉపయోగించడం గమనించి విస్తుపోయాడు. ముట్టుకుంటేనే రోగాలు వస్తాయనుకునే పాత చీలికలనే వారు ఉపయోగిస్తారని తెలుసుకున్నాడు. కొన్ని చోట్ల రంపపు పొట్టు, బూడిద, మట్టి, ఇసుక వంటి వాటిని ఉపయోగిస్తారని తెలుసుకునేసరికి నిద్ర పట్టలేదు. తన భార్యకు ఎక్కడ లేనిపోని రోగాలు వస్తాయనే భయంతో శానిటరీ నాప్కిన్లు కొనితెచ్చాడు. తొలిసారి కొన్నప్పుడే జేబుకు చిల్లుపడేసరికి నెలనెలా ఎలా అనే ప్రశ్న తలెత్తింది. ఆ నాప్కిన్లను తేరిపార చూశాక అవి దూదిని పోలి ఉండటంతో అంత అధిక ధరలెందుకో అర్థం కాలేదు. తానే ఎందుకు వాటిని ఇంట్లో తయారుచేయకూడదని పని మొదలెట్టాడు. ఇంటిలో వారు వాటిని వాడి పనికిరావని చెప్పారు. వారిని ఇబ్బంది పెడుతున్నాడని గ్రహించి తానే ఓ గర్భసంచి వ్యవస్థను రూపొందించి పరీక్షించాడు. ఫుట్‌బాల్ బ్లాడర్గా, జంతు రక్తాన్ని వాడి ప్రయోగాలు చేశాడు. వాటిని ధరించి సైకిల్ తొక్కేవాడు. అవి విఫలమై ఊరివారి చీత్కారాలు పొందేవాడు. భార్య విడిచిపెట్టేసింది. ఇలా రెండేళ్లు గడిచాక నాప్‌కిన్‌లలో వాడేది మామూలు దూది కాదని పైన్ సెల్యులోజ్ ఫైబర్‌తో తయారుచేస్తారని తెలుసుకున్నాడు. దాన్ని విశ్వప్రయత్నం చేసి సేకరించాడు. మెటీరియల్ సమస్య తర్వాత మరో సమస్య నాప్కిన్ల మార్చే మెషీన్లకు లక్షలు ఖర్చు అవుతాయి. అవి బయటి దేశాల నుంచి తెచ్చుకోవాలి. అంత స్థోమత లేదు. తానే మెషీన్‌ను రూపొందించే పనిలో పడ్డాడు. అరుణాచలం 14 ఏళ్లకే కుటుంబ అవసరాల దృష్ట్యా చదువు మానేశాడు. ఫుడ్ సప్లయర్, కూలీ ఇలా ఎన్నో పనులు చేస్తూ వెల్డర్‌గా, మెషీన్ ఆపరేటర్‌గాను పనిచేశాడు. ఆ అనుభవమే అక్కరకు వచ్చింది. తన నైపుణ్యానికి పదును పెట్టి మెషీన్‌ను విజయవంతంగా రూపొందించాడు. కేవలం 65 వేలకే అందుబాటులోకి తెచ్చాడు. తొలుత స్థానిక మెడికల్ కాలేజీ విద్యార్థినులకు ఉచితంగా అందించాడు. వారి ద్వారా గ్రామస్తులకు వివరించాడు. అలా ఒక్కో గ్రామంలో వాటి వాడకాన్ని అలవాటు చేస్తూ చివరకు మహిళలే స్వంతంగా కుటీర పరిశ్రమ పెట్టుకునేలా చైతన్యం తెచ్చాడు. స్వయం
సహాయక మహిళలకు మెషీన్ల వాడకాన్ని నేర్పి వాటిని పెద్ద ఎత్తున తయారీ చేయించాడు. లాభాపేక్ష లేకుండా మెషీన్లను అందించాడు. చాలా పారిశ్రామిక వేత్తలు లాభాలు ఆశచూపిన లొంగలేదు. బాగా వెనుకబడిన ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ గ్రామాల్లో విస్త్రతంగా తిరిగి తయారీ కేంద్రాలను పెంచడమే కాక మహిళలు ఆరోగ్యకర అలవాట్లను పాటించేలా ప్రచారం చేశాడు. మహిళల ఆదాయం ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపింది ఆయన కృషి. అలా ఇప్పుడు 23 రాష్ట్రాల్లో 1300 గ్రామాల్లో ఈయన మెషీన్లను ఉపయోగించి నాప్కిన్లను తయారుచేస్తున్నారు.
కొన్ని బాలికల వసతి గృహాలు, పాఠశాలల్లోను వీటిని ఏర్పాటుచేశాడు. శానిటరీ నాప్కిన్లను వాడితే కళ్లు పోతాయని, పెళ్లి కాదని దురభిప్రాయాలపై కూడా పోరాటం చేశాడు. ఐఐటీ, ఐఐఎంలు, హార్వార్డ్ లాంటి అంతర్జాతీయ సంస్థల ఆయనకు వేదికను ఏర్పాటుచేశాయి. తొలుత ఏంచేస్తున్నాడో అర్థం కాక భయంతో దూరమైన భార్య వెనక్కువచ్చి బలాన్నిచ్చింది. భారత ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. ఆయన కృషికి స్పందించి తక్కువ ధరకే శానిటరీ నాప్కిన్లు అందించే ప్రాజెక్టును రూపొందించినా అరుణాచలానికి చోటివ్వలేదు. అయినా ఆయన అసంతృప్తి చెందలేదు. తన మిషన్‌ను అంతర్జాతీయం చేసుకున్నాడు. సుమారు 106 దేశాల్లో తన మెషీన్లను పరిచయం చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే చాలా వరకు పని పూర్తి చేశాడు. నైజీరియా, కెన్యా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఆయన మెషీన్లు పెద్ద మార్పే తెస్తున్నాయి. విప్లవాత్మక ఆ ఆవిష్కారంతో ఎంత కూడబెట్టారని అడిగితే అంత మంది మహిళల ఆరోగ్యం, సంతోషం అని బదులిస్తాడు. అందుకే ఆయన్ను శానిటరీ మేన్ ఆఫ్ ఇండియాగా ప్రపంచం పిలుచుకుంటోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ తల్లి తన కూతురు అరుణాచలం ఆవిష్కరణ వల్ల బడికి వెళ్లగలుగుతోందని ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపింది. అంతకన్నా అమూల్యమైంది తన జీవితంలో లేదని ఆయన గర్వంగా చెబుతాడు.
శానిటరీ పురుషుడు
