పెళ్లిళ్లు..పేరంటాలు..పండుగలు..పబ్బాలు..సందర్భం ఏదైతేనేం! శుభకార్యాల్లో పట్టు వస్త్రాలకే ప్రథమ తాంబూలం. అంతటి విశిష్టత కలిగిన పట్టు చీరలకు పెట్టింది పేరు కాంచీపురం. తమిళ నాట పట్టు వస్త్రాలకు పేర్గాంచిన నగరం. ఈ నేలపై పుట్టి పెరిగి ... పట్టు చీరలు నేయడంలో తమకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకొన్న, సృజనాత్మకతను ప్రదర్శిస్తున్న ముగ్గురు ప్రతిభావంతులను జాతీయ అవార్డులు వరించాయి. వారే వి.సుందరరాజన్, కె.జయంతి, వి.పళనివేలు.
చేనేతే కాదు. ఏ రంగమైనా సరే. సృజనాత్మకతను ప్రదర్శిస్తున్న వారిని ప్రభుత్వం గుర్తిస్తే... మరింత అంకితభావంతో పనిచేస్తారు. దేశ నలుమూలలకు చెందిన 73 మంది నేతన్నలను కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులతో సత్కరించింది. వారిలో ముగ్గురు కాంచీపుర వాస్తవ్యులు. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి నామమాత్రపు లాభాలు చేతికందుతున్న వేళ ... నమ్ముకున్న రంగాన్ని విడిచిపెట్టకుండా ... ప్రయోగాలు చేస్తూ తమ ఉనికిని ప్రపంచానికి చాటుతున్న గొప్ప కళాకారులు వీరు.
సృజనాత్మక నేతన్న
ఎవరికి వారు ఒక వృత్తి ఆధారంగా బతకడం వేరు. తమలా వందలాది మందికి బతుకునివ్వడం వేరు. రెండవ కోవకు చెందినవారు బహు కొద్ది మంది మాత్రమే మనకు తారసపడుతుంటారు. అలాంటివారిలో వి.సుందర రాజన్ ఒకరు. ఆర్థికంగా వెనుకబడిన వందకుపైగా కుటుంబాలకు ఉద్యోగావకాశాలు కల్పించారీయన. కనీసావసరాలైన తిండి, బట్ట, నివాసంతో పాటు వారి చిన్నారులకు విద్య కూడా ఉచితంగా అందేలా ఏర్పాటు చేశారు. 'విత్ బ్లౌజ్' చీరల గురించి అందరికీ తెలుసు. తమిళనాట తొలిసారిగా (1983) విత్ బ్లౌజ్ పట్టు చీరలను నేసిన ఘనత సుందరరాజన్దే. పైగా తన కలలకు కాంచీపురం పట్టుకొర్వారు చీరను కాన్వాస్‌గా మలచుకొన్న ఘనాపాటి. వేలాది సంవత్సరాల కిందట పల్లవులు నిర్మించిన ఆలయ స్థంభాలపై చెక్కబడిన మూర్తులతో కూడిన అలనాటి వారసత్వానికి కంటికింపైన రంగులు అద్దడంలో నేర్పరి. చీరకు పల్లుది ప్రత్యేకాకర్షణ. ఆ పల్లులో సున్నితమైన కొమ్మలు అల్లిస్తారు.
అందమైన పూలు పూయిస్తారు.
నిజానికి ఆయన ఈ భూమిమీద పడ్డాక తొలిసారిగా విన్నది మగ్గం శబ్దమే.
రెండోసారి...
వి.పళనివేలుది మరో విజయ గాథ. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ... చేనేతపై మమకారంతో
నిత్య ప్రయోగాలతో సంప్రదాయ డిజైన్లకు తనదైన ముద్ర వేశారు. ఆయన నేసిన చీరలు భూత భవిష్యత్ వర్తమాన డిజైన్ల మిళితంగా పట్టు చీరల ప్రేమికులను ఇట్టే ఆకట్టుకుంటాయి. మరో ఆసక్తికరమైన విషయమేమంటే... ఆ ఇంట జాతీయ బహుమతి అందుకున్న రెండవ వ్యక్తి పళనివేలు కాగా మొదటి వ్యక్తి మరెవరో కాదు. ఈయన తండ్రిగారే. ఇందిరాగాంధీ మరణించిన రోజు ఆమె కట్టుకున్న చీర తన తండ్రి నేసినదేనంటారు పళనివేలు (అయితే న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియం రికార్డుల ప్రకారం... ఆ చీర ఒడిషా నేత కార్మికుల చేతి మీదగా తయారైందని నమోదైంది.!)
'జయ' లక్ష్మి
జాతీయ అవార్డు సొంతం చేసుకొన్న ముగ్గురిలో జయంతి ఒకరు. సృజనాత్మక చేనేత రంగంలో పురుషులతో పోటీ పడి అంత గొప్ప విజయం సాధించడమంటే చిన్న విషయం కాదు. మువ్వన్నెలతో ముచ్చటగా పట్టుచీర నేసి మగు వల మనసు దోచుకొన్నారీమె. దీన్నే 'కూర్వారు' డిజైన్ అని కూడా పిలుస్తారు. సన్నపాటి అంచు చీరలపై అందమైన నెమళ్లు, హంసలు, అశ్వాలను నేయడం జయంతి ప్రత్యేకత. మరో విశేషమే మంటే జయంతి ప్రతి సంవత్సరం ఈ అవార్డు ఎంపిక సమయంలో భర్తకు మాంచి పోటీ ఇచ్చేవారట. ఈసారి ఆయనను అధిగమించి అవార్డు అందుకున్నారు.
కాంచీపురం పట్టుకు జాతీయ పట్టం
