కావాల్సిన పదార్థాలు
మటన్ - 1 కేజీ
బాస్మతి బియ్యం - 1 కప్పు
పుదీనా ఆకులు - 1/2 కప్పు
కొత్తిమీర తరుగు - 1/2 కప్పు
నూనె - 3 టీ స్పూన్లు
అల్లం-వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు
పసుపు - 1/2 టీ స్పూను
జీలకర్ర - 1 టేబుల్ స్పూను
నిమ్మ రసం - 1 టీ స్పూను
మసాల కోసం
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
సోంపు - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 6
ఉల్లితరుగు - 1/2 కప్పు
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం : ముందుగా మటన్‌ని శుభ్రంగా కడిగి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మటన్ ముక్కల్ని ఉంచి అందులో పసుపు, సోంపు, నిమ్మ రసం, పుదీనా ఆకులు, మసాలా దినుసులు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి మూడు గంటల పాటు ఉంచాలి. తర్వాత కుక్కర్లో మటన్ ముక్కలు, కొద్దిగా నీరు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. మటన్ ఉడికిన తర్వాత నీటి నుండి వేరుచేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, సోంపు మిగిలిన దినుసులన్నిటితో పాటు ఉల్లి తరుగును కూడా వేసి వేయించాలి. అందులో అల్లం-వెల్లుల్లి పేస్టును కూడా వేసి వేయించాలి. ఇప్పుడు మటన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు, పుదీనా ఆకులు, నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసి బాగా కలపాలి. మిగిలిన మటన్ ముక్కలు, ఉప్పు కూడా వేసి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా తక్కువ మంటపై పదార్థాలన్నీ ఉడకనివ్వాలి. ఇక వేడి వేడి పలావ్‌ని సర్వింగ్ ప్లేట్స్‌లోకి తీసి సర్వ్ చేయండి.
ఎండు రొయ్యల పచ్చడి
కావాల్సిన పదార్థాలు
ఎండు రొయ్యలు - 50 గ్రాములు
కొబ్బరి తురుము - 3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 5
జీలకర్ర - 1/2 టేబుల్ స్పూన్
పసుపు - 1 టీ స్పూన్
చింతపండు పేస్ట్ - 1/2 టేబుల్ స్పూను
ఉల్లిపాయ - 1
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
తయారుచేసే విధానం :
ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. ఒక బాణలిలో నూనె వేసి రొయ్యల్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుమును వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా ఇందులో కలిపి రెండు నిమిషాలు వేయించాలి. ఎండు మిర్చి, జీలకర్రని పొడి చేసి, చింతపండు పేస్ట్‌తో కలిపి రొయ్యల మిశ్రమంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకముందే జార్లోంచి తీసి ఒక బౌల్లో పెట్టాలి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుని గోధుమ రంగు వచ్చే వరకు వేయించి రొయ్యల పచ్చడిలో కలపాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి రుచిగా ఉంటుంది.
ఫిష్ కట్లెట్
తయారుచేసే విధానం
ముందుగా నీటిలో ఉప్పు, పసుపు వేసి చేపల్ని శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఒక డిష్‌లో పెట్టాలి. వాటిపై జీలకర్ర పొడి, కారం, పసుపు, ఉప్పు, నిమ్మ రసం వేసి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లి తరుగు కూడా వేసి మరి కొంత సేపు వేయించాలి. అందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచి సువాసన వచ్చే వరకు ఉంచి నిమ్మ రసం, కారం, జీలకర్ర పొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో చేప ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి. చేపల్లో ఉన్న తడి మొత్తం ఇగిరే వరకు ఉడకనిచ్చి తర్వాత ఒక ప్లేట్లోకి ఈ ముక్కల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చేప ముక్కలు చల్లారాక చిన్న చిన్న ముక్కలుగా గానీ లేదా మిక్సీ జార్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. చేపల పేస్ట్/ ముక్కల్ని, ఉల్లిపాయల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిచూసుకుని ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఉండలు సరిగా కుదరక పోతే బ్రెడ్ ముక్కల్ని కొద్దిగా తడిపి వాటిని చేప ముక్కల మిశ్రమంలో కలిపితే ఉండలు ఏర్పడతాయి. ఉండల్ని చేత్తో వత్తి గుడ్డు తెల్ల సొనలో ముంచి ప్యాన్‌పై గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా వేయించాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి వేడి వేడి ఫిష్ కట్‌లెట్లని తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనాలతో గార్నిష్ చేసి టమాటా సాస్‌తో రుచి చూడండి.
కావాల్సిన పదార్థాలు
ముళ్లులేని చేపముక్కలు - 500 గ్రాములు
జీలకర్ర పొడి - 2 టేబుల్ స్పూన్లు
కారం - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - 1/2 టేబుల్ స్పూన్
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - సరిపడా
నీరు - 1 కప్పు
బ్రెడ్ ముక్కలు - 1
గుడ్లు - 2
నూనె - తగినంత
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 3
అల్లం తరుగు - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు - 5 టేబుల్ స్పూన్లు
పుదీనా తరుగు - 2 టేబుల్ స్పూన్లు



---1.jpg)