- సంకల్ప్ రెడ్డి
'ఇది హాలీవుడ్ చిత్రాలకు కాపీ కాదు. తమిళ్లో వచ్చిన 'టిక్‌టిక్..కూ' కూడా సంబంధం లేదు. 'అంతరిక్షం' పూర్తిగా విభిన్నమైన కథ. 'గ్రావిటీ, ఇంటర్సెటెల్లార్' లాంటి చిత్రాలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీశాను. ఈ చిత్రం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది' అని దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెలిపారు. తొలి సినిమానే సముద్ర గర్భం నేపథ్యంలో 'ఘాజీ'లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు ఇతను. రెండో చిత్రం 'అంతరిక్షం' పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 21న విడుదలవుతున్న సందర్భంగా ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
స్పేస్ నేపథ్యంలో సినిమా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
వైజాగ్‌లో సబ్‌మెరైన్ చూశాక 'ఘాజీ' చేయాలనే ఆలోచన వచ్చింది. అలాగే ఒకరోజు అంతరిక్షానికి సంబంధించిన ఒక ఆర్టికల్‌ను చదివా. చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. వెంటనే ఫిక్స్ అయ్యాను స్పేస్ నేపథ్యంలో సినిమా తియ్యాలని 'ఘాజీ' పూర్తయిన మూడు నెలల తరువాత ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాయడం మొదలు పెట్టా.
మామూలు సినిమాలు ఇంట్రెస్ట్ లేదా?
నాకు ఐడియాస్ రాలేదు. ఫ్యూచర్లో చేస్తానేమో చెప్పలేను.
షూటింగ్ ఎలా జరిగింది?
ఎనిమిది నెలలుపైగా దీనిపై శ్రద్ధపెట్టాం. షూటింగ్‌ను 70 రోజుల్లో పూర్తి చేశాం. సెట్లో నేను, కెమెరామెన్ ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్లం. ఆర్టిస్టులంతా 40 రోజులు రోప్పైనే ఉండాల్సివచ్చింది. సెట్లో అంతా సైలైంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా. చాలా సైలెంట్‌గా ఉండేది. అరవడాలు, ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా సీరియస్‌గా ఫోకస్ పెట్టి పనిచేశాం. రామేశ్వరంలో కొంత షూట్ చేశాం. స్క్రిప్ట్ విషయంలో క్రిష్ కొన్ని సూచనలు చేశారు. అయినా అంతిమ నిర్ణయం నీదే అనేవారు.
సైంటిస్ట్‌లు సంప్రదించారా?
నాసా వెబ్సైట్లోనూ, స్పేస్‌కు సంబంధించి యూట్యూబ్‌లోనే మెటీరియల్ ఉంది. కొంతమందిని బెంగుళూరులో సైంటిస్టులను కలిశాను కూడా. 'ఘాజీ'లో కూడా లాజిక్కు ఉండదు. సబ్‌మెరైన్ ఒకేసారి పైకి పోదు. కిందకీ దిగదు. కథప్రకారం అలా చేశాం. ఇందులోనూ కొన్ని సీన్లు అలానే ఉంటాయి. ప్రేక్షకులు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి లాజిక్కులు అందవు.
నటీనటుల్ని ఎలా ఒప్పించారు?
స్క్రిప్ట్ తీసుకెళ్ళి చూపించా. టెక్నికల్‌గా అన్ని లాజిక్కుగా చూపిస్తే ఆర్టిస్టులు ఒప్పుకోరు. ఈ సినిమాకి వరుణ్ తేజ్ అయితేనే పూర్తిగా న్యాయం చేయగలడు అనిపించి ఆయనను కలిశాను. ఒక పిక్ చూపెట్టి బేసిక్ స్టోరీ లైన్‌ను చెప్పాను. 4 నెలల తరువాత మళ్ళీ కలిసి పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించాను. వరుణ్‌కు చాలా నచ్చి సినిమాకి ఒకే చెప్పాడు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు.
ఈ సినిమాకూ జాతీయ అవార్డు వస్తుందా?
'ఘాజీ'కి నేషనల్ అవార్డు వచ్చాక కొంత కాలం గ్యాప్ తీసుకున్నా. అసలు ముందు మైథాలజీ టైప్ సినిమా చేయాలనుకున్నా. ఆ సమయంలోనే స్పేస్‌కు సంబంధించిన ఆర్టికల్ చదివాక ఇన్స్పైర్ అయ్యా. దీనికి నేషనల్ అవార్డు వస్తుందో రాదో ఇప్పుడయితే చెప్పలేను.
టెక్నికల్ విషయాలోనైనా ఎమోషన్స్ ఉన్నాయా?
అన్నీ ఉన్నాయి. లవ్ కథ కూడా ఉంది. 'ఘాజీ'లో లవ్ మిస్ అయ్యా. దాన్ని ఇందులో చూపించాను.
క్వాలిటీ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందా?
దానితో కంపేర్ చేయలేం. బడ్జెట్, టెక్నికల్‌గా చూసుకుంటే కష్టమనే చెప్పాలి. తెలుగులో కూడా ఇలాంటి చిత్రాలు తీయవచ్చునే పేరు వస్తుంది. సౌండ్ సిస్టమ్ అంతా ముంబైలోనే చేశాం. రాజీవ్ రాజశేఖర్ విఎఫ్ ఎక్స్ సూపర్వైజర్గా ఉన్నారు. కంచె, శాతకర్ణి చేసిన సీజీ, విఎఫ్ఎక్స్్టీమ్ దీనికి చేశారు. ఫస్ట్ సినిమాకు మణిరత్నం సినిమాకు పనిచేసిన ఎడిటర్, సౌండ్ డిజైర్‌నే పెట్టుకున్నా. అలాగే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా జ్ఞానశేఖర్‌ను తీసుకున్నా.
పెద్ద స్టార్స్‌తో ఇలాంటి సినిమాలు చేయవచ్చుగదా?
'ఘాజీ' టైంలో రానాను అనుకోలేదు. నిర్మాతలకు ఆయనకున్న సాన్నిహిత్యంతో కథను వినమన్నారు. విన్నాక ఆయన చేస్తానన్నారు. అలా సెట్ అయింది. నేను కథను రాసుకుంటా. దాని కోసం ఇలాంటి హీరోనే కావాలని అస్సలు అనుకోను. ఎవరు అందుబాటులో ఉంటే వారితోనే చేస్తా. అయినా ఒక హీరోను అనుకుని కథ రాసుకుంటే.. ఆ స్థాయికి బడ్జెట్ చూసుకోవాలి. నిర్మాత మార్కెట్‌ను బట్టి వర్కవుట్ అవుతుందో బేరీజువేస్తాడు. ఇవన్నీ ఒక సైకిల్లా ఉంటుంది.
బాలీవుడ్లో ఆఫర్లు వచ్చాయా?
రెండు పెద్ద బ్యానర్లకు కథ చెప్పాను. అక్కడ ఆర్టిస్టుల డేట్స్‌ను బట్టి చూసుకుంటే రెండేళ్ళు పడుతుంది. ఏదిఏమైనా రెండు సినిమాలు చేయాల్సి ఉంది. దీని తరువాత ఆ సినిమాలపై ఫోకస్ పెడతాను.
అది ఇప్పుడే చెప్పలేను
