- పరుచూరి మురళి
నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవాలంటే.. నీ స్నేహితుల పేర్లు చెబితే చాలనే నానుడి ఉండనే ఉంది. స్నేహం గురించి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టే 'నీ స్నేహం' అంటూ సినీరంగంలో దర్శకుడిగా ముందుకొచ్చాడు పరుచూరి మురళి. తన స్నేహితుడు ఉన్నతస్థితిలో ఉండాలనే రవీంద్రనాథ్, మరో స్నేహితుడు కలిసి 'ఆటగాళ్ళు' అనే సినిమాను పరుచూరి మురళి దర్శకత్వంలో నిర్మించారు. నారా రోహిత్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి పరుచూరి మురళి శనివారం మీడియాతో మాట్లాడారు.
విజయవంతమైన సినిమాలు తీసినా చాలా గ్యాప్ తీసుకున్నారేంటి?
దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానమైంది స్క్రిప్ట్ గురించే. అంతకుముందు సూపర్హిట్లు ఇచ్చినా సినిమా సినిమాకూ గ్యాప్ తీసుకున్నా. గబగబా ఏది బడితే అది చేయాలనే మైండ్ సెట్ కాదు. ఏ సినిమా తీసినా మనుసుకు హత్తుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ క్రమంలో కొద్దిగా గ్యాప్ వస్తుంది.
'ఆటగాళ్ళు' ఏం చేస్తారు?
రెండు గంటల 10 నిమిషాలు పాటు తమని తాము మర్చిపోయేలా ప్రేక్షకులను ఆనందింపజేస్తారు. తెరపై వారు చేసే ఆట ప్రేక్షకుడికి కనెన్ట్ అయ్యేవిధంగా ఉంటుంది. సమాజానికి సందేశం చెప్పకపోయినా మంచి వినోదం మాత్రం ఇస్తాం.
నారా రోహిత్, జగపతిబాబులతో తీయడానికి కారణం ఏమిటి?
ఏ కథకైనా హీరో కీలకం. ఆ తర్వాత మరో సమాన స్థాయి పాత్ర ఉండాలి. అలా ఉంటేనే కథ రక్తికడుతుంది. ఈ సినిమాకు వారిద్దరి పాత్రలు చక్కగా సరిపోయాయి. గేమ్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి రెండు భిన్నమైన వయసులు ఉన్న వారు ఆ పాత్రలకు కావాలి. వారిద్దరూ కరెక్ట్ సరిపోతారని భావించి ఎంపిక చేశాం.
మైండ్ గేమ్‌లతో గతంలో పలు చిత్రాలు వచ్చాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటి?
కథను బట్టి గేమ్‌లో రకాలుంటాయి. ఇందులో ఆడియన్స్ కూడా ఎవరు గేమ్ ఆడుతున్నాడనేది తెలీయకుండా సాగుతుంది. చూసే ప్రతి ప్రేక్షకుడికీ కనెక్ట్ అవుతుంది. తాను కూడా వారి పాత్రల్లో ట్రావెల్ అవుతారు. స్క్రీన్‌ప్లే బేస్డ్తో ఆకట్టుకుంటుంది.
బ్రహ్మానందం ఇప్పటి ట్రెండ్ చిత్రాల్లో కన్పించడంలేదు. ఆ పాత్రను మీరెలా డిజైన్ చేశారు?
జనరల్‌గా ఆయనపై రకరకాలుగా కామెంట్లు విన్పిస్తుంటాయి. కానీ ఆయనపై కంటెంట్ ఉంటే దాన్ని మోసేస్తాడు. భగవంతుడు ఆయనకు ఆ సామర్థాన్నిచ్చాడు. పదిమందిని నవ్వించడం ద్వారా ఆయన వెలుగులోకి వచ్చాడు. మొన్నటివరకు ఆయన లేని చిత్రం లేదు. హీరోకు సమాన స్థాయి పాత్ర ఉంటుంది. కథ రాసుకున్నప్పుడే ఆయన పాత్ర గురించి రాసేవారు. అయితే కొంతకాలంగా ఆయన్ను సరిగ్గా ఉపయోగించుకోలేపోయారేమో అనిపిస్తుంది. కొత్తవాళ్ళు రావాలి. కానీ సీనియర్ సీనియరే. 'పెదబాబు'లో లక్ష్మీపతిని తీసుకున్నాం. అప్పట్లో తను పెద్దగా ఎవరికీ తెలీదు. ఆ సినిమాలో ఆయన బాగా చేశాడు. పేరు వచ్చింది. 'ఆంధ్రుడు'లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ఎవరి టాలెంట్ వారిది. అయితే ఈ చిత్రంలో ప్రత్యేకంగా కామెడీ కోసమే పాత్రను పెట్టలేదు. కథతో పాటు కామెడీ రన్ అవుతుంది. అది కూడా మంచి ఎమోషన్‌తో ఉంటుంది.
హీరోయిన్ ఎంపిక ఎలా జరిగింది?
నారా రోహిత్ పక్క దర్శన బనిక్ అనే బెంగాలీ నటి చేసింది. తను అక్కడ ఏడెనిమిది సినిమాలు చేసింది. నటనాపరంగా అనుభవం ఉంది. ఆమె రోహిత్ పక్కన కరెక్ట్‌గా సరిపోయింది.
ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ఆ కోణంలో మీ చిత్రం ఉంటుందా?
ప్రేక్షకుల ఆలోచనలు ఎక్కడా తేడాలేదు. కథ ఎంత కొత్తదయినా అందులో ఎమోషన్ కీలకం. దానికి కనెక్ట్ అయితే చాలు సక్సెస్ అయినట్లే. దర్శకుడిగా ప్రతీ ఆర్టిస్టుకు కథ చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే నా బాధ్యతను నెరవేర్చాను. నారా రోహిత్, జగపతిబాబు కూడా కథను నెరేట్ చేశాను. కథ విన్నాక.. మీరు ఏవిధంగా రియాక్ట్ అవుతున్నారో చెప్పమని అడిగాను. ఏదైనా ట్రాక్ తప్పితే చెప్పండి. నచ్చకపోతే మొహమాటం లేకుండా చెప్పేయమని అన్నాను. అందరూ కథను మెచ్చుకున్నారు.
నారా రోహిత్ పాత్ర ఎలా ఉంటుంది?
ఈ పాత్ర చాలా ప్రత్యేకమైంది. ఆయన హాలీవుడ్ నుంచి వస్తాడు. 'మహాభారతం' సినిమాను తీద్దామని అందుకు తెలుగులో క్రేజీ డైరెక్టర్ కోసం వెతుక్కుంటాడు. ఆ పాత్రలో చాలా బలుపు ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మనల్ని కొంచెం తక్కువగా చూస్తారనేది వాస్తవం. కానీ అమ్మాయిల విషయంలో వారికి అలా ఉండదు. అలాంటి భావాలున్న వ్యక్తిలో షడెన్‌గా మార్పు వస్తుంది. దానికి కారణమేమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
జగపతిబాబు విలన్‌గా నటించారా?
ఆయన క్రిమినల్ లాయర్. గతంలో చాలా పాత్రలు చేసినా లాయర్‌గా ఇంతవరకు చేయలేదు. తను పబ్లిక్ ప్రాసిక్యూటర్. జాబ్‌ను ఓన్ చేసుకుని జన్యూన్‌గా వాదించాలనే తరహా పాత్ర. కేసును జన్యూన్‌గా వాదిస్తాడు. ఆ వాదనలోనే అనుకోకుండా గేమ్‌లోకి వెళ్ళిపోతాడు. ఎవరైనా వర్క్‌ను ప్రేమిస్తే అందులో సమస్య వస్తే గేమ్‌ను మొదలుపెడదాం. అలా జగపతిబాబు పాత్ర ఉంటుంది. చాలా ఫ్రెష్‌లుక్‌తో ఆయన కన్పిస్తారు.
కథను బట్టి హీరోనా? లేక హీరోను బట్టి కథ రాసుకుంటారా?
కథకే ప్రాధాన్యం ఇస్తా. అది కరెక్ట్‌గా ఉంటేనే ఆర్టిస్టులు ఎవరెవరనేది తెలుసుకోగలుగుతాం. ఈ చిత్రం గురించి చెప్పాలంటే.. నేను దర్శకుడ్ని కాకముందే కథలు చాలా రాసుకున్నా. అప్పట్లో రాసుకున్న కథే ఇది. ఈ కథ చేయడానికి ఓ కారణం ఉంది. మా స్వంత బావమరిది ఇచ్చిన కథ. దీనికి ముందు కమర్షియల్ కథను అనుకుని పెద్ద హీరోతో చేద్దామని నిర్ణయించుకున్నాం. కానీ అనుకున్న సమయం కంటే ఆలస్యమవుతుందని నేను బయటకువచ్చేశాను. అది కూడా ఆరోగ్యకరమైన వాతావరణంతోనే. బడ్జెట్ పెద్దది కావడంతో కాస్త ఆలస్యమైంది. ఇలాంటి సమయంలో ఓరోజు అనుకోకుండా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న నా బావమరిది ఇంటికి వెళ్ళాను. మాటల సందర్భంలో ఓ కథ చెప్పాడు. వినగానే భలే ఉందనిపించింది. ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి కథ చెబుతున్నాడనే! అని ఆశ్చర్యపోయాను. సాఫ్ట్వేర్ కుర్రాడు కనుక ఏదో ఇంగ్లీషు సినిమా చూశాడనుకున్నా. కానీ.. నేను ఏ సినిమా చూడలేదనీ, నాకు వచ్చిన ఐడియాను రాసుకున్నానని నాతో చెప్పాడు. ఈ లైన్ బాగుందనీ, దాన్ని నేను తీసుకుని మరింత ఆకర్షణీయంగా అల్లుకున్నాను. ఎందుకంటే సినిమా ప్రోసెస్ ఎలా ఉంటుందో తనకు తెలీదు. అందుకే నేను తీసుకుని దానికి తగిన హంగులు సమకూర్చి రాసుకున్నా. టైటిల్స్‌లో కూడా కిలార్ కల్యాన్ అని పేరు కూడా వేస్తున్నాం. యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.
ఏది బడితే అది చేసేయను
