- అనుపమ పరమేశ్వరన్
''మలయాళంలో అవకాశాలు వచ్చినప్పుడు నేను తెలుగులో చాలా బిజీగా ఉన్నాను. మలయాళ చిత్రాల చిత్రీకరణ ఇక్కడిలా ఉండవు. లాంగ్ షెడ్యూల్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఖాళీగా ఉన్నపుడొచ్చిన స్క్రిప్ట్‌లు నచ్చలేదు. సో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయన్నమాట'' అని అనుపమ పరమేశ్వరన్ అన్నారు. ఆమె సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన 'తేజ్ ఐ లవ్ యూ' చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడారు.
'తేజ్ ఐ లవ్ యూ' గురించి చెప్పండి?
సినిమా విడుదల కాబోతోంది. నాకు చాలా టెన్షన్‌గా, నెర్వస్‌గా ఉంది. నేను ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో 'శతమానం భవతి' తప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ నేను సగం కేరక్టర్, ఇద్దరు ముగ్గురున్న నాయికల చిత్రాల్లో నటించాను. అయితే ఇప్పుడు 'తేజ్ ఐ లవ్యూ'లో చాలా మంచి పాత్ర చేశా. ఇందులో చేసిన పాత్ర పేరు నందిని. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదు.
మీ పాత్ర గురించి చెప్పండి?
సూపర్ బబ్లీ గర్ల్‌గా నటించాను. యుఎస్ నుంచి ఓ పర్పస్ కోసం హైదరాబాద్ వచ్చే అమ్మాయి పాత్ర. కొన్నిసార్లు ఇమ్మెచ్యూర్గా, కొన్నిసార్లు కేడీగా, కొన్నిసార్లు మెచ్యూర్‌గా.. చాలా వేరియేషన్స్ ఉంటాయి.
మీ రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుందా?
నా రియల్ లైఫ్ కన్నా 10 శాతం ఎక్కువగా ఉంటుంది. నేను మాటకారిని. నందిని పాత్ర కూడా మాటకారే.
కరుణాకరన్ అని ఈ సినిమా చేశారా? ఇంకేమైనా కారణాలున్నాయా?
కరుణాకరన్ అనే పేరు చాలా పెద్ద రీజన్ అన్నమాట. నేను ఆయన సినిమాలు చాలా చూశాను. 'తొలిప్రేమ' 'డార్లింగ్' 'ఉల్లాసంగా ఉత్సాహంగా' 'హ్యాపీ'... అలా చాలా సినిమాలు చూశా. ప్రతి సినిమాలోనూ ఆయన హీరోయిన్లను చూపించే విధానం, ఆయన రూపుదిద్దే పాత్రలు చాలా ఇష్టం. మా ఇంటికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు కరుణాకరన్ ఒక చోట కూర్చోలేదు. లేచి తిరుగుతూ, పరుగులు తీస్తూ... ఆ పాత్రగా మారిపోయి నాకు నెరేషన్ ఇచ్చారు. ఆయన ఎగ్జయిట్మెంట్ చూసి, నేను ఎగ్జయిట్ అయ్యాను.
తేజ్ గురించి చెప్పండి?
సాయిధరమ్ తేజ్‌తో పనిచేయడం చాలా హ్యాపీ. సూపర్ కూల్ పర్సన్. తేజ్‌కి దర్శకుడి మీద ఉన్న నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోయా. దర్శకుడికి తనకన్నా ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్ తేజ్‌ది. తేజ్ చాలాడౌన్ టు వర్త్. హంబుల్ పర్సన్. తన డ్యాన్సుల గురించి చెప్పనవసరం లేదు. కొన్ని స్టెప్పులు వేయాల్సి వచ్చింది. వాటి కోసం చాలా కష్టపడ్డా. ఫస్ట్ టేక్ లో తేజ్ చేసేసేవారు. నేను మాత్రం రిహార్సల్స్ చేసి చేసేదాన్ని.
సాంగ్స్ నచ్చాయా?
నాకు గోపీసుందర్ సంగీతం చాలా ఇష్టం. నచ్చుతున్నదే అనే మాంటేజ్ సాంగ్ నాకు ఇష్టమైన పాట. కరుణాకరన్ చాలా బాగా విజువల్స్ చేశారు. తేజ్ పాటలను వినగానే నచ్చుతాయని నేను చెప్పను. కానీ వినేకొద్దీ నచ్చుతాయి.
సినిమా చేయడంలో మీ ప్రయారిటీస్ ఏముంటాయి?
నాకు ఇంపార్టెన్స్ నా కేరక్టర్. 'ఉన్నదొక్కటే జిందగీ'లో నా పాత్ర కొంతవరకే ఉంటుంది. అలాగే 'అఆ'లో నాగవల్లి అనే పాత్ర కూడా. నా పాత్రను బట్టే నేను వాటిని ఎంపిక చేసుకుంటాను. నా పాత్రల్లో ఇంటెన్సిటీ, జెన్యూనిటీని గురించి ఆలోచిస్తా.
తెలుగు బాగా మాట్లాడుతున్నారే?
నాకు తెలుగు నేర్చుకోవడానికి కారణం త్రివిక్రమ్. 'అ ఆ' షూటింగ్ లొకేషన్‌కి వెళ్లి నేను కూర్చున్నప్పుడు అందరూ తెలుగులో మాట్లాడుకునేవారు. నేను త్రివిక్రమ్ దగ్గరకి వెళ్లి 'వాళ్లేదో అంటున్నారు. నాకు అర్థం కావడం లేదు. కాస్త ట్రాన్స్ లేట్ చేయండి' అని అడిగా వెంటనే ఆయన సరేనన్నారు. అవతలివాళ్లు ఏది చెప్పినా ఆయన నా దగ్గరకు వచ్చి ట్రాన్స్ లేట్ చేసేవారు. అలా అప్పుడు నాకు అనిపించింది. రెండో సినిమాకు నేను తెలుగు నేర్చుకోవాలని. ఇక్కడ ఉంటున్నప్పుడు ఇక్కడ నేర్చుకోవడంలో తప్పేం ఉంది. ప్రస్తుతం కన్నడ సినిమా చేస్తున్నా. అందుకే కన్నడ నేర్చుకుంటున్నా.
మీరు డబ్బింగ్ చెప్పుకున్నారా?
ఈ సినిమాకు చెప్పలేదు. మిగిలిన సినిమాలకు చెప్పాను. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నప్పుడు నేను 'హలో గురూ ప్రేమకోసమే' సినిమాతో బిజీగా ఉన్నాను.
మీరు ఎదురుచూస్తున్న పాత్రలు ఎలాంటివి?
ఇప్పుడున్న పరిస్థితికి చాలా ఆనందంగా ఉన్నాను. కాకపోతే ఇంకా బోల్డ్ పాత్రలు, చాలెంజింగ్ పాత్రలు రావాలని అనుకుంటున్నాను
నా పాత్రే నాకు ముఖ్యం
