'సైన్మా' షార్ట్‌ఫిలిం విజిటింగ్ కార్డ్‌గా పెట్టుకుని 'పెళ్ళిచూపులు' సినిమాతో గుర్తింపుపొందిన తరుణ్ భాస్కర్ మరో సినిమా చేయడానికి రెండేళ్ళు పట్టింది. ఈసారి అందరూ కొత్త వాళ్లను పెట్టి విభిన్నమైన కథాంశంతో సినిమా చేశాడు. అగ్ర నిర్మాత సురేష్ బాబు నిర్మాణంలో అతను తెరకెక్కించిన 'ఈ నగరానికి ఏమైంది' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
చిత్రం : 'ఈ నగరానికి ఏమైంది'
నటీ నటులు: విశ్వక్సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, సిమ్రాన్ చౌదరి, అనీషా ఆంబ్రోస్, గీతా భాస్కర్ తదితరులు
సాంకేతికత : ఛాయాగ్రహణం : నికేత్ బొమ్మి, సంగీతం : వివేక్ సాగర్, నిర్మాత : సురేష్ బాబు, రచన, దర్శకత్వం : తరుణ్ భాస్కర్.
కథ : నలుగురి చిన్ననాటి స్నేహితుల కథ ఇది. అందులో వివేక్ (విశ్వక్సేన్)ది సైకో మెంటాలటీ. ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ అయ్యే దిశగా షార్ట్ ఫిల్మ్ తీయాలనే ప్రయత్నంలో ఉంటాడు అతను. ముగ్గురు స్నేహితుల్లో ఒకరు కెమెరామెన్, మరొకరుడు ఎడిటింగ్, ఇంకొకరు ఆర్టిస్టుగా అవ్వాలనుకునేవారు. వీళ్లంతా కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీయడానికి సిద్ధమవుతారు. ఆ షార్ట్ ఫిలిం తీసే క్రమంలో అందులో నటించిన అమ్మాయితో ప్రేమలో పడతాడు వివేక్. ఆ అమ్మాయీ ఇతడ్ని ప్రేమిస్తుంది. కానీ వివేక్ తీరు నచ్చక ఆ అమ్మాయి అతడికి దూరమవుతుంది. దీంతో వివేక్ దేవదాసులా అయిపోతాడు. ఆ తర్వాత స్నేహితులంతా విడిపోయి ఎవరి పనులు వారు చేసుకుంటుంటారు. అలాంటి సమయంలో తనకు యుఎస్ వెళ్లే ఆఫర్ వచ్చిందని ఓ స్నేహితుడు అందరికీ పార్టీ ఇస్తాడు. ఆ పార్టీ చిత్రమైన పరిస్థితికి దారితీస్తుంది. దాంతో వారంతా గోవాకు వెళతారు. ఆ తర్వాత అక్కడ వారి పరిస్థితి ఏ మలుపు తిరిగింది? అన్నది సినిమా.
విశ్లేషణ : 'హ్యాంగోవర్' తరహాలో ఈ సినిమా ఉంటుందని దర్శక నిర్మాతలు ముందుగా చెప్పేయడంతో ఓ తరహా ప్రేక్షకులకే అనేది ముందుగానే సూచించేశారు. గతంలో అల్లరి నరేష్ 'యాక్షన్' కూడా ఆ చిత్ర స్ఫూర్తితోనే తీశారు. అయితే 'ఈ నగరానికి ఏమైంది' అనే టైటిల్ పెట్టడంతో ఆసక్తి పెరిగింది. ఆ ప్రకటనలో చెప్పినట్లుగా తెలుగు సినిమా కథను ప్రశ్నించినట్లుగా ఈ చిత్రం ఉంది. మూసధోరణిలో పోతున్న సినిమా కథల్ని ఒక్కసారిగా వాస్తవంలో జరిగే చిన్నచిన్న విషయాలను ఎలా కథగా చెప్పవచ్చో దర్శకుడు చేసిన ప్రయత్నమిది. అతడి అనుభవాల్లోంచి పుట్టిన ఒక వాస్తవికమైన కథ. తెలుగు సినిమాల్లో సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిన తెలంగాణ అర్బన్ నేటివిటీ కామెడీని సరిగ్గా ప్రెజెంట్ చేయడం ద్వారా 'పెళ్ళిచూపులు'తో కొత్త ఒరవడికి తెరతీసి దాన్నే ఒక ట్రెండుగా మార్చిన దర్శకుడు మరోసారి తనదైన మార్కు చూపిస్తూ మెప్పించాడు. కాకపోతే 'పెళ్ళిచూపులు' వంటి బలమైన కథాబలం ఇందులో లేదు.
ఈ సినిమా చూస్తుంటే...కొందరి జీవితాలను నేరుగా వాళ్ల పక్కన కుర్చీ వేసుకుని చూస్తున్నట్లుగా ఉంటుంది. వాళ్ల పాత్రలు.. సంభాషణలు అంత సహజంగా అనిపిస్తాయి. ఈతరం సిటీ కుర్రాళ్లు కొందరు కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటే వాళ్ల మధ్య ఎలాంటి ఫన్ జనరేట్ అవుతుందో ఎలా జోకులు పేలుతాయో అదంతా సినిమాలో కనిపిస్తుంది. ఒక్కో సీన్ చూస్తుంటే...నటీనటులకు సందర్భం చెప్పి ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అని వదిలేసినట్లుగా అనిపిస్తుంది ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పించకుండా సింక్ సౌండ్ టెక్నాలజీతో అక్కడికక్కడ డైలాగ్స్ చెప్పించడం వల్ల కూడా సహజత్వం మరింత పెరిగింది.
నలుగురు స్నేహితులు వారి లక్ష్యాల సాధనకు ఏం చేశారనేది ఇందులో క్లుప్తంగా చెప్పాడు దర్శకుడు. అర్జున్‌రెడ్డిలో హీరోకున్న స్వతంత్రభావాలు ఇందులో వివేక్ పాత్రలో కన్పిస్తాయి. ఒక్కొక్కరి కథ చెప్పేక్రమంలో కొంతమందికి ఏంటీ సోది! అని కూడా అనిపించవచ్చు. మల్టీప్లెక్స్, ఓవర్సీస్ ప్రేక్షకులు తమను తాము ఐడెంటిఫై చేసుకునేట్లుగా ఉంటుంది.
నాలుగు పాత్రల అనుభవాలే కాబట్టి కథేంటి అన్నది వెతుక్కోవాల్సిందే. నలుగురు కుర్రాళ్ల జీవితాల్లోని కొన్ని దశల్ని సరదాగా అలా చూపించినా 'మనకు నచ్చింది చేయడంలో ఉండే ఆనందం, మనం అనుకున్న నలుగురితో కలిసి ఉన్న సంతోషం మరెందులోనూ ఉండదనేది' ఈ సినిమా ద్వారా చెప్పిన సందేశం. ప్రథమార్ధం వరకు వేగంగానే సాగిపోయే 'ఈ నగరానికి ఏమైంది' ద్వితీయార్ధం నెమ్మదిస్తుంది. ప్రధాన పాత్రధారులు నలుగురూ బాగా చేశారు. 'వెళ్ళిపోమాకే' ఫేమ్ విశ్వక్సేన్.. తొలి సినిమాతో పోలిస్తే ఇందులో భిన్నంగా కనిపించాడు. అతడి లుక్.. యాక్టింగ్ అన్నీ మెప్పిస్తాయి. అతడి కంటే కూడా మెప్పించేది అభినవ్ గోమఠం. ప్రతి సీన్లోనూ మెప్పించాడు. సుశాంత్ రెడ్డి.. వెంకటేష్ కాకుమాను కూడా బాగా చేశారు. హీరోయిన్లు అనీషా ఆంబ్రోస్.. సిమ్రాన్ ఫర్వాలేదు. మిగతా వాళ్లూ ఓకే.
సంగీత దర్శకుడు వివేక్ సాగర్ నేపథ్య సంగీతం బాగుంది. ఉన్న రెండు మూడు పాటలు కథలో కలిసిపోయేవి. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం భిన్నంగా అనిపిస్తుంది. ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ తరహా సినిమాలు మెట్రో యూత్‌ను దృష్టిలో పెట్టుకుని తీసింది కాబట్టి మిగిలిన క్లాస్‌లకు పెద్దగా నచ్చకపోవచ్చు. ఓ షార్ట్‌ఫిలిం తీయడానికి నలుగు పడిన శ్రమ కాబట్టి కొందరికి ఇదో షార్ట్ ఫిలింగా అనిపించొచ్చు. అలాగే తెలుగు సినిమాలో కొత్త పోకడకు నాందిగా మరికొందరు భావించొచ్చు.