- కల్యాణ్ రామ్
''ప్రస్తుతం కేవీ గుహన్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అది పూర్తిగా కొత్త కాన్సెప్ట్. అలాంటి క్యారెక్టర్, అలాంటి సినిమా ఇప్పటివరకు నేను చేయలేదు. అంతా నచ్చింది కాబట్టే చేస్తున్నాను. నేను కొత్త పాత్రలు చేయాలి. కొత్తగా కనిపించాలి. భవిష్యత్తులో కూడా రొమాంటిక్ స్టోరీస్ వస్తే కచ్చితంగా చేస్తాను. ఏదో ఒక ఫ్రేమ్‌కు ఫిక్స్ అయిపోవడం నాకిష్టం ఉండదు'' అని కల్యాణ్ రామ్ అన్నారు. ఆయన హీరోగా 'నా నువ్వే' చిత్రం తెరకెక్కింది. తమన్నా కథానాయిక. కల్యాణ్ రామ్ కెరీర్లో మొదటిసారిగా లవర్‌బారుగా నటించిన చిత్రమిది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఇదొక రొమాంటిక్ మూవీ. ఇలాంటి సినిమా చేయడం తొలిసారి. పీసీ శ్రీరామ్‌తో వర్క్ చేయడం నా అదృష్టం. 'గీతాంజలి' టైమ్ నుంచి అనుకునేవాడ్ని పీసీ శ్రీరామ్‌తో వర్క్ చేయాలని. మొత్తానికి నా కల నెరవేరింది. కమర్షియల్ సినిమాల్లో మన బాడీలాంగ్వేజ్ స్పీడ్‌గా ఉంటుంది. కానీ 'నా నువ్వే' లాంటి రొమాంటిక్ సినిమాలు చేసేటప్పుడు, కొంచెం సెటిల్‌గా ఉండాలి. కళ్లు పెద్దవి చేయకూడదు. హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఉండకూడదు. తల ఎక్కువ ఊపకూడదు. డైలాగ్స్ మధ్య గ్యాప్ ఇవ్వాలి. డైలాగ్ కంటే ఎక్స్ ప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ నాకు చాలా కొత్తగా అనిపించాయి.
కాస్త కష్టపడ్డాను
ఇందులో క్యారెక్టర్‌తో సింక్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. మొదట లుక్ దగ్గరే చాలా కష్టపడ్డాం. జయేంద్ర అండ్ టీం చాలా కష్టపడింది. లుక్ ఫిక్స్ అయిన తర్వాత సటిల్ యాక్టింగ్ కోసం నేను కష్టపడాల్సి వచ్చింది. అన్నీ డౌన్ చేసి చూపించాలి. కొంచెం కష్టమైంది.
దర్శకుడి సృష్టి
నా క్యారెక్టర్ కోసం ఎవర్నీ ఇన్సిపిరేషన్‌గా తీసుకోలేదు. పూర్తిగా దర్శకుడు జయేంద్ర మైండ్ నుంచి వచ్చిన పాత్ర ఇది. అతడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లాను. ఒక్క ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఇచ్చినా కట్ చెప్పేసేవాడు. సినిమాలో నా పాత్రపై అతడికి అంత క్లారిటీ ఉంది. నిజానికి కెరీర్ ఆరంభంలో ఇలాంటి సినిమా చేసుంటే బాగుండేది. డైరక్టర్‌ను కూడా అదే అడిగాను. అవకాశం ఇప్పుడొచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఈ సినిమాలో నా లుక్ అందరికీ నచ్చింది. నా కొడుకు కూడా నేను చాలా అందంగా ఉన్నానని మెచ్చుకున్నాడు. నాకొచ్చిన పెద్ద కాంప్లిమెంట్ అదే. నేను మీసం తీసేయడం నా భార్యకు కూడా నచ్చింది.
కాస్త స్వార్థం కూడా
సినిమాలో నా పూర్తి క్యారెక్టర్ గురించి చెప్పలేను. సినిమా చూసి తెలుసుకోవాలి. నాది, తమన్నాదే కీలక పాత్రలు. అమెరికాలో జాబ్ కోసం వెళ్తున్న ఓ కుర్రాడిగా నేను కనిపిస్తాను. కాస్త స్వార్థం కూడా ఉంటుంది ఆ పాత్రలో.
తమన్నాకు నాకు కామన్ పాయింట్
తమన్నతో వర్క్ చేయడం చాలా బాగుంది. ఆమె చాలా ప్రొఫెషనల్. సెట్స్‌లో టైమ్‌కు ఉంటుంది. జయేంద్ర స్టయిల్ ఏంటంటే.. టోటల్ సీన్‌ను సింగిల్ షాట్లో తీయడం ఆయనకు అలవాటు. మొత్తం సీన్ అయిపోయిన తర్వాతే కట్ చెబుతారు. అందుకే తమన్నా, నేను షూటింగ్‌కు ముందు చాలా ప్రాక్టీస్ చేశాం. తమన్నాకు నాకు కామన్‌గా బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్‌గా కలిసి అదే తాగేవాళ్లం. అలాగే మాతో పాటు తణికెళ్ల భరణి, పోసాని, వెన్నెల కిషోర్, ప్రవీణ్ కూడా మంచి పాత్రలు పోషించారు. సినిమాలో ఈ పాత్రలన్నీ కీలకమైనవే. కిరణ్, విజరు, మహేష్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
స్టోరీలైన్ ముందే చెబితే...
ఏడాదికి ఎన్ని సినిమాలు చేయాలనే టార్గెట్ నాకు లేదు. అంతా నా మైండ్ సెట్ ప్రకారం వెళ్లిపోతుంటా. ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో కథ నచ్చితే వెంటనే చేసేస్తా. పైగా కాస్త ముందుగానే స్టోరీలైన్‌కు ఓకే చెబితే.. నేను ఫ్రీ అయ్యే టైమ్‌కు పూర్తిస్థాయిలో స్క్రీన్ ప్లే రెడీ అవుతుంది. అలా టైం ఆదా అవుతుంది కదా.
మెయిన్ తేడా అదే
కమర్షియల్ హీరోకు, రొమాంటిక్ హీరోకు చాలా తేడా ఉంటుంది. కమర్షియల్ హీరోకు ఫిజికల్‌గా కష్టం ఉంటుంది. ఫైట్స్ చేయాలి, దూకాలి, అరవాలి. అదే రొమాంటిక్ హీరో విషయానికొస్తే అంతా మైండ్ వర్క్ ఉంటుంది. మనసులోనే ఆలోచించుకొని యాక్ట్ చేయాలి. ఎందులో కష్టం అందులో ఉంది. రెండూ రెండే. కాకపోతే హీరోయిన్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ అయితే రొమాంటిక్ హీరోగా చేయడం ఈజీ.
కొత్త సినిమాలు
గుహన్ గారి సినిమా దాదాపు సగం పూర్తయింది. జులై 18కి అది 50 శాతం షూటింగ్ పూర్తవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై పవన్ సాధినేని దర్శకత్వంలో సినిమా ఉంటుంది. స్టోరీ ఫిక్స్ చేశాం. గున్నం గంగరాజు డైలాగ్స్, స్క్రీన్‌ప్లే విభాగాలు చూసుకుంటారు. ఇదొక మల్టీస్టారర్ మూవీ. ఎవరైతే బాగుంటుందో నాలుగు పేర్లు చెప్పమని అడిగాను. వచ్చే ఏడాది తారక్‌తో కూడా సినిమా ఉంటుంది.
ఒకే ఫ్రేమ్‌లో ఉండిపోను
