- రవితేజ
''నాకు నేలటిక్కెట్లు చాలానే ఉన్నాయి. చిన్నప్పుడు మా ఊరిలో టూరింగ్‌టాకీస్ ఉండేది. అక్కడ తెరముందు ఇసుక వేసేవారు. దానిలో కూర్చొని చూసేవాళ్ళం. తర్వాత బెంచ్ టిక్కెట్ ఉండేది. అప్పట్లో నేలటిక్కెట్టు 60పైసలు. ఆ రోజులే వేరు. నేను సినిమా ట్రైలర్లో వృద్ధుల గురించి చెప్పిన డైలాగే ఈ చిత్రం చేయడానికి ముఖ్యకారణం' అని రవితేజ తెలిపారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ నిర్మించిన చిత్రం 'నేల టిక్కెట్టు'. ఈ నెల 25న విడుదలవు తుంది. ఈ సందర్భంగా రవితేజ మంగళవారం మాట్లాడారు.
మాస్ కోసమే ఆ టైటిల్ పెట్టారా?
మాస్ అప్పీల్ కోసం పెట్టుకున్న టైటిల్ కాదిది. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ అయ్యే టైటిల్ అది. వాడి చుట్టూ ఉన్నవాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళే పర్సనాలిటీ హీరోది.
మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
ఇందులో నాది ఒక అనాథ పాత్ర. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బంధాన్ని వెతుక్కునే మనిషిలా కనిపిస్తాను. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉండాలనేది సినిమాలో నా ఫిలాసఫీ.
ఇందులో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం?
ఇందులో పెద్దవాళ్ళ గురించి చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళంటే చేతకానీ వాళ్ళు కాదు నిలువెత్తు అనుభవం అనే డైలాగ్ కూడా ఉంది. ఆ పాయింట్ నన్ను బాగా టచ్ చేసింది.
ఈ సినిమాలో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునే అంశాలేవీ?
ఇందాక చెప్పినట్టు పెద్దవాళ్ళ టాపిక్, మంచి ఫన్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్, నా పాత్ర ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచే అంశాలు.
కల్యాణ్ కృష్ణ దర్శకత్వం ఎలా అనిపించింది?
తను చాలా మంచి దర్శకుడు. అతని సినిమాల్లో క్లాస్ టచ్, మాస్ టచ్ రెండూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అంతే. ఆయన ట్రీట్మెంట్ కనిపిస్తుంది.
ఇంతకుముందేమో చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడేమో వరుస పెట్టి సినిమా చేస్తున్నారు. ఎందుకలా?
దానికి ప్రత్యేకంగా కారణాలు లేవు. అప్పుడంటే కుదరలేదు. ఇప్పుడు అన్నీ కుదిరి వరుసగా సినిమాలు చేస్తున్నాను.
శ్రీను వైట్ల సినిమా నుండి అను ఇమ్మాన్యుయేల్ తప్పుకోడానికి కారణం?
ఆమె మా సినిమాతో పాటు 'శైలజారెడ్డి అల్లుడు' అనే సినిమా కూడా చేస్తోంది. మా సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉండటం వలన ఆ సినిమాకు ఇబ్బంది కలుగుతుందని ఆమె తప్పుకున్నారు. అంతకుమించి మరే కారణమూ లేదు. తప్పకుండా ఆమెతో ఒక సినిమా చేస్తాను.
మీ అబ్బాయి ఏవైనా సినిమాలు చేస్తున్నాడా?
లేదు. అసలు 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలోనే చేయాల్సింది. కానీ అదే టైమ్‌లో ఎగ్జామ్స్ ఉండటంతో చేయలేకపోయాడు. ఏదైనా ముందు వాడి చదువు పూర్తవ్వాలి.
నిర్మాత రామ్‌తో మరో సినిమా అని ప్రకటించారు?
రామ్ తాళ్లూరి ప్రొడక్షన్లో ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. ఆయన చాలా ప్రాక్టికల్ మనిషి. పైకి ఒకలా.. బయట ఇంకోలా అస్సలు ఉండడు. అక్కడే మా ఇద్దరికీ సింక్ అయింది. చాలా తపన ఉన్న నిర్మాత.
మీ 'నేల టిక్కెట్టు' అందరినీ ఆకట్టుకోగలదా?
కచ్చితంగా. మా సినిమా నేల టిక్కెట్టు వాళ్లనే కాకుండా బాల్కనీ వాళ్ళ చేత కూడ విజిల్ వేయిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే సినిమా.
ఇప్పటి జనరేషన్‌కు ఎలా కనెక్ట్ అవుతుందనుకుంటున్నారు?
అందుకేగా.. అన్ని అంశాలున్న సినిమాగా తీర్చిదిద్దాం. ఇప్పటివారికి నేలటిక్కెట్టు అనేది తెలీకపోయినా.. అప్పటివారిని అడిగి తెలుసుకుంటారు. సినిమా చూస్తే వారికే అర్థమవుతుంది. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
టైటిల్‌పైన 420.. కింద రూ.10 అని ఉంది అంటే దాని అర్ధమేమిటి?
అదే సినిమా. రెండు రోజుల్లో చూస్తారుగా.. మీకే తెలుస్తుంది.
రొటీన్‌గా రివెంజ్ డ్రామాలా ఉంటుందా?
రొటీన్ అంటే.. నేను చేసిన సినిమాల్లో యాక్షన్ ఉంటుంది. దానికో కారణముంటుంది. అయితే కొంచెం రివేంజ్ డ్రామా కూడా ఉంటుంది. అది రొటీన్ కాదు. కంప్లీట్‌గా కల్యాణ్ కృష్ణ మార్క్ ఎలివేట్ అవుతుంది. కథ మరీ కొత్తది కాకపోయినా ప్రతి క్యారెక్టర్నీ విభిన్నంగా ప్రెజెంట్ చేశాడు. సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ కూడా చాలా బావుంటుంది.
మీరు బాగా ఫీలయిన సన్నివేశం?
ఇందాక నేను చెప్పిన వృద్ధుల డైలాగే. అసలు కని పెంచి పోషించిన తల్లిదండ్రుల్ని అలా ఎలా వదిలేస్తారు. పేరెంట్స్‌ని పట్టించుకోని వాళ్ళు ఎందుకు బతుకుతారో కూడా నాకర్థం కాదు. కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలనేది నా మతం. సొంత మనుషులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఒకడు అందరినీ తన వాళ్ళలా ఫీలవ్వడం. తపించడం అనేది సినిమాలో చాలా పెద్ద ఎమోషన్.. ఈ పాయింట్ చుట్టే సినిమా తిరుగుతూ ఉంటుంది.
ఈ సినిమా ప్రారంభం ఆలస్యం కావడానికి కారణం?
'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా కన్నా ముందే కల్యాణ్ కృష్ణ ఈ స్టోరీ నాకు చెప్పాడు. కాకపోతే అప్పటికే నాకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో అప్పట్లో కుదరలేదు. ఈ లోపు కల్యాణ్ 2 సినిమాలు చేసేసుకున్నాడు. మా కాంబినేషన్ ఇప్పుడు కుదిరింది.
ఇందులో పాటలు ఎలా ఉన్నాయి?
శక్తికాంత్ మ్యూజిక్ నాకు చాలా నచ్చేసింది. 'ఫిదా' సినిమా సాంగ్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ సినిమాకు కూడా చాలా మంచి సాంగ్స్ కంపోజ్ చేశాడు.
రీమేక్ చేస్తున్నారు? ఏవైనా మార్చారా?
అమర్ అక్బర్ ఆంథోని సినిమా రీమేకే అయినా, స్క్రిప్ట్‌లో దాదాపు 70శాతం వరకు మార్పులు చేశాం. కొత్తదనం ఉంటూనే సోల్ ఫుల్‌గా ఉంటుంది.
పవన్ కల్యాణ్‌కు, మీకూ మధ్యన ఉన్న రిలేషన్ ఎలాంటిది?
ఆయన చాలా సరదాగా ఉంటారు. నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడు కలిసినా బాగా మాట్లాడతారు.
ఆ రోజులే వేరు
