ఉత్సాహం.. ఉత్తేజభరితం..

Feb 19,2024 11:11 #Children's festivals, #guntur

 ముగిసిన సింహపురి, గుంటూరు బాలోత్సవాలు

ప్రజాశక్తి-నెల్లూరు/గుంటూరు  :   గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జరుగుతున్న బాలోత్సవాలు ఉత్సాహభరితంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగిన బాలోత్సవాలు ఆహూతులను ఆలోచింపజేశాయి. చివరి రోజైన ఆదివారం ముగింపు సందర్భంగా విద్యార్థులు చేపట్టిన కోలాటం, జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, పాటల పోటీలు, ఏకపాత్రాభినయం, బృందగానం ప్రేక్షకులను ఆకట్టు కున్నాయి. నిత్యం చదువుల్లో మునిగితేలే విద్యార్థులకు ఈ బాలోత్సవాలు వారిలో ఉత్తేజాన్ని నింపాయి.గుంటూరు హిందూ కాలేజీ ప్రాంగణంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన గుంటూరు జిల్లా బాలోత్సవంలో ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బాలోత్సవాలను మరింత విస్తృతంగా పట్టణ ప్రాంతాల్లోనూ నిర్వహించటానికి కృషి చేస్తామని తెలిపారు.

పిల్లల్లో సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికి తీయటానికి ఇటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మలినేని విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ మలినేని పెరుమాళ్లు, కిట్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజి చైర్మన్‌ కోయి సుబ్బారావు, కాటూరి పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, లయన్స్‌ క్లబ్‌ మాజీ గవర్నర్‌ నూతలపాటి వీరప్రకాష్‌ తదితరులు మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులను సమీకరించి, వారిలో నైపుణ్యాలను వెలికి తీయటానికి జెవివి చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. దీప్తి పబ్లికేషన్స్‌ అధినేత ఎ.ఆంజనేయులు, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి, ఎం.కళాధర్‌ ప్రసంగించారు. నెల్లూరు నగరంలోని శ్రీ కస్తూరిదేవి బాలికల హైస్కూల్‌ ప్రాంగణంలో ‘సింహపురి బాలోత్సవం’ నిర్వహించారు. ముగింపు సందర్భంగా యుటిఎఫ్‌ నాయకులు ఎంవి చలపతి అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో బాలోత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. విశిష్ట అతిథులుగా సంఘమిత్ర స్కూల్స్‌ కరస్పాండెంట్‌ కె.వి రవీందర్‌ రెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు ఎన్‌.నవకోటేశ్వరరావు, యుటిఎఫ్‌ నాయకులు పాల్గొని విద్యార్థులకు సందేశమిచ్చారు.

➡️