- సిఆర్డిఎ అధికారులూ, బ్యాంకు అధికారులు ఒకరిపై ఒకరు విమర్శలు
- చేతులెత్తేసిన రెవెన్యూ సిబ్బంది
- ఆందోళనలో లబ్ధిదారులు
ప్రజాశక్తి - తుళ్ళూరు
టిడిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రుణమాఫీ రగడ రైతులను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. మొదటి విడత రుణమాఫీ ఏమాత్రం ఒడ్డుకు చేరకుండానే 2వ విడత రుణమాఫీ అమలులోకి వచ్చింది. అయితే ప్రభుత్వం ఖాతాల్లో జమచేస్తున్నట్లు చెబుతూ వస్తున్న నగదు బ్యాంకు ఖాతాల్లో జమకాకపోవడంతో కొందరు రైతులు బ్యాంకుల చుట్టూ, సిఆర్డిఎ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉన్నారు. ఇదే క్రమంలో అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉండి సిఆర్డిఎ కార్యాలయానికి, బ్యాంకులకు సమర్పించినా వారి ఖాతాల్లో ఒక్క పైసా కూడా జమకాకపోవడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. సిఆర్డిఎ కార్యాలయ సిబ్బంది బ్యాంకు అధికారులపై, బ్యాంకు సిబ్బంది సిఆర్డిఎ అధికారులపై ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ ఉండగా రెవెన్యూ సిబ్బంది మాకేమి సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారు. దీంతో తమగోడు ఎవరికి చెప్పాలో తమ సమస్యలు ఎక్కడ పరిష్కారమవుతాయో అర్థం కాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన లేకుండా ఉందని ఇప్పటికైనా గ్రౌండ్ లెవల్లో సమస్యను పరిష్కరించి రుణమాఫీ లబ్ధిదారులకు మేలు జరిగేలా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.