కావల్సిన పదార్థాలు
నువ్వులు-పావు కప్పు
బియ్యం-ఒక కేజీ
బెల్లం-ముప్పావు కేజీ
నూనె-వేయించడానికి తగినంత
నీరు-ఒక కప్పు
తయారీ విధానం
బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. మళ్లీ మంచి నీళ్లుపోసి 6 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత నానిన బియ్యాన్ని పల్చటి వస్త్రంమీద పోసి కొద్దిగా తడి ఆరనివ్వాలి. కొంచెం తడిపొడిగా ఉండగానే పిండి మెత్తగా పట్టించుకుని పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. బెల్లాన్ని బాగా మెత్తగా దంచి ఒక పాత్రలో వేసి అందులో ఒక కప్పు నీళ్లు పోసి స్టౌమీద సన్నని మంటపై పెట్టాలి. తర్వాత దానిని గరిటెతో కలుపుతూ ముదరుపాకం వచ్చేవరకు ఉంచాలి. పాకం రాగానే స్టౌమీద నుండి దించి ఒకరు గరిటెతో పాకాన్ని తిప్పుతుంటే మరొకరు పిండిని అందులో పోయాలి. పిండి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా త్వర త్వరగా గరిటెను తిప్పాలి. సరిపడినంత పిండి పోసి అది ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. తర్వాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకొని ఒక పాలిథిన్ కవరు మీద చేతితో గుండ్రంగా వత్తుకొని పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో నూనె పోసి స్టౌపై పెట్టాలి. నూనె వేడి కాగానే అందులో వత్తి పెట్టుకున్న అరిసెలను వేయాలి. అవి బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేయించి తీసి వాటిని ప్రెస్ చేసే దానితో నొక్కాలి. తర్వాత వాటిని నువ్వులలో వేసి వత్తితే అరిసెలు రెడీ.
