2004 నుండి సాగిన పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలలో పెల్లుబికిన అసంతృప్తిని ఉపయోగించుకుని బిజెపి 2014లో అత్యధిక సీట్లు సంపాదించి (ఓట్లు మాత్రం 31 శాతం) కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పటినుండి వారి అసలు మేనిఫెస్టో అయిన గోల్వాల్కర్ రచించిన 'పాంచజన్యం', వి.డి సావర్కర్ రచించిన 'ఎవరు హిందూ?'ను అమలు చేయడం ప్రారంభించారు. గడిచిన ఈ 25 సంవత్సరాలుగా వామపక్షాలు ఈ విధానాలపై పోరాడుతున్నా బూర్జువా, లౌకిక పార్టీలు (ఆర్జెడి వంటివి మినహాయిస్తే) బిజెపి వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలన్న తాపత్రయం తప్ప, దాని మతోన్మాద అరాచకాలపైన, వినాశకర ఆర్థిక విధానాలపైన పెదవి విప్పకపోవడం వలన హిందూ మతోన్మాద పోకడలు విజృంభించాయి. ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యానికి మూలాలైన ఆర్బిఐ, సిబిఐ, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థలపైనే కాకుండా ఏకంగా రాజ్యాంగంపైకే కాషాయకూటమి ఎగబడడం చూస్తున్నాం. బాబ్రీ మసీదు కూల్చే నాటికి కేంద్రంలో కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్లో బిజెపి ప్రభుత్వాలున్నాయి. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా బిజెపి అధికారంలో ఉంది. ఈ బలాన్ని మరింత పెంచుకుని 2019 పార్లమెంటు ఎన్నికలలోనూ గెలవాలన్నది వారి వ్యూహం. అందుకే అన్ని వ్యవస్థలపైన దాడి. ప్రజలను భయ కంపితులను చేయడం. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలను లక్ష్యంగా పెట్టుకుని దాడులను తీవ్రతరం చేసింది.
టార్గెట్ వారణాసి
అయోధ్యలో రామమందిర నిర్మాణం ఆందోళన తీవ్రం చేశారు. ఫాబ్రికేటెడ్ నమూనాలు సిద్ధం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజిత్ గొగోరు అయోధ్య తీర్పు ఇప్పుడు చేపట్టమని, 2019 జనవరి తర్వాత ఆలోచిస్తామని చెప్పడంతో గంగవెర్రులెత్తి ఆయన పైన, సుప్రీంకోర్టు పైన నిందారోపణలు మొదలుపెట్టారు.
అదే సమయంలో కాశీ (బెనారస్)లోని 500 సంవత్సరాల క్రితం నాటి గ్యాన్వాపి మసీదును కూలదోసే కుట్రలు ఆరంభించారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చినప్పుడే అక్కడ జమకూడిన బిజెపి, ఆర్ఎస్ఎస్ నాయకులు కరసేవకులతో 'ఇది నమూనా మాత్రమే. కాశీ, మధురలు మిగిలివున్నాయి' అన్న నినాదం ఇప్పించారు.. బాబ్రీ మసీదుని కూల్చడానికి 5,6 సంవత్సరాల ముందు నుండే బాబ్రీ మసీదు చరిత్రను వక్రీకరిస్తూ, అబద్దాలు ప్రచారం చేసినట్లుగానే కాశీలో కూడా కథ ప్రారంభించారు. అప్పుడు బాబ్రీ మసీదు చుట్టూ వున్న 27 ఎకరాల స్థలంలో వున్న కట్టడాలన్నింటిని అయోధ్య సుందరీకరణ - ఆధునీకరణ పేరిట కూల్చివేశారు. అందులో అనేక హిందూ దేవాలయాలు కూడా వున్నాయి. దీనికి వ్యతిరేకంగా గొంతెత్తిన హిందూ ఆరాధకుల నోరు నొక్కేశారు. సుమిత్రాభవన్, సాక్షి గోపాల మందిరం వంటి దేవాలయాల పూజారులైన మహంత్ రాజ్ మంగళదాస్లు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ వారి గోడు ఎవరూ పట్టించుకోలేదు. రాంకృపాల్ దాస్ ఉన్న పళాన కనపడకుండా పోయారు. రాజ్ మంగళదాస్ అనూహ్యంగా చనిపోయారు. ఇప్పుడు ఇదే తంతు కాశీలో జరుగుతోంది. బెనారస్ మున్సిపల్ కార్పొరేషన్ వారు నవంబర్ 2018లోనే గ్యాన్వాసి మసీదు చుట్టూ ఉన్న 168 కట్టడాలు, ఇందులో 95 నివాస భవనాలను స్వాధీనం చేసుకున్నారు. వాస్తవానికి ఈ మసీదు కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉంటుంది. శతాబ్దాల పాటు దీనిని మన లౌకిక, మత సామరస్యానికి వారసత్వ చిహ్నంగా చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు కార్పొరేషన్ వారు కూల్చివేతలు ప్రారంభించారు. ఇప్పటికే 55 చిన్న దేవాలయాలను కూల్చేశారు. వినాయకుడి విగ్రహాలను చెత్త కుప్పలలోకి విసిరేస్తున్నారని బాధ చెందుతున్న హిందువులు నిరసనలతో రోడ్డెక్కుతున్నారు. అధికారులు మాత్రం ఇది బెనారస్ సుందరీకరణ-ఆధునీకరణ ప్రాజెక్టులో భాగమంటున్నారు. ద్వారకా పీఠాధిపతి అభిముక్తేశ్వరానంద సరస్వతి కాశీలో హిందూ దేవాలయాలను కూల్చడంపై 12 రోజులు నిరాహారాదీక్ష చేశారు. ప్రధానికి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. ఫ్రంట్లైన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్య్వూలో 'కొందరు బిజెపి నాయకులు నన్ను నోరు మూసుకోమని, ఇదంతా గ్యాన్వాపి మసీదు కబంధ హస్తాల నుండి విశ్వనాథ ఆలయాన్ని విముక్తి చేయటానికేనని చెప్పారని' అన్నారు. అంతేకాదు 'వారు (బిజెపి వారు) కాశీలో రెండవ అయోధ్యని సృష్టించనున్నారని కూడా' ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. గ్యాన్వాపి మసీదు కమిటీతో కలిసి వేదవ్యాస పీఠం వారు, సుప్రీంకోర్టులో ఐక్యంగా కేసులేయటానికి సిద్ధం అవుతున్నారు. బాబ్రీ మసీదును కూల్చే సందర్భంలో 'బాబరు ఆనాడు రామమందిరాన్ని కూల్చి దానిపై మసీదు కట్టాడు. కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి. ఆ మసీదును కూల్చాలి' అని ఆనాడు వీరంగాలు వేశారు. మరి ఇప్పుడు కాశీ విశ్వనాథ ఆలయం పక్కన మసీదును కూల్చడానికి ఏం చెప్పాలో తెలియక హిందూ దేవాలయాన్ని విముక్తి చేయాలంటున్నారు.
అసహనానికి, మూర్ఖత్వానికి ప్రతిరూపాలు
రామమందిర నిర్మాణానికి చట్టం చేయాలి. వెంటనే సాధ్యం కాదనుకుంటే ఆర్డినెన్స్ తేవాల్సిందేనని స్వయానా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ప్రకటించారు. ఈ మధ్యనే అయోధ్యలో లక్ష మందికి పైగా సాధువులని, సన్యాసులని పోగేసి హెచ్చరికలు జారీ చేయించారు. బాబ్రీ మసీదును 25 నిమిషాలలో కూలిస్తే 25 సంవత్సరాలు అయినా రామమందిరం ఎందుకు కట్టలేకపోయారని సాధువులు బిజెపిని తిట్టారు. ప్రధానమంత్రి రాజస్థాన్ ఎన్నికల సభలో మాట్లాడుతూ రామమందిరం నిర్మాణానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలే అడ్డమని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కాంగ్రెస్ బెదిరిస్తుందని దిగజారుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజి జోషి తీర్పుని వాయిదా వేయడం హిందువులని కించపరచడమే'నని ప్రకటించారు. మరి తీర్పు వాయిదానే సహించ లేనివారు, తీర్పు వారికి విరుద్ధంగా వస్తే అసలు పాటిస్తారా? అందుకే 1993లో ఈ కేసును చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఒకరైన ఎస్పి భరూచా తన తీర్పులో 'సంఖ్యాపరంగా మెజార్టీ మతస్తులు, మైనార్టీల ప్రార్థనాలయాలను తమవని, ఇప్పించకపోతే గొడవలు జరుగుతాయని హెచ్చరించడం ఏం న్యాయం? ప్రభుత్వం దీన్ని అంగీకరించ రాదు. అంతేకాదు శాంతి భద్రతలు కాపాడే పేరిట ఆ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 'వివాదస్పద స్థలాలు' గా మార్చడం రాజ్యాంగం ప్రసాదించిన లౌకిక వ్యవస్థను అపహాస్యం చేయటమే అవుతుంద'ని చెప్పారు. 'అయోధ్య అనేది ఒక తుఫాను వంటిది. అది వెళ్లిపోతుంది కానీ సుప్రీంకోర్టు కీర్తి, ప్రతిష్టలను పణంగా పెట్టకూడదు' అని చెప్పారు.కాని, కాషాయ కూటమి లౌకిక రాజ్యాంగ వ్యవస్థపై ముప్పేట దాడిని ముమ్మరం చేసింది. ఉత్తర ప్రదేశ్లో ఈ మతోన్మాద చర్యలు మరీ చెలరేగుతున్నాయి. పట్టణాలకున్న ముస్లిం రాజులు, మేధావులు, సంఘసంస్కర్తల పేర్లన్నింటినీ మారుస్తున్నారు. విశృంఖలంగా పెరుగుతున్న హిందూ మతోన్మాదాన్ని ఇక ఏమాత్రం ఉపేక్షించరాదు.
ఈ విషయంలో కేరళలో వామపక్ష ప్రభుత్వం ఆదర్శవంతగా కృషి చేస్తున్నది. బిజెపి మతవాదానికి వ్యతిరేకంగా 2019 జనవరి 1న లక్షలాది మంది మహిళలతో మానవ హారం నిర్మించ నున్నారు. ఈ విధంగా తలపడితే తప్ప హిందూ మతోన్మాదాన్ని మట్టు పెట్టలేం. హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన సంఘసంస్కరణ ఉద్యమాలను, మతసామరస్య ఉద్యమాలను, మన చరిత్రను ముందుకు తేవాలి. కేరళ ముఖ్యమంత్రి మతోన్మాదులను హెచ్చరిస్తూ కేరళని మళ్లీ మతోన్మాదుల పిచ్చాసుపత్రిగా మార్చవద్దు అన్నారు. కేరళనే కాదు దేశాన్నే మతోన్మాదుల పిచ్చాసుపత్రిగా మార్చడానికి బిజెపి-ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నాలని సాగనివ్వరాదు. అందుకు వామపక్షాలు, చొరవ తీసుకుని లౌకిక వాదులను, ప్రగతిశీల వాదులను, ప్రజాతంత్ర వాదులను కూడగట్టాలి.
- ఆర్ రఘు
( సిపిఎం కృష్ణా (తూర్పు) జిల్లా కమిటీ కార్యదర్శి )
