- పాడియావులా 'పెట్రో' పన్నులు
- ఐదేళ్లలో మోడీ సర్కారు రూ.10.29 లక్షల కోట్ల లూటీ
'భరత ఖండంబు చక్కని పాడియావు.... పితుకుతున్నాడు తెల్లవాడను గడసరి గొల్లవాడు...' అంటూ బ్రిటిష్ పాలకులు మన దేశాన్ని దోచుకున్న తీరును చిలకమర్తివారు వివరించారు. ఆధునిక భారతంలో పెట్రో ఉత్పత్తులపై పన్నులు కూడా 'కాషాయ' పాలకులకు పాడియావులా అక్కరకొస్తున్నాయి. మోడీ 2014లో గద్దెనెక్కిననాడు లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజు పన్ను రూ.9.48 వున్నదల్లా 2018కి రూ.21.48 కి పెంచారు. పెట్రోల్, డీజిల్, ఇతర కందెనలపై (పిఒఎల్) కేంద్ర బడ్జెట్‌కు స్థూల ఆదాయంగా 2014-15లో రూ. 1.05 లక్షల కోట్లు సమకూరగా అది 2018-9లో రూ.2.57 లక్షల కోట్లకు చేరిందంటేనే సర్కారు దోపిడీ ఏ రీతిలో వుందో బోధపడుతుంది. ఆగేయాసియా దేశాలన్నిటిలో చమురు ధరలు భారత్‌లోనే అత్యధికంగా వుండడానికి పన్నులే కారణమని నిపుణులు నిర్ధారించారు. 'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా' అన్న చందంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతోసహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా ప్రజలపై వ్యాట్ పేరిట 'పెట్రో పన్ను' వడ్డిస్తున్నాయి. వామపక్ష ప్రభుత్వాలు మాత్రం ఇందుకు మినహాయింపు. కేరళ ఎల్డిఎఫ్ ప్రభుత్వం పన్ను తగ్గించి ప్రజలకు వెసులుబాటు కలిగించింది కూడా!
2014 ఏప్రిల్ 1న లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను రూ.9.48 కాగా ఇప్పుడది రూ.21.48కి పెరిగింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో యుపిఎ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచిందని, తాము అధికారానికి వస్తే ఇంధన ధరలు తగ్గిస్తామని గొప్పగా చెప్పిన మోడీ గద్దెనెక్కాక మాట తప్పి ధరలు పెంచారు. డీజిల్‌పై పన్ను ఈ కాలంలో రూ.3.56 నుండి రూ.17.33కి పెరిగింది. ఈ భారం మరీ ఎక్కువ. వ్యవసాయ రంగంలోను, ప్రజా రవాణాకు, సరుకుల చేరవేతకు ఉపయోగపడే డీజిల్ ధర పెంచడం ద్వారా నిత్యావసర సరుకులన్నిటి ధరలూ పెరిగి, ప్రజల రోజువారీ జీవనంపై పెను ప్రభావాలు పడ్డాయి. వ్యవసాయంలో పంటనుబట్టి పది నుంచి 25 శాతం ఇంధన ఖర్చులకే అవుతోందని వ్యవసాయార్థిక శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అంటే ఈ భారంతో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి దిగబడుతుంది. దశాబ్దాలపాటు అమలులోవున్న ధరల నియంత్రణ విధానాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేయడంతో పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలొచ్చాయి. అయితే మోడీ అధికారానికి వచ్చాక డీజిల్ ధరలను డీకంట్రోల్ చేశారు. ప్రతి 15 రోజులకు ధరలు సవరించే విధానాన్ని రోజువారీ సవరణకు మార్చారు. ఇలా ఎన్ని మార్పులు చేసినా ఫలితం మాత్రం ప్రజలపై భారం వేయడం, ఖజానాకు మోసుకుపోవడమే!
కాంగ్రెస్ అధికారంలో వున్ననాటితో పోల్చితే మోడీ గద్దెనెక్కాకముడి చమురు ధర తగ్గింది. (ఇటీవల మాత్రం మళ్లీ పెరుగుతోంది) అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధర తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పైపైకి పెంచింది. ఇదీ మోడీ మాయాజాలం. ఇందుకు సర్కారుకు ఎక్సైజ్ పన్ను మంత్ర దండంగా ఉపయోగపడింది. భరించలేని ప్రజలు, ప్రతిపక్షాలు నిలదీయడంతో సుంకాన్ని ఎనిమిది రూపాయలు తగ్గిస్తామనిప్రకటించింది. కాని అదే రోజున మౌలిక వసతుల సెస్‌గా ఆ ఎనిమిది రూపాయలు వసూలు చేస్తామని చెప్పింది. అంటే ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో వెనక్కు తీసుకుంది. ఇంకా చెప్పాలంటే సుంకంపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా చెల్లిస్తారు. కాని సెస్ మొత్తం కేంద్ర ఖజానాకే జమవుతుంది. డబుల్ ధమాకా అన్నమాట.
రూపాయి విలువ దిగజారడంవల్ల కూడా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. అయితే ఆ పాపమూ కేంద్ర సర్కారుదే కదా! ఆర్థిక నిర్వహణలో లోపాలు, అమెరికాకు లొంగుబాటుగా వ్యవహరించే విదేశాంగ విధాన పర్యవసానమే అది. కేంద్ర ప్రభుత్వ ఆదాయం 2014-15లో రూ.11.89 లక్షల కోట్లు కాగా పిఒఎల్ ద్వారా సమకూరినది రూ.1.05 లక్షల కోట్లు. అంటే అది 8.83శాతం. 2018-19లో ఆదాయం రూ. 17.25 లక్షల కోట్లలో పిఒఎల్ ద్వారా రూ. 2.57 లక్షల కోట్లు గుంజుతోంది. అంటే ఇది 14.89 శాతానికి పెరిగింది. ఈ కాలంలోనే గ్రామీణ పేదలకు ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పనులకు కేంద్ర సర్కారు కేటాయింపు మారతం పెరగలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పిఒఎల్పై విధించిన పన్ను, సెస్‌ను తగ్గించాలి. ఒక మాజీ ఆర్థికమంత్రి సూచించినట్టు లీటర్ పెట్రోల్‌పై రూ.25 భారం తగ్గించడం సాధ్యమే. అందుకు రాజకీయ నిర్ణయం జరగాలి. మోడీ సర్కారు అలా చేయకపోతే రాజకీయ మార్గంలోనే ప్రజలు స్పందిస్తారు. -ఫీచర్స్ అండ్ పాలిటిక్స్
రేపు హర్తాళ్
