- వెక్కిరిస్తున్న వైద్యుల కొరత
- శిథిలమైన భవనాల్లోనే చికిత్స
ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి:
అనంతపురం జిల్లాలో సర్కారీ దవాఖానాకు సుస్తీ చేసింది. దీంతో నిరుపేదలకు వైద్యం అందడం లేదు. ఆస్పత్రి అభివృద్ధి కోసం పాలకులు రూ. కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటిస్తున్నా క్షేత్ర స్థాయిలో అందుకు తగ్గ ఫలితం మాత్రం పేద రోగులకు అందటం లేదు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని పిహెచ్‌సిని మూడు దశాబ్దాల క్రితం ప్రారంభించారు. ప్రతిరోజూ నాలుగొందల మంది చికిత్స కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనాలు ఎప్పుడు కూలుతాయోనన్న భయంతో రోగులు బిక్కుబిక్కుమంటూ చికిత్స కోసం వస్తున్నారు. నలుగురు వైద్యులు ఉండాల్సిన చోట ఇద్దరే చికిత్స అందిస్తున్నారు. అందులోనూ ఒకరు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండరు. దీంతో వందల మందికి ఒకరే వైద్యం అందిస్తున్నారు. 18 మంది ఎఎన్ఎంలు ఉండాల్సిన చోట12 మంది మాత్రమే ఉన్నారు.
నార్పల మండల పిహెచ్సిలోను ఇదే పరిస్థితి. దాదాపుగా 30 కిలోమీటర్లనుండి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇక్కడికి వైద్యం కోసం వస్తుంటారు. ఇక్కడ కూడా ఇద్దరు వైద్యులు ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవటంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అమరాపురం పిహెచ్సిలోను ఇదే పరిస్థితి. ఎఎన్ఎంలు 12 మంది ఉండాల్సిన చోట కేవలం ఏడుగురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు పిహెచ్‌సిలకు 2016 లో ప్రభుత్వం నిధులను మంజూరు చేసినా నేటికి వాటిని పట్టించుకోని పరిస్థితి.
ముదిగుబ్బ, నార్పల, అమరాపురం పిహెచ్సిలే కాదు. రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. జిల్లాలో 70 శాతం గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ విధానాల కారణంగా వైద్యం అందని దైన్యంగా మారింది. జిల్లాలో సుమారుగా 15 పిహెచ్‌సిలకు మరమ్మతులు చేయాల్సి ఉంది. స్థానిక నేతలు, అధికారులు వాటిని పట్టించుకోవటం లేదు. మరోవైపు ఎద్దులపల్లి పిహెచ్‌సికి కాంపౌండ్ వాల్ కోసం రూ.18 లక్షలు, కణేకల్ మండలం ఎర్రగుంట పిహెచ్సి రూ.16 లక్షలు, రామగిరి పేరూరు పిహెచ్‌సికి రూ.8 లక్షలు మరమ్మతుల నిమిత్తం ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించని పరిస్థితి. ఇదిలా వుంటే 2016లో తాడిపత్రి, నార్పల, ముదిగుబ్బ పిహెచ్‌సిలకు రూ.1.18 కోట్లు చొప్పున ప్రభుత్వం మంజూరు చేసినా నిర్లక్ష్యం వెంటాడుతోంది. ముదిగుబ్బ, నార్పలలో శిలాఫలకాలను వేసి ప్రజాప్రతినిధులు, అధికారులు చేతులు దులుపుకున్నారు. ఎపిఎంఎస్ఐడిసి అధికారులు లేకపోవటంతో పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.
జిల్లాలో మంజూరైన పోస్టులు, ఖాళీలు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా పిహెచ్సిలో 149 రెగ్యులర్, కాంట్రాక్టు వైద్యుల పోస్టులకు గాను 32 పోస్టులు, 1,199 మహిళా ఎఎన్ఎం పోస్టులకు 311, 428 మేల్ ఎఎన్ఎం పోస్టులకు 209, 73 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 16, 97 ఫార్మసిస్టులకు గాను 28, 219 స్టాఫ్ నర్సులకుగాను 30 పోస్టులు ఖాళీగా వున్నాయి.
నిర్లక్ష్యం తగదు
ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా నిర్లక్ష్యం కారణంగా ప్రజలు నష్టపోతున్నారు. పాలకుల వైఖరితో ఇప్పటికే నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందటం లేదు. ఇప్పటికైనా మరమ్మతులు చేయాల్సిన వాటికి వెంటనే చేయాలి.
- డాక్టర్ గేయానంద్, మాజీ ఎమ్మెల్సీ
సౌకర్యాలు మెరుగుపర్చాలి
జనాభా ప్రాతిపది కన వైద్యులను నియమించాలి. అందుకు తగ్గట్టుగా సిబ్బంది, ఇతర అవసరాలను అందు బాటులోకి తీసుకు రావాలి. ప్రసవం కోసం కదిరికి పంపుతున్నారు. ఇద్దరు డాక్టర్లు వుంటే అందులో ఒక్కరే స్థానికంగా వున్నారు. మరో ఇద్దరు వైద్యులను కేటాయించి మెరుగైన వైద్య సేవలు అందించాలి.
- సోమల ప్రకాష్ నాయుడు, ముదిగుబ్బ