- పంట ఎండుముఖం
- మరోసారి కరువు దిశగా కర్నూలు
- ఆందోళనలో రైతాంగం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి:
కర్నూలు జిల్లా మరోసారి కరువు వైపు దిశగా పయనిస్తోంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున ఈ ఏడాది పంట కాలువల కింద సాగు ఆశాజనకంగా ఉంటుందని భావన ఉన్నా నేటికీ ఇక్కడ వర్షాభావ పరిస్థితులే నెలకొన్నాయి. దీంతో వర్షాధార పంటలన్నీ సంక్షోభంలోకి పోయాయి. జిల్లాలో ఖరీఫ్ సాగు 15, 50,000 ఎకరాలు కాగా ఇప్పటికి కేవలం 6,25000 ఎకరాల్లో మాత్రమే సాగైంది. వర్షాలు ఆలస్యం కావడంతో ఖరీఫ్‌లో ప్రధాన పంట అయిన వేరుశనగ, పత్తి, కంది సాగుకు అదును తప్పింది. పత్తి 5,50,000 ఎకరాల్లో సాధారణ సాగుకు గాను ఇప్పటి వరకూ కేవలం 2.5లక్షల ఎకరాల్లో, వేరుశనగ 2.5 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా ఇప్పటి దాకా 1,12,500 వేల ఎకరాల్లో సాగైంది. కంది 1,57,600 ఎకరాల్లో సాగవాల్సి ఉండగా 87500 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ప్రధానమైన ఈ మూడు పంటలూ జులై చివరి వారానికే అదును తప్పాయి. ఆగస్టులో వేసినా దిగుబడులచ్చే పరిస్థితి లేదు. వీటితో పాటు మొక్కజొన్న, ఆముదం, జొన్న, సజ్జ, పెసరలాంటి పంటలను సాగు చేశారు. ఇప్పుడు సాగైన పంటలన్నీ మొలక దశలోనే ఉన్నాయి. మొలక దశలోనే వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటలు వాడుముఖం పట్టాయి. ఇప్పటికే సాగైన పంటలు వాడుముఖం పట్టగా ప్రధాన పంటల సాగుకు అదును తప్పడంతో ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జూన్‌లో 77 మిల్లీమీటర్ల సాధారణ సగటు వర్షపాతం గాను 73 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. జులై 117 మి.మీటర్లకు గాను దాదాపు నెలాఖరు కావస్తున్నా కేవలం 52 మి.మీటర్లు మాత్రమే సగటు వర్షపాతం నమోదైంది. జులైలో దాదాపు 60 శాతం లోటు వర్షపాతం నమోదవ్వడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. జూన్ మొదటి రెండు వారాలు భారీ వర్షాలు కురిసినా మూడో వారం నుంచి ఇప్పటిదాకా వర్షాలు కరువక పోవడంతో సాగుకాలేదు. గతేడాది ఇదే సమయానికి 7.5 లక్షల ఎకరాల్లో సాగైంది. జిల్లాలో కౌతాళం, ఆదోని, దేవనకొండ, దొర్నిపాడు, పాణ్యం, నందవరం మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కౌతాళం మండలంలో సగటు వర్షపాతం 91.6 మి.మీటర్లు కాగా ఇప్పటివరకూ కేవలం 6.2 మిల్లీమీటర్లు కురిసింది. పాణ్యం మండలంలో 128 మిల్లీ మీటర్లు సగటు వర్షపాతం కాగా కేవలం 17 మిల్లీ మీటర్లు నమోదైంది. దొర్నిపాడు 124 మిల్లీమీటర్లు కాగా 15 మిల్లీ మీటర్లు, దేవనకొండ 80 మిల్లీ మీటర్లు కాగా కేవలం 19 మిల్లీ మీటర్లు, ఆదోని 86 మిల్లీ మీటర్లు గాను 15 మిల్లీ మీటర్లు, నందవరం 85 మిల్లీ మీటర్లకు గాను 21 మిల్లీ మీటర్లు కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి
జిల్లాలో నెల కొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశనగ, పత్తి సాగు తగ్గింది. 40 శాతానికి మించి సాగు జరగని పరిస్థితి ఉంది. జులై తరువాత సాగుచేస్తే సాగుపై దిగుబడులపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలి
- ఉమామహేశ్వరరెడ్డి, ఎ.డి. వ్యవసాయ శాఖ
పెట్టుబడి అంతా మట్టిపాలైంది
రెండెకరాల్లో వేరు శనగ సాగుచేశా. 20 రోజులుగా వానలు కురవకపోవడంతో పంట వాడుముఖం పట్టింది. ఇప్పుడు వాన కురవకపోతే పెట్టిన పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోతుంది.
-వెంకటేశ్వర్లు, బిల్లేకల్లు, ఆస్పరి మండలం