- ప్రభుత్వ అరకొర విత్తన కేటాయింపుల ఫలితం
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి:
వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చుతామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా ఉన్నాయి. ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే విత్తనాల కోసం రైతులు యాతనకు గురి కావాల్సి వస్తోంది. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులకూ అవస్థలు తప్పడం లేదు. విత్తనాల కేటాయింపు అరకొరగా ఉండడమే ఇందుకు కారణం. విజయనగరం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా సుమారు 1.97 లక్షల ఎకరాల విస్తీర్ణం (65 శాతం)లో 1001 రకం, మిగిలిన విస్తీర్ణంలో 1075, బిపిటి సన్నాలు, స్వర్ణ, సోనామసూరి తదితర రకాలు పండించే అవకాశం ఉందని ప్రణాళిక రూపొందించింది. ఈ మొత్తం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాల్లో 30 శాతం విత్తనాలను మాత్రమే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చుకుంది. ఈ లెక్కన 1001 రకం విత్తనాలు 29 వేల క్వింటాళ్లను జిల్లాకు రప్పించింది. ఇప్పటివరకూ 27 వేల క్వింటాళ్లు పంపిణీ చేశామని వ్యవసాయ శాఖ జెడి లీలావతి 'ప్రజాశక్తి'కి తెలిపారు. మొత్తం అన్ని రకాలూ కలిపి 41,050 క్వింటాళ్లు పంపిణీ చేయాల్సి ఉండగా, 42 వేల క్వింటాళ్ల మేర పంపిణీ చేశామని చెప్పారు. విత్తనాలను అధికారులు ముందు వచ్చిన రైతులకు పంపిణీ చేశారు. మిగిలిన రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. విత్త నాల కొరతతో ఆగ్రహానికి గురైన రైతులు నాలుగు రోజుల క్రితం గంట్యాడ, అంతకు ముందు పార్వతీ పురం ఎఒ కార్యాలయాలకు తాళం వేశారు. జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోల పరంపర కొనసాగుతూనే ఉంది.
అధిక ధరకు ప్రయివేట్ విత్తనాలు కొనాల్సిన దుస్థితి
ఈ ఏడాది వరి విత్తనాలపై కాస్త సబ్సిడీని ప్రభుత్వం పెంచింది. 1001 విత్తనాలు 30 కేజీల బస్తా ధర రూ.846 ఉంది. రూ.300 రాయితీపోగా రూ.546కు సరఫరా చేసింది. ప్రస్తుతం విత్తనాలు లేకపోవడంతో ప్రయివేటు దుకాణాల్లో రూ.850 నుంచి రూ.900 చొప్పున కొనుక్కోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తమ గ్రామానికి ప్రభుత్వ విత్తనాలు ఒక్క బస్తా కూడా ఇవ్వలేదని దత్తిరాజేరు మండలం పోరలి సర్పంచ్ మిత్తిరెడ్డి ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన బాది అప్పలనాయు డుకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఎకరాకు ఆరు బస్తాల విత్తనాలు అవస రం. ప్రభుత్వం తరపున ఒక్క బస్తా కూడా అందలేదు. ప్రతి గ్రామంలోనూ దాదాపు ఇటువంటి పరిస్థితే ఉంది.
ఏటా చేతులెత్తేస్తున్న ప్రభుత్వం
రైతులను ఏటా అనావృష్టి లేదా అతివృష్టి వెంటాడుతోంది. పంట చేతికొచ్చే సమయంలో వరి నీటి ముంపునకు గురవుతోంది. కోసి మడుల్లో అరబె ట్టిన వరి పనలు వర్షానికి తడిసిపోతున్నాయి. దీం తో, విత్తనాలుగా ఉపయోగించేందుకు ఈ ధాన్యం పనికి రావడంలేదు. ఇటువంటి రైతులంతా విత్తనాల కోసం ప్రభుత్వ, ప్రయివేట్ విత్తనాలపై ఆధారపడు తున్నారు. ఇటువంటి వాటిని, క్షేత్ర స్థాయి పరి స్థితులను పరిగణనలోకి తీసుకుండా ప్రభుత్వ వ్యవ హరిస్తుండగంతో విత్తనాల కొరత తలెత్తుతోంది.
ఒత్తిడికి లోనవుతున్న వ్యవసాయాధికారులు
రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం విత్తనాలను సరఫరా చేయలేకపోతోందని, విత్తనాల కోసం అధికార, ప్రధాన ప్రతిపక్ష నాయకులు తమపై ఒత్తిడి చేస్తున్నారని వ్యవసాయ శాఖాధికారులు వాపోతున్నారు. ఈ నెల తొమ్మిదిన గజపతిన గరం మండల వ్యవసాయ శాఖాధికారి టి.సం గీత లోబీపీతో విత్తన పంపిణీ కేంద్రం వద్దే సొమ్మసిల్లి ఆస్పత్రిపాలైంది. అంతకుముందు దత్తిరాజేరు మండల వ్యవసాయాధికారి కె.గోవిందమ్మకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.