పెద్దల పొదుపు పథకంలో అగ్రగామిగా నిలుస్తోంది సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకంపై ఆకర్షణీయంగా 8.7 శాతం వడ్డీ రేటు ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. మార్చి, జూన్, సెప్టెంబర్, డిసెంబర్ నెల చివరి తేదీల్లో ఈ వడ్డీని పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాలో జమచేస్తారు. కనీసం 1000 రూపాయలు మొదలుకుని, గరిష్ఠంగా రూ.15 లక్షలు ఈ పథకం కింద పెట్టుబడి పెట్టవచ్చు. యుక్తవయసు వారికి ఇందులో చేరేందుకు అవకాశం లేదు. అరవై ఏళ్ల వయసు వారు లేదా ఆపై వయసు వారు ఇందులో పెట్టుబడికి అర్హులు. అలాగే, ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారు 55 ఏళ్ల నుంచి ఇందులో చేరవచ్చు. పదవీ విమరణ నగదు ప్రయోజనాలు అందుకున్న నెలలోపు ఈ పథకంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కాల వ్యవధి ఐదేళ్లు. వ్యక్తిగతంగానూ, జీవిత భాగస్వామితో కలసి కూడా ఒకటి లేదా అంతకుమించిన ఖాతాలను నిర్వహించుకునే సౌలభ్యం ఉంది. అయితే, వ్యక్తిగత గరిష్ఠ పరిమితి 15 లక్షలు అనేది అన్నింటికీ కలిపి వర్తిస్తుంది. లక్ష రూపాయల వరకు నగదు రూపంలో డిపాజిట్ చేసేందుకు అనుమతిస్తారు. అంతకుమించిన విలువ మొత్తం అయితే చెక్ రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఖాతాను మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకునే అవకాశమూ ఉంది. ఏడాది తర్వాత ముందస్తుగా డిపాజిట్ రద్దు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకు 1.5 శాతం మొత్తాన్ని డిపాజిట్ నుంచి మినహాయించు కుంటారు. రెండేళ్ల తర్వాత రద్దు చేసుకుంటే కేవలం ఒక శాతాన్ని మాత్రమే మినహాయించు కుంటారు. సాధారణ కాలపరిమితి ఐదేళ్లు కాగా, ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. అయితే, ఐదేళ్ల తర్వాత ఎప్పుడు రద్దు చేసుకున్నా ఎటువంటి కోతా విధించరు. ఏడాదికి 10 వేల రూపాయలకు మించి వడ్డీ ఆదాయం ఉంటే మూలం వద్ద పన్ను కోత ఉంటుంది. అయితే, ఈ పథకంలో పెట్టే పెట్టుబడికి సెక్షన్ 80సీ ఆదాయపన్ను మినహాయింపు సౌలభ్యం కల్పించారు. వృద్ధాప్యంలో ఆసరాగా కనిపించే ఇలాంటి పథకాలు వారికి ఎంతగానో భరోసాను కల్పిస్తాయి. అందుకే ఇటీవల ఈ పొదుపు పథకం మంచి ఆదరణ పొందింది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌తో భరోసా!
