ప్రస్తుతం బ్యాంకు అకౌంట్ లేనివాళ్ళను వేళ్ళపై లెక్కపెట్టొచ్చు. పేద, ధనిక, ఉద్యోగులు, కార్మికులు, చిన్నచితకా వ్యాపారస్తులు ఇలా అందరికీ బ్యాంకు ఖాతా ఉండటం అనివార్యమైంది. అయితే, మన ఖాతాలో అంతో ఇంతో మన ప్రమేయం లేకుండా డబ్బులు తగ్గిపోవడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. ఇందుకు కారణం మినిమ్ బ్యాలెన్స్ లేకపోవడమే అని బ్యాంకులు చెబుతున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఏ పరిస్థితుల్లో బ్యాంకులు సర్వీసు ఛార్జీల రూపంలో కోత విధిస్తున్నాయో.. అనే విషయాలపై అవగాహన ఉంటే.. వినియోగ ఛార్జీల రూపంలో నష్టపోయే ప్రమాదం తగ్గుతుంది.
తాజా పరిస్థితుల్లో బ్యాంకు పొదుపు ఖాతాలో కనీస నిల్వ ఉంచడం తప్పనిసరి. లేకుంటే రుసుముల భారం తప్పదు. అంతేకాదు, పరిమితికి మించి ఏటీఎం లావాదేవీలు నిర్వహించినా కొంత రుసుము భరించాల్సిందే. ఇటీవల కాలంలో బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయాలతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలయ్యింది. అందుకే పెరిగిన సేవా రుసుములు భారం కాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం.
కనీస నిల్వ ఉండాలి
బ్యాంకు పొదుపు ఖాతాలో కనీస నిల్వ లేకుంటే అపరాధ రుసుము విధించే విధానం ఎప్పటి నుంచో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతోపాటు, ఆంధ్రాబ్యాంక్, వైశ్యాబ్యాంక్ ఇలా కొన్ని బ్యాంకులు పొదుపు ఖాతాలో కనీస నిల్వ అవసరం లేకుండా కొన్నేళ్లపాటు వెసులుబాటు కల్పించాయి. ప్రస్తుతం దీన్ని తీసేశాయి.
కొన్ని బ్యాంకులు, నెలవారీ సగటు నిల్వను (యావరేజ్ బ్యాలెన్స్), మరికొన్ని త్రైమాసిక సగటు నిల్వలను ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెలవారీ కనీస సగటు నిల్వను పరిగణనలోకి తీసుకుంటుండగా, ఆంధ్రాబ్యాంకు మూడు నెలల సగటు నిల్వలను లెక్కిస్తోంది.
ప్రాంతాన్ని బట్టి ఛార్జీలు
పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు ఖాతా ఉన్న వారు నెలవారీ సగటు నిల్వ రూ.1,000 ఉంచినా చాలు. చాలా బ్యాంకుల్లో ఇదే విధానం అమల్లో ఉంది. అంటే, ఒక్క రోజు రూ.30,000 లేదా రెండు రోజులపాటు రూ.15,000, నాలుగు రోజులపాటు రూ.8,000, ఎనిమిది రోజులపాటు రూ.4,000 ఉన్నా చాలు. ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులూ కార్పొరేట్ శాలరీ అకౌంట్లను అందిస్తున్నాయి. ఈ తరహా ఖాతాల్లో ఎలాంటి సగటు నిల్వ అవసరం లేదు. పలు ప్రైవేటు బ్యాంకులు కనీస నిల్వ నిబంధన పాటించని ఖాతాదారులకు రూ.100 నుంచి రూ.600 వరకూ రుసుములు విధిస్తున్నాయి.
ఏటీఎంలు-సర్వీసు ఛార్జీలు
ఏటీఎం లావాదేవీల విషయంలోనూ బ్యాంకులు కొన్ని పరిమితులు విధించాయి. మెట్రో నగరాల్లో నెలకు మూడు, ఇతర నగరాల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా లభిస్తాయి. కాబట్టి, ఉద్యోగులు తన జీతం రాగానే తన పొదుపు ఖాతా నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని తన జీవిత భాగస్వామి, పిల్లల పేరుతో ఉన్న ఖాతాలోకి మళ్లించాలి. దీనికోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఖాతాలైతే నామమాత్రపు రుసుములు ఉంటాయి. అదే బ్యాంకు ఖాతాకు ఎలాంటి రుసుములు ఉండవు. దీనివల్ల ఏటీఎం లావాదేవీలను గరిష్టంగా ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది. ఎస్బీఐలో నెలవారీ సగటు నిల్వ రూ.25 వేల కంటే ఎక్కువ ఉన్న వారికి అపరిమిత లావాదేవీలు ఉచితంగా లభిస్తున్నాయి. ఇలాంటి అవకాశం మీ బ్యాంకు కల్పిస్తోందా? లేదా అనే విషయం.. ఒకసారి మీ బ్యాంకు శాఖను సంప్రదిస్తే మంచిది.
