జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్పేవారు అతి తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే జీవితమంటేనే ఒడుదుడుకుల ప్రయాణం. ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో చెప్పడం కష్టమే. సాధ్యమైనంత జాగ్రత్తగా ఉండటమే మన చేతుల్లో ఉండేది. ఒక్కోసారి ప్రమాదాల్లో అత్యంత విలువైనవి కోల్పోయినా ఏమీ కానట్టు ధైర్యంగా నిలబడతారు కొందరు. జీవితాన్ని నిజంగా ప్రేమించేవారే అలా ఉండగలరు. అలాంటి వ్యక్తే కేరళకు చెందిన 24 ఏళ్ల యువకుడు వైషక్.
పదకొండేళ్ళ క్రితం నాటి మాట.
ఐసియూలో తను మగతగా మూలుగుతున్నాడు. తన కుడి కాలులో సలపరంపుట్టే నొప్పి. పక్కనే ఉన్న తన అంకుల్‌తో కాలుని మర్దనా చేయమని అడిగాడు. వెంటనే తన అంకుల్ దుఃఖాన్ని ఆపుకోలేక బయటకి పరుగెత్తడం గమనించాడు వైషక్. ఆ మగతలోనే తన కాలుని తానే మర్దనా చేసుకోవడానికి చేయి కదిపాడు. అయితే చేతికి ఎలాంటి స్పర్శా తగలలేదు. ఆశ్చర్యంతో లేచి చూసిన వైషక్ మెదడు కొంతసేపు మొద్దుబారింది. తన కుడికాలు కనిపించలేదు.
చిన్నతనంలో అందరికీ ఉన్నట్లే వైషక్ జీవితంలోనూ కోరికలుండేవి. అయితే మిలటరీలో చేరాలని, లేకపోతే ఫుట్‌బాల్ ప్లేయర్్గా రాణించాలనే కలలు కనేవాడు. నాలుగు గోడల మధ్య కూర్చొని చదవడం కంటే బయట వాతావరణంలో గడపడమంటేనే వైషక్కు ఎక్కువ ఇష్టం. సెలవలొచ్చాయంటే చాలు స్నేహితులతో కలిసి రోజంతా ఫుట్‌బాల్ ఆటతోనే గడిపేవాడు. తనకు 13 ఏళ్ల వయసున్నప్పుడు కాలికట్లో ఫుట్‌బాల్ జట్టు కోసం సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలాగైనా అందులో ఎంపికవ్వాలనే బలమైన కోరికతో అప్పటికే చాలా ప్రాక్టీస్ చేసుకున్నాడు వైషక్. సెలక్షన్లు జరిగే ప్రాంగణానికి వెళ్లడానికి తన సోదరుడు బైక్ పైన బయలుదేరాడు. బైక్ స్టార్ట్ అయిన కొంతసేపటికే ఒక బస్ చాలా వేగంగా వచ్చి ఢ కొట్టింది. రక్తసిక్తమై రోడ్డుపై పడున్న వైషక్ కాలిపైన మరో వాహనం ఎక్కింది. అప్పుడు తన నోటి వెంట 'నేను ఇక బతకను' అనే మాట పదేపదే వచ్చిందని.. సంఘటన జరిగిన తర్వాత చుట్టు పక్కల వాళ్లు చెప్పారు వైషక్కి. ఆపరేషన్ తర్వాత తన దేహంలో ఒక కాలు కోల్పోయాడు. మరో కాలికి రాడ్డుతో సహకారం అవసరమయ్యింది. ఇంత జరిగినా వైషక్ మనసులో ఉన్నదల్లా ఒకటే ఆలోచన 'ఇకపై నేను ఫుట్‌బాల్ ఆడటం ఎలా?'
కొన్ని నెలలు తన ఎడమ మోకాలు పట్టు సాధించడానికి ఫిజియోథెరపీ చికిత్స తీసుకున్నాడు. తనపై ఎక్కడ జాలి చూపిస్తారోనని ఎవ్వరికీ తన బాధను చెప్పుకోకపోగా అందరితో మామూలుగానే ఉండటానికి ప్రయత్నించేవాడు. ఈ సాధనలో తన స్నేహితులు మరింత సహకారం అందించారు. పాఠశాల పూర్తవ్వగానే స్నేహితులంతా వచ్చి వైషక్తో కారమ్స్, చెస్ లాంటి ఆటలు ఆడేవాళ్లు. ఇలా ఒక ఏడాది గడిచింది. ఇక ఇంట్లోనే ఉండలేకపోయాడు వైషక్. తన సైకిల్ పట్టుకొని బయటకి వచ్చాడు. ఒక్క కాలితో చాలా శ్రమ కోర్చి, సైకిల్ని తొక్కగలిగాడు. ఇదే ప్రేరణతో ఒక్కకాలితో ఈదడమే కాదు, కారు నడపడమూ నేర్చుకున్నాడు. అయితే తన రెండు చేతుల్లో క్రచ్చస్ ఉన్నప్పుడు చాలా వేగంగా నడవడం గమనించాడు. ఇంత వేగంగా నడవగలిగినప్పుడు బాల్ని కూడా వేగంగానే కొట్టగలను కదా అనుకున్నాడు. అంతే తనకు అత్యంత ఇష్టమైన ఫుట్‌బాల్ గ్రౌండ్‌కి పరుగులు పెట్టాడు. ఇప్పుడు ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు తాను చేసే ఫౌల్ని స్నేహితులు ఫౌల్గానే గుర్తిస్తుంటే మిగతా ఆటగాళ్లకు లాగానే తననీ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్‌గానే చూస్తున్నారని గర్వపడతాడు వైషక్.
అంగవైకల్యంతో ఆడే క్రీడల్లో ఫుట్‌బాల్ లేదని తెలుసుకున్న వైషక్ కేరళ తరఫున భారత జాతీయ జట్టులో వాలీబాల్ క్రీడాకారుడిగా అందర్నీ మెప్పించాడు. అయితే ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గానే ఉండాలనే తన కోరికకు ఇటీవలే ఒక ఊతం దొరికింది. ఈ మధ్యనే ఇండియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ అంగవైకల్యమున్న ఫుట్‌బాల్ క్రీడాకారులను ఏషియన్ కప్‌లో ఆడటానికి మొట్టమొదటిసారి ప్రయత్నం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ టీమ్‌లో వైషక్ కూడా ఒక సభ్యుడు. అధికారికంగా వైషక్ భారత ఆంప్యూటీ ఫుట్‌బాల్ జట్టులో సభ్యుడు.
కలతలోనూ కల సాకారం
