సాంద్ర వ్యవసాయంలో పంటల సాగు అతి ముఖ్యమైంది. సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా, ఎన్నుకొన్న పంటల్నే అధిక విస్తీర్ణంలో కేంద్రీకరించి సాగు చెయ్యటం ద్వారా అనేక అనుకూలతల్ని అందుకొన్నప్పటికీ, కొన్ని ప్రతికూలతల్నీ ఎదుర్కొంటున్నాం. అందులో 'బెడద జీవుల' దాడి అతి ముఖ్యమైనది. అనగా పైర్లతో పోటీ పడి పరాన్నజీవులుగా పెరిగే వివిధ రకాల ప్రాణులివి. వీటివల్ల పంటకు కలిగే నష్టమేమిటి? ఈ బెడద పురుగుల లక్షణాలేమిటి? ఇది ఎలా విస్తరిస్తూ.. దాడికి పాల్పడుతుంది? ఈ వారం 'అగ్రిప్లస్'లో తెలుసుకుందాం!
ఈ మధ్య కాలంలో ఈ బెడద పురుగుల వల్ల నష్టం పెరగటాన్ని తరచుగా చూస్తూనే ఉన్నాం. అదిగో ఆ తరహాకు చెందిందే ప్రస్తుతం మన పంటలపై నష్టకర పురుగ్గా గుర్తించబడ్డ 'కత్తెర (కటింగ్)' లద్దెపురుగు.
బెడద జీవులంటే?
ఇవి కంటికి కనపడే పురుగులు. తవిటి పురుగులు (మైట్స్), పక్షులు, పలు రకాల క్షీరదాలు, కలుపుమొక్కలు. ఇక కంటికి కనపడనివీ ఉన్నాయి. నులిపురుగులు (నెమటోడ్స్), బూజులు, బ్యాక్టీరియాలు, వైరస్లు, మైకో ప్లాస్మాలు మొదలైనవి. పంట గింజలు చెట్ల భాగాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరించినట్లే, ఈ బెడద జీవులు తరచుగా వివిధ వ్యవసాయక ప్రాంతాలకు విస్తరిస్తూ పోవటం అతి సహజమైన విషయం. అయితే కొన్ని సందర్భాల్లో ఈ బెడద జీవులు కొత్త ప్రాంతాల్లో అనూహ్య స్థాయిలో విస్తరించి, పంటల్ని నాశనం చేయటం ద్వారా తీరని నష్టం కలుగజేస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం. ఈ బెడద జీవుల్ని సహజంగా అదుపులో ఉంచగల నియంత్రణా వాతావరణం ముఖ్యంగా బదనికలు (పారసైట్స్, ప్రిడేటర్స్) ఆ కొత్త ప్రాంతాల్లో లేకపోవటం. దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా దేశాలు పరాయి ప్రాంతాల నుంచి సేకరించబడిన విత్తనాలు, ఆహార పదార్థాలు వృక్ష-జంతు భాగాలపై నిఘా కార్యక్రమాల్ని (క్వారంటైన్) అమలు చేస్తున్నాయి. అయినా కొన్ని రకాల బెడద జీవులు పరాయి ప్రాంతాలకు విస్తరిస్తూనే ఉన్నాయి. వీటిని దాడి (యిన్ వేజివ్) జీవులు అంటున్నాము.
వీటి వివరాలు తెలుసుకొనే ముందు, గత దశాబ్దకాలంలో మన వ్యవసాయంలోకి ప్రవేశించిన నూతన పరాయి ప్రాంతపు పురుగుల గురించి తెలుసుకొంటే ఈ కత్తెర పురుగు ఎంత ప్రమాదకరంగా మారబోతుందో అర్థమౌతుంది.
ఇదీ.. బెడద పురుగుల చరిత్ర
దక్షిణ అమెరికా దీవుల నుంచి మన దేశంలోకి ప్రవేశించిన సిల్లిడ్ 'హెటెరోపిల్లా క్యుబానా' ఒక ముఖ్య బెడద పురుగు. ఇది వివిధ పండ్ల పైర్లపై నష్టం కలిగిస్తుంది. అలానే అమెరికా పాముపొడ ఈగ (సర్పెంటైన్ లీఫ్ మైనర్) అతి వేగంగా మన కూరగాయ పైర్లపై దాడి చేసే స్థాయికొచ్చింది. శ్రీలంక నుంచి వచ్చిన కాఫీ గింజ పురుగు (హైపొథినెమస్ హామ్పై) ఎంత నష్టకరమో తెలుస్తూనే ఉంది. అనేక వైరస్ తెగుళ్లను అతి వేగంగా పలు పంటలపై పాకించగల స్పైరల్ తెల్ల దోమలు (అలిరోడికస్ డిస్పర్స్స్), సిల్వర్ లీఫ్ తెల్లదోమలు (బెమిసియా అర్జెంటెపోలి) తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఆ మధ్య ప్రవేశించిన పురుగుల దాయాది (మైట్) ఎసిరియా గుఎర్రినిస్ కొబ్బరి పంటను ఎంత నాశనం చేస్తున్నదో చూస్తూనే ఉన్నాం. అదిగో వాటిలాగానే ఇప్పుడు ఈ 'కత్తెర పురుగు' మన దేశంలోకి ప్రవేశించిందని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
జులై 2018 నాటికి అది కర్నాటక రాష్ట్ర మొక్కజొన్న, జొన్న పైర్లపై దాడి పురుగు (యివ్వేజివ్ స్పిసీస్) స్థాయిలో గుర్తించారు. భారత అనుసంధాన పరిషత్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ ) వారు తక్షణమే హెచ్చరిక జారీ చేశారు. డిఎన్ఎ పరీక్షల ద్వారా దాని ప్రత్యేకతను నిర్ధారించారు.
విదేశాల్లోనూ బెడదే!
ఉత్తర అమెరికా దేశాల్లో మొక్కజొన్నను నష్టపరిచే అతి ముఖ్య బెడద జీవి ఈ కత్తెర పురుగు. దీన్ని ఆ దేశాల్లో స్థానికంగా 'ఫాల్ ఆర్మీ వర్మ్' అని పిలుస్తారు. అంటే మంచు కురిసే కాలంలో గండు (గుంపు)గా దాడి చేసే పురుగని అర్థం చేసుకోవాలి. ఈ పురుగు అనుకూల పరిస్థితుల్లో అతివేగంగా వృద్ధి చెంది, మొక్కజొన్న పైరులను నాశనం చేస్తుంది. దీన్ని అదుపులో ఉంచటం చాలా కష్టమైన పని. అదుపుకోసం వాడే ప్రక్రియలెక్కువ. మొక్కజొన్న సాగు పెట్టుబడిని పెంచటమేగాక, పర్యావరణానికి ప్రజారోగ్యానికి నష్టకరమని గుర్తించారు. ఈ పురుగు 2016లో ఆఫ్రికా దేశంలోకి ప్రవేశించగలిగిందని గమనించారు. 44 ఆఫ్రికా దేశాల్లో దాదాపు 30 కోట్ల మందికి ముఖ్య ఆహార పంటగా ఉన్న మొక్కజొన్న దిగుబళ్లను ఈ బెడద పురుగు దిగజార్చుతోంది.
కత్తెర పురుగు ప్రత్యేకతలు
పొలుసు రెక్కల పురుగుల వరుసలో అతిముఖ్య బెడద జీవుల నిలయం 'నాక్టిడే' కుటుంబం. అదిగో ఆ కుటుంబానికి చెందిందే ఈ కత్తెర పురుగు. దీన్ని జంతుశాస్త్రపరంగా 'స్ఫోడొప్టెరా ప్రూజిపెర్డా' పేరుతో పిలుస్తారు. ఇది మన పొగాకు లద్దెపురుగు, మిరప గూడుపురుగు, మొలకల మోడు పురుగుల చుట్టమే! అత్యంత వైవిధ్యమైన సాగు పంటల్ని నాశనం చెయ్యగల హిలియోధిస్ (శనగపచ్చ పురుగు, పత్తి కాయతొల్చే పురుగు, టమాటా కాయపురుగు, మొక్కజొన్న కండె పురుగు)లకు కూడా దగ్గరి బంధువు. మనం వరి పైరు కంకి పురుగ్గా (మితిమ్నా) తరచుగా ఎదుర్కొంటున్న బెడద జీవికి కూడా ఇది దాయాది. దీన్నిబట్టి ఇదెంత ముఖ్యమైన ప్రమాదకర లక్షణాలున్న బెడద పురుగో అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా మొక్కజొన్న, జొన్న, వరి వంటి ముఖ్య ఆహార పంటలపైనా, ఇంకా వివిధ రకాలైన మొక్కలపైనా దాడి చెయ్యగలదు. సంవత్సరమంతా తన జీవనచక్రాల్ని నడపగలదు. ఆఫ్రికా, ఆసియా ఖండాల ఉష్ణ వాతావరణంలో ఈ పురుగుకి అనుకూలతలు ఎక్కువ.
దాదాపు పొగాకు రెక్కల తల్లి పురుగు పరిమాణంలోనూ, ఆకారంలోనూ ఉన్న ఈ కత్తెర పురుగు తల్లి దశ కూడా భూమిలోని నిద్ర దశ నుంచే బయటకొస్తుంది. అది మొక్కలపై గుడ్లు పెట్టగలదు. ఇది కూడా గుంపులుగానే గుడ్లు మొక్క ఆకులపై పెడుతుంది. అవి 2-7 రోజుల్లో పగిలి, లార్వాదశలో ఎక్కువకాలం వ్యాపిస్తాయి. ఈ లార్వా ఆకారం ద్వారా దీన్ని గుర్తించవచ్చు. నోటి భాగాల దగ్గర 'వై' ఆకారపు పెంకు రూపం కనపడుతుంది. ఇది తల భాగాలకు భిన్నమైన రంగులో ఉంటుంది. అలానే గుండ్రటి ఆకారపు గోధుమ రంగు మచ్చలకు అంటుకొనుండే వెంట్రుకలు దీని శరీరంపై ఉంటాయి. చివరి కణుపులపై చతురస్రాకారపు మచ్చలుంటాయి. దీని శరీర రంగు ఆహారాన్ని బట్టి మారుతుంది. గోధురరంగు నుంచి పచ్చ, నలుపు రంగుల కలయిక వర్ణంలోకి ఇది మారగలదు.
ఈ దశలో (నష్టకర దశ) నెల రోజులకు పైగా గడుపుతూ మొక్కల వివిధ భాగాల్ని తింటూ బతుకుతుంది. తరువాత ప్యూపాదశ (ఎద్రదశ) ఎక్కువగా భూమి పైపొరల్లో గడుపుతుంది. మొత్తం మీద ఈ పురుగు జీవితచక్రం వివిధ దశల్లో 40-55 రోజుల పాటు ఉంటుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో, ఇది 7-8 జీవిత చక్రాల్ని నడపగలదని గుర్తించారు. వివిధ రకాల పంటల సాగు నడిచే ప్రాంతాల్లో ఇది అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. 2018 జులైలో కర్నాటకలో గుర్తించబడ్డ ఈ కత్తెర పురుగు అతి వేగంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు పాకగలదని నిపుణులు హెచ్చరిక జారీ చేశారు. ఈ పురుగు నిఘా కార్యక్రమాలపై శ్రద్ధ వహించాలనేది వారి సేచన. ఈ పురుగు పరాయి ప్రాంతాల్నుంచి వచ్చిన నేపథ్యంలో దీన్ని సహజంగా అదుపులో ఉంచగల బదనికలు మన దగ్గర తక్కువ. ఇప్పటి వరకు మచ్చల పెంకుపురుగులు, అక్షింత పురుగులే వీటి గుడ్లను, చిన్న లార్వాల్ని తింటున్నట్లు గమనించారు. అదే విధంగా వీటికి జబ్బు కల్గించే నొమేరియం బూజు ఉనికిని కూడా గుర్తించారు. అయినా వీటి ప్రాబల్యం ఆ బెడద పురుగుపై ఉండేట్లు లేదు. కాబట్టి పైరత్రాయిడ్ వంటి ఘాటు రసాయనాలపై ఆధారపడక తప్పదంటున్నారు స్థానిక కీటక శాస్త్రవేత్తలు. అందుకే ఈ పురుగును 'పిలవకుండా ప్రవేశించిన అమెరికా అతిథి' అన్నాడొక విశ్లేషకుడు.
- ప్రొ|| యన్. వేణుగోపాలరావు
శాస్త్రవేత్త (రిటైర్డ్)
ఎఎన్జిఆర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ