షాపుల్లో చిన్నపాటి కర్చీఫ్ కొనే విషయంలో.. ఆ వస్తువు నాణ్యత విషయంలో ఒకటికి రెండుసార్లు.. ఆ వస్తువుని చూసి, పరిశీలించిగానీ కొనం. అలాంటిది జీవితానికి భరోసాను ఇస్తాయనుకునే జీవిత బీమా పాలసీల విషయాల్లో ఇంకెంతో పరిశీలన, అవగాహనతో సరైన నిర్ణయం తీసుకోవాలి. జీవితబీమా పాలసీ.. అనేది మన కుటుంబానికి ఆర్థికపరమైన రక్షణ కల్పిస్తుందా? లేదా? ఉద్యోగ విరమణ తర్వాత ఉపయోగపడుతుందా? లేదా? అనేది చూడాలి. అలాగే టెర్మ్ పాలసీలు అంటే ఏమిటి? ఏదైనా ఒక బీమాపాలసీ ప్రారంభించేటప్పుడు అనుసరించాల్సిన వ్యూహాలేంటి? అనే విషయాలు ఈ వారం 'రూపాయి'లో తెలుసుకుందాం!
కొంతమంది జీవిత బీమా పాలసీ తీసుకునేందుకు రోజుల తరబడీ ఆలోచిస్తారు. తమ కుటుంబానికి సరైన ఆర్థిక రక్షణ కల్పిస్తున్నామా? లేదా? అందుకు తీసుకోబోయే పాలసీ సరిపోతుందా? అని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. అలా చేయడం ఒకందుకు మంచిదే. అయితే ఆలోచించడం వేరు. అనుమానాలతో కాలయాపన చేయడం వేరు. ఆలోచిస్తూ కాలయాపన చేయడం కారణంగా బీమా పాలసీల వల్ల కలిగే ప్రయోజనాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే, బీమా పాలసీ తీసుకోవాలనే ఆలోచన రాగానే వాటికిగల మంచి చెడుల గురించి త్వరతగతిన తెలుసుకోవాలి.
హడావుడి వద్దు
ముందుగా తెలుసుకోకుండా... హడావుడిగా పాలసీ ఎంచుకోవడం ఎప్పుడూ పొరపాటే. ఒక పాలసీని ఎంపిక చేసుకునేప్పుడు సాధారణంగా చేయకూడని కొన్ని పొరపాట్లనూ ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఒక జీవితబీమా పాలసీని మనకు ఎవరైనా అమ్మాలని ప్రయత్నిస్తుంటే.. అది కొనేముందు దానికి సంబంధించిన అన్ని వివరాలూ తెలుసుకోవాలి. ఒకవేళ అనుమానాలుంటే.. దగ్గరలో ఉన్న ఆర్థిక సలహాదారునో, సంబంధిత బీమా ఏజెంట్నో సంప్రదించి, మన అవసరాలకు ఆ పాలసీ ఎంత మేరకు సరిపోతుందో తెలుసుకోవాలి. ఒకవేళ బీమా కంపెనీ ఏజెంట్ పదే పదే.. పాలసీ తీసుకోమని వత్తిడి చేస్తుంటే.. అనుమాన నివృత్తి కోసం మరొకరిని సంప్రదించడంలో తప్పులేదు.
క్షుణ్ణంగా చదవాలి!
జీవిత బీమా ఒప్పంద పత్రం.. ఒకటి ఉంటుంది. ఇది బీమా సంస్థకూ.. మనకూ మధ్య ముఖ్యమైన పత్రం. కానీ, చాలామంది ఇందులోని పూర్తివివరాలు తెలుసుకోకుండానే సంతకం చేసేస్తుంటారు. పాలసీ విక్రయించే వ్యక్తికి దాన్ని పూర్తిచేసే బాధ్యతను అప్పగించేస్తుంటారు. ఇలా చేయడం పొరపాటే. జీవిత బీమా అంటే.. మనకూ బీమా సంస్థకు మధ్య కుదిరే ఒక నమ్మకమైన ఒప్పందం. ప్రతిపాదిత పత్రంలో మనం పేర్కొన్న వివరాలన్నీ నిజాలే అని బీమా సంస్థ నమ్ముతుందన్నమాట. మన ఆరోగ్యం, వృత్తి / వ్యాపారం, కుటుంబ చరిత్ర, జీవనశైలి వంటివి బీమా పాలసీ ఒప్పందంలో కీలకం. వీటికి సంబంధించిన సమాచారంలో తప్పులు ఉంటే.. కొన్నిసార్లు బీమా క్లెయింను తిరస్కరించడానికీ అవకాశముంది.
పాలసీని అర్థం చేసుకోవాలి!
మన చేతికి పాలసీపత్రం వచ్చిన తర్వాత అందులో ఉన్న వివరాలన్నీ సరిగా ఉన్నాయా లేదా? చూసుకోవాల్సిన బాధ్యత మనదే. పాలసీపత్రం చూడ్డానికి చాలా పెద్దగా అనిపించినా.. బీమా సంస్థలు.. పాలసీకి సంబంధించిన ముఖ్య సమాచారం అంతా.. ఒకేచోట, సులభంగా అర్థమయ్యేలా పేర్కొంటాయి. దీంతోపాటు బీమా ప్రతిపాదిత పత్రం, సోదాహరణలూ అందుతాయి. ఒకసారి మీరు పూర్తిగా ఈ వివరాలన్నీ చూసుకోవాలి. అన్నీ సరిగా ఉంటే సరే. లేదంటే వాటిని సరిచేయాల్సిందిగా అడగాలి. తప్పులు దొర్లితే, ఆ తప్పులు మనం తెలుసుకున్నాక.. ఆ పాలసీని తిరిగి ఇచ్చేసి, మనం చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాల్సిందిగా కోరవచ్చు. అయితే, పాలసీని 15 రోజుల్లోపు మాత్రమే వాపసు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇంట్లో తెలియాలి!
బీమా పాలసీ వ్యక్తిగతంగా వ్యక్తుల పేరుతో తీసుకున్నాగానీ.. అది అనుకోని సమయంలో కుటుంబం మొత్తానికి భరోసా ఇచ్చేదనే విషయం మర్చిపోకూడదు. ప్రారంభించిన, కొనసాగిస్తున్న బీమా పాలసీల వివరాలను జీవిత భాగస్వామికి, తల్లిదండ్రులకు చెప్పాలి. అలాగే పాలసీ పత్రాలనూ సురక్షితంగా, కుటుంబసభ్యులకు అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ఈ-ఇన్సూరెన్స్ ఖాతాలో పాలసీలను దాచుకునే అవకాశం ఉంది. ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి.
ప్రీమియం.. మధ్యలోనే ఆపేస్తే?
ఒకసారి పాలసీ తీసుకున్నామంటే.. దాని వ్యవధి పూర్తయ్యేవరకూ ప్రీమియం చెల్లిస్తూనే ఉండాలి. కానీ, మధ్యలోనే ప్రీమియం చెల్లించడం ఆపేసేవారు కొందరుంటారు. తాత్కాలిక అవసరాల కోసం డబ్బు అవసరమైతే పాలసీని రద్దు చేస్తుంటారు. దీనికి బదులుగా పాలసీపై రుణం వస్తుందా? అని బీమా సంస్థను అడగండి. పాలసీ రద్దు కాకుండా.. ఉన్న అవకాశాలేమిటి అన్నది బీమా సంస్థను సంప్రదిస్తే తెలుస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ బీమా అవసరం పెరుగుతుంది.. కానీ తగ్గదు. కాబట్టి, పాలసీ రద్దు చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ సరికాదు.
గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు జీవితబీమా పథకాలు, పాలసీల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. ఒకప్పుడు ఎవరో వచ్చి.. ఆయా పాలసీల ప్రయోజనాలు, రక్షణ గురించి క్షుణ్ణంగా వివరించి చెప్తేగానీ.. ఆయా పాలసీలను ప్రారంభించేందుకు ఇష్టపడేవారు కాదు. కానీ, ఇప్పుడు జీవిత బీమా అనేది ప్రతి ఒక్కరి జీవితానికి, వారి కుటుంబానికి ఓ భరోసా అనే నమ్మకం బాగా బలపడింది. దీంతో టెర్మ్ డిపాజిట్ లాంటి బీమా పథకాలు, పాలసీల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు.
- వి. చైతన్య