గ్రూప్స్ ప్రత్యేకం
1. రాజ్యాంగ రచనా సమయంలో ఆదేశిక సూత్రాలలోని 45వ నిబంధనలో 10 ఏళ్లలో 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అందించాలని ప్రతిపాదించారు. ఐదు దశాబ్దాలలో దానిని సాధించలేకపోయాం.
2. విద్యాహక్కును 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎ నిబంధనలో చేర్చారు. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అందించాలని పేర్కొన్నారు.
3. దీనికోసం 2009 జాతీయ విద్యాహక్కు చట్టాన్ని చేశారు. ఈ చట్టం ఏప్రిల్ 1, 2010 నుంచి అమలులోకి వచ్చింది.
4. ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (1993) : ఈ కేసులో సుప్రీంకోర్టు 14 సంవత్సరాల వయస్సు వరకూ విద్యార్జన హక్కు జీవించే హక్కులో భాగంగా ప్రకటించింది.
5. మెహిన్ జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక (క్యాపిటేషన్ ఫీజు) (1992) : ఈ కేసులో సుప్రీంకోర్టు అన్ని స్థాయిలలో విద్య 21వ నిబంధన ప్రకారం ప్రాథమిక హక్కుని పేర్కొంది. ఈ రెండు కేసులలో తీర్పులు విద్యాహక్కును 21-ఎ నిబంధనలో చేర్చడానికి దోహదమయ్యాయి.
ప్రాథమిక హక్కుగా విద్య :
భారతదేశంలోని 6-14 ఏళ్ల మధ్య వయస్సులోని పిల్లలందరికీ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన విద్యాహక్కు చట్టం (ఆర్టిఈ - రైట్ టూ ఎడ్యుకేషన్) 2010, ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించేందుకు రాజ్యాంగంలోని 21(ఎ) అధికరణంలోని 86వ రాజ్యాంగ సవరణను 2002లోనే ఉభయసభలూ ఆమోదించాయి. దీంతో విద్య ప్రాథమిక హక్కుల జాబితాలో చేరింది. తర్వాత 2009 జులై 20వ తేదీన విద్యాహక్కు చట్టానికి పార్లమెంట్ ఆమోదం లభించింది. అదే నెల 26న రాష్ట్రపతి కూడా దానిమీద ఆమోదముద్ర వేయడంతో అది చట్టరూపం దాల్చింది. ఆ చట్టం 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
విద్యాహక్కు - రాజ్యాంగపరమైన అంశాలు
భారత రాజ్యాంగాన్ని నవంబర్ 1949న ఆమోదించినప్పుడు, అందులోని (పార్ట్ 4)లో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. 45వ అధికరణంలో 'దేశంలో పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య అత్యవసరమనీ, రాజ్యాంగం ఆమోదించిన 10 ఏళ్లలోపుగా దేశవ్యాప్తంగా 6-14 ఏళ్లలోపు పిల్లలకు దీన్ని తప్పనిసరిగా అమలు చేసే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని' స్పష్టం చేశారు.
పదేళ్లలోపు ఈ సూత్రాన్ని అమలు చేయాలన్న రాజ్యాంగకర్తల అభిలాష తీరనేలేదు. అయితే 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ చట్టంలో 21వ అధికరణానికి (ప్రాథమిక హక్కులు) క్లాజ్(ఎ)ను చేరుస్తూ, అందులో ప్రభుత్వం 6-14 వయసులోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలని చట్టప్రకారం ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2005లో దీన్ని మరింత బలపరుస్తూ 93వ సవరణలో 15వ అధికరణంలో క్లాజ్ -(3)లోని సబ్‌క్లాజ్ (2) (ప్రాథమిక హక్కులు)లో 'జాతి, మత, కుల, లింగ, ప్రాంతీయ భేదాలు లేకుండా' వీటిని అమలు చేయాలని పేర్కొన్నారు. 19వ అధికరణంలో క్లాజ్ (1), సబ్‌క్లాజ్ (జి)లో వీటి ఆధారంగా ప్రభుత్వం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనుకబడిన వర్గాలకు, ప్రజలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా ఆపడానికి లేదని పేర్కొన్నారు. విద్యాసంస్థలు ప్రయివేటువైనా, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రభుత్వ సంస్థలు ఏ రకానికి చెందినవైనా వాటిలో ప్రత్యేక సదుపాయాలు అంటే రిజర్వేషన్లు కల్పించకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోరాదని ఈ రాజ్యాంగ సవరణలన్నీ సూచిస్తున్నాయి. అంతిమంగా 2009 జులైలో ప్రాథమిక విద్యాహక్కు చట్టరూపం దాల్చింది.
విద్యాహక్కుకు న్యాయపరమైన నిర్వచనం
1993లో సుప్రీంకోర్టు (ఉన్నికృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం) భారతదేశంలో విద్యారంగ స్థానాన్ని నిర్వచిస్తూ - రాజ్యాంగంలోని 45, 41 అధికరణాల ప్రకారం విద్యాహక్కు అంటే...
1. దేశంలోని ప్రతీ బిడ్డా/ పౌరుడూ లేదా పౌరురాలు, 14 ఏళ్లదాకా ఉచితవిద్య పొందే హక్కు కలిగి ఉంటారు.
2. 14 ఏళ్లు దాటాక విద్యాహక్కు, ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వం, అభివృద్ధి లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. 14 ఏళ్ల దాకా దేశంలో ప్రతిబిడ్డకీ ఉచితవిద్యా హక్కుందని 45వ అధికరణం స్పష్టంగా చెబుతోంది. ఇంకా దీని గురించి ప్రస్తావించిన ఇతర అధికరణాలు, క్లాజుల్లో ఇంకేదీ 14 ఏళ్ల వయోపరిమితి గురించి ప్రస్తావించలేదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. దీన్ని ప్రభుత్వాలు గుర్తించి గౌరవించాలి. 14 ఏళ్ల దాకా పిల్లలందరికీ ఉచితవిద్య అందించాలి' - అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
విద్యాహక్కు చట్టం (ఆర్టిఈ)లోని ముఖ్యాంశాలు
- దేశంలోని 6 నుంచి 14 ఏళ్లలోపు బాల బాలికలందరికీ నిర్బంధ, ఉచిత ప్రాథమిక విద్యనందించడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం. ఇది విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది.
- ప్రాథమిక విద్య పూర్తయ్యేదాకా (8వ తరగతి దాకా) ఏ విద్యార్థినినీ ఫెయిల్ చెయ్యడం, స్కూలు నుంచి వెళ్లగొట్టడం (బోర్డు పరీక్ష పాసవలేదనే కారణంతో) లాంటివేవీ చెయ్యకూడదు. 8వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలి.
- ఒక కి.మీ పరిధిలో ఒక్కో ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కి.మీ పరిధిలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేయాలి. బడి ఏర్పాటుకు అవకాశం లేనిచోట్ల పిల్లల్ని తీసుకెళ్లడానికి అవసరమైన రవాణా, వసతి సౌకర్యాల్ని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఏర్పాటు చేయాలి.
- విద్యాహక్కు చట్టం ప్రకారం పరిసర ప్రభుత్వ, పూర్తి ఎయిడెడ్ పాఠశాలల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలి. పాక్షికంగా ప్రభుత్వం నుంచి ఎయిడ్ లేదా ఇతర సౌకర్యాలు పొందుతున్న పాఠశాలలు, ఏడాదికి తమకంటే లబ్ధిలో 25 శాతం మేరకు ఉచితంగా విద్య అందించాలి.
- ప్రయివేటు పాఠశాలలన్నీ పరిసరాల్లోని బలహీనవర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి 25 శాతం సీట్లు కేటాయించాలి. 2010-11 నుంచీ ఒకటో తరగతిలో వీరికి రిజర్వేషన్లు కల్పించి ప్రాథమికవిద్య పూర్తయ్యే దాకా ఉచితంగా వారికి విద్య అందించాలి. ఆ ఖర్చును నిబంధనల మేరకు ప్రభుత్వం ప్రయివేటు పాఠశాలలకు తిరిగి (రీయింబర్స్) ఇస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కో విద్యార్థికీ అయ్యే తలసరి ఖర్చునిబట్టి, అంతే మొత్తాన్ని ప్రభుత్వం ప్రయివేటు బడులకు చెల్లిస్తుంది. వీరికి ప్రవేశాలు కల్పించేటప్పుడు ప్రయివేటు బడులు పరీక్షలేమీ పెట్టకూడదు.
- ప్రతి స్కూల్లోనూ ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:30 ఉండాలి. నిర్ధేశించిన కనీసార్హతలున్న వారినే ఉపాధ్యాయులుగా తీసుకోవాలి. ప్రస్తుతం శిక్షణ లేకుండా పనిచేస్తున్న టీచర్లు, కాంట్రాక్టు పద్ధతిమీద తక్షణావసరాల కోసం చేర్చుకునే టీచర్లు ఐదేళ్లలోపు అవసరమైన శిక్షణ పూర్తి చేసుకోవాలి. లేనిపక్షంలో వారిని ఉద్యోగాల్లోంచి తీసేస్తారు.
- ఎన్నడూ పాఠశాలకు వెళ్లని వారితోపాటు మధ్యలో మానేసిన డ్రాపవుట్లను గుర్తించి, మూడు నెలలపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, తగిన శిక్షణ ఇచ్చి, స్కూళ్లలో చేర్చుకోవాలి.
- జమ్మూ కాశ్మీరు తప్ప దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఈ విద్యాహక్కు చట్టం అమలుచేస్తారు.
విద్యకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు
అధికరణం 15(4) : విద్యాపరంగా, సామాజిక పరంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సదుపాయం కల్పిస్తుంది.
అధికరణం 21(ఎ) : రాజ్యం 6-14 సంవత్సరాలలోపు వయస్సు గల బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి.
అధికరణం 28 : మత సంబంధమైన కార్యక్రమాలు నిర్వహించే ఏ విద్యా సంస్థలకైనా రాజ్యం నుంచి పూర్తి ధన సహాయం అందదు.
అధికరణం 29 : భాషా పరంగాగానీ, సాంస్కృతిక పరంగాగానీ మైనార్టీలకు చెందినవారు తమ సంస్కృతులను, భాషలను కాపాడుకొనే స్వేచ్ఛ ఉంది.
అధికరణం 30 : మైనారిటీ తరగతులకు ప్రత్యేకంగా మత సంబంధమైన, భాషా సంబంధమైన అభివృద్ధి కోసం ప్రత్యేకమైన విద్యా సంస్థలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అధికరణం 45 : ఆరు సంవత్సరాల వయస్సు పూర్తయ్యే వరకూ బాలబాలికలకు ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించడానికి కృషి చేయాలి.
అధికరణం 46 : ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు విద్యా, ఆర్థిక అవకాశాలను పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
అధికరణం 350(ఎ) : బాలబాలికలందరికీ ప్రాథమిక విద్యను మాతృభాషలోనే అందజేయడానికి అవసరమైన చర్యలు అధికారులు చేపట్టాలి.
- కె.ఎస్ లక్ష్మణరావు,
శాసనమండలి మాజీ సభ్యులు
సెల్ : 9440262072
విద్యాహక్కు - ప్రాథమిక హక్కు
