తన బిడ్డలకు తల్లి కావడం మామూలు విషయం. కష్టాల్లో ఉన్నవారికి, ఉద్యమకారులకీ.. ఇలా అందరికీ అమ్మ కావడమే ఆమె విశిష్ట వ్యక్తిత్వం. ఆడపడుచులతో సఖ్యతగా ఉండడమే అరుదైన ఈ రోజుల్లో ఆడపడుచు బిడ్డలకీ తల్లి అయిన మాతృమూర్తి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపన్న హస్తం ఆమెది. ఎంతో మంచి మనస్సు ఉంటే తప్ప బాధలో ఉన్నవారికి సేవ చేయడం సాధ్యంకాదు. ఇవన్నీ ఒక ఎత్తయితే, మరోవైపు ఉద్యమంలో ప్రజలతో మమేకమై పనిచేయడం. కరువుతో జనం విలవిల్లాడుతుంటే, సహజంగానే తల్లి మనస్సుగల ఆమె తల్లడిల్లి పోయింది. అదీ తన ఇంటి దగ్గరవున్న వాడనో, ఊరులోనో కాదు. వేరొక జిల్లా. ఆ ప్రజల కోసం 14 బస్తాల ధాన్యాన్ని స్వయంగా సేకరించింది. అంతేకాదు అక్కడే కొన్నిరోజులు ఉండి, వారి ఆకలిదప్పులు తీర్చింది. చెప్పడం వేరు, ఆచరణ వేరు. ఆమె ఆచరణాత్మక సుగుణశీలి. ఏ సందర్భంలోనైనా, ఏ కార్యక్రమంలోనైనా, ఏ బాధ్యతలోనైనా, అది ఉద్యమం కావొచ్చు, కుటుంబం కావొచ్చు. మరోరూపంలోవున్న ప్రజాసేవ కావొచ్చు. అన్నింటా అమ్మతనంతో, లక్ష్యం తప్పని నాయకురాలామె. ఆమె పేరుకి లక్ష్మమ్మ కానీ ఆమె అందరికీ అమ్మే.. భౌతికంగా మనకు దూరమైనా, ఆ ఆచరణశీలి జీవనం అనుసరణీయం. నేడు కర్నూలులో సంస్మరణ సభ జరుగుతున్న సందర్భంగా 'టి సి లక్ష్మమ్మ' స్ఫూర్తివంతమైన విశేషాలు 'జీవన' పాఠకులకు ప్రత్యేకం.
ఆమె కమ్యూనిస్టు కావడం కాదు, తన భర్తను కమ్యూనిస్టు ఉద్యమంలోకి తీసుకురాగలడం గొప్ప విషయం. తన జీవిత భాగస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు టి.నరసింహయ్యను ఆ వైపు అడుగులు వేయించారు లక్ష్మమ్మ. ఓవైపు ఉద్యమం, మరోవైపు కుటుంబం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సమర్ధవంతంగా నిర్వహించిన మహిళానేత ఆమె. ఫ్యాక్షనిజం, ఫ్యూడలిజం వేళ్లూనుకున్న రాయలసీమలో పెత్తందారీతనాన్ని ఎదురొడ్డి నిలిచిన ధీశాలి. పంక్తు సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగినా.. సామ్యవాదమే ఊపిరిగా నడిచింది, నడిపించింది. చిన్నప్పటి నుండి దురాచారాల పట్ల అభ్యంతరం ఉండేది. అదే తర్వాత ఆమెకు ఉద్యమంలోకి వచ్చాక మరింత బలపడింది. లక్ష్మమ్మ స్వగ్రామం వేంపెంట. ఆమె తండ్రిది గార్గేయపురం. నర్సింహయ్య, లక్ష్మమ్మ మేనత్త, మేనమామ పిల్లలే. వీరికి ముగ్గురు కొడుకులు. అయితే, తన ఆడపడుచు ఆరుగురి పిల్లలు కూడా ఆమె సంతానమేనని చెప్పుకోవాలి. వీరిలో చిన్నామెను సొంతకూతురిని చేసుకుంటే, మిగిలిన వారినీ పెంచి, ఓ ఇంటివారిని చేయడంలో ఆమె పాత్రే కీలకం. ఆమె రెండో కుమారుడు తెలకపల్లి రవి సిపియం రాష్ట్రకమిటీ సభ్యులుగా ఉన్నారు.
అందరికీ అమ్మే..!
తన ఇంటికి వచ్చిన ఎవరినైనా ఆప్యాయంగా పలకరించడంలో, కడుపు నింపి సేద తీర్చడంలో ఆమె అన్నపూర్ణే. కర్నూలులో పార్టీ ఆఫీసులో ఆమె నివాసం కార్యకర్తలందరికీ ఆవాసమైంది. ఆమె ఏ సమయంలో, ఎంతమంది వచ్చినా అందరినీ భోజనం చేసి వెళ్లమని బలవంతం చేసేవారు. ఎవరు ఆపదలో వున్నా, తన పరిస్థితి ఎలా ఉన్నా అవేమీ పట్టించుకోకుండా ముందు కార్యరంగంలోకి దూకేవారు. ఒకసారి వీధిలో తాగుబోతు మూర్చతో కొట్టుకుంటుంటే, మగవాళ్లు సైతం చోద్యం చూస్తుంటే లక్ష్మమ్మ మాత్రం ధైర్యంగా దగ్గరికి వెళ్ళి, తక్షణ చికిత్స చేసి, ఇంట్లో దిగబెట్టి వచ్చిన సేవామూర్తి ఆమె. ఎవరినో రెండోపెళ్లి చేసుకున్న ఓ డాక్టరమ్మ బాధలు భరించలేక నిప్పంటించుకుంటే ఆస్పత్రికి తీసుకెళ్ళి, ఆమె ఆఖరిశ్వాస వరకూ వుండి, సేవలు చేసిన మానవతావాది. తన ఆడపడుచుకు అకస్మాత్తుగా ఒళ్లుకాలితే రాత్రంతా పక్కనే ఉండి, తుదిశ్వాస వరకూ సపర్యలు చేసి, ఆమె ఆరుగురి పిల్లలకి తల్లైన మాతృహృదయం ఆమెది.
ప్రజా ఉద్యమాల్లో..
ఎన్నికల్లో మహిళల్ని ప్రభావితం చేయడంలో ఆమెకు ఆమే సాటి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేప్పుడు ఓవైపు కుటుంబాన్ని మరోవైపు రాజకీయాల్ని సమన్వయం చేసుకుంటూనే కొనసాగేవారు. చంటిబిడ్డల్ని చంకనెత్తుకోవడం, ఒక్కోసారి బిడ్డను ఇంటివద్దనే వదిలిపెట్టి, మధ్యమధ్యలో వచ్చి పాలిచ్చి వెళ్ళేవారు. ఉద్యమ పోరాటాల్లో ఎంతటి సాహసానికైనా వెనకాడేవారు కాదు. అరెస్టులకు సైతం వెరవక జైలుకెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఆయా సందర్భాల్లో కుటుంబ సమస్యలతో సతమతమయ్యే మహిళల ఆవేదనల్ని వినడమే కాకుండా, వారి సమస్యల్ని పరిష్కరించేేవారు. ఆర్థికంగా ఇబ్బందిపడే మహిళలకు ఉపాధి మార్గం చూపించేవారు. ముఖ్యంగా మహిళలకు కుట్టు నేర్పే శిక్షణా శిబిరాల్నీ ఏర్పాటు చేయించారు. ఆ శిబిరాల్లో తాను కూడా నేర్చుకుని, కుటుంబానికి చేదోడుగా నిలిచారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఒడిదుడుకుల్నీ ఎదుర్కొంటుంది. అయినా పీకల్లోతూ కష్టాల్లోనూ ఆమె ఏనాడూ ఉద్యమస్ఫూర్తిని వదల్లేదు.
కమ్యూనిస్టు ప్రభావం ..
పెళ్ళికి ముందే వాళ్ళింటికి మేనమామ పిల్లలు, వారి సహచరులు వచ్చే పోయేవారు. వాళ్ళు కమ్యూనిస్టులు కావడం, వారి మాటలు ఆమెపై ప్రభావం చూపాయి. స్వతహాగ చిన్నప్పటి నుంచే పేదలపై దౌర్జన్యం జరిగినా, స్త్రీలపై దురాచారాల్ని, హింస, అంటరానితనం వంటి వాటిని సహించకపోయేది. 'ఎంతో పండితులమని చెప్పుకునే కుటుంబాల్లోని పురుషులు కూడా స్త్రీలను వేధించడం ఏమిటని?' ఆమె విమర్శించేవారు. ఆ కుటుంబాల్లోనే పుట్టి, అలా అనడానికి కారణం ఆమెలోని మార్క్సిస్టు దృష్టే. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం పెళ్లి తర్వాతే పాల్గొన్నారు. అప్పుడు భర్త నరసింహయ్య కాంగ్రెస్‌వాది. దాంతో ఆమె తమ వూళ్లో విషయాలు ఆయనకు చెప్పి 'మీరూ కమ్యూనిస్టు కావచ్చు గదా!' అని అడిగారంట. ఆయన కూడా కాంగ్రెస్ భూస్వాముల స్వభావం అనుభవంలో తెలుసుకున్నారు. దాంతో వారితో చేయడం కష్టమనుకుని, కమ్యూనిస్టులతో కలిసి పనిచేశారు. ఆమె ఒక కమ్యూనిస్టుగా ఇంటా బయటా సమన్వయం చేసుకోగలగడం నేడు ఉద్యమంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తివంతం. ఆమె తాను మాత్రమే కాకుండా యావత్తు కుటుంబాన్నీ కమ్యూనిస్టు ప్రభావంలో ఉంచగలిగారంటే లక్ష్మమ్మ మార్క్సిజాన్ని ఎంతగా అన్వయించుకున్నారో అర్థమవుతుంది. ఆ స్ఫూర్తిని కొనసాగించడమే లక్ష్మమ్మకు మనమిచ్చే నిజమైన నివాళి.
ఆమే నాకు ప్రేరణ
టి. నరసింహ్మయ్య
''నా భార్య శ్రీమతి టి.సి.లక్ష్మమ్మ నా కమ్యూనిస్టు ఉద్యమ ప్రవేశానికి ఒక ప్రధాన ప్రేరణ. 1949లో నాకు పార్టీతో సంబంధాలేర్పడి, సాహిత్య అధ్యయనంతో సైద్ధాంతిక విశ్వాసం ఏర్పడిన సందర్భంలో నిజ జీవితంలో కమ్యూనిస్టుల నిబద్ధత గురించి ప్రత్యక్ష ఉదాహరణలు చూపెట్టింది. వెలుగోడులో ఆమె మేనమామ కుమారుడు, టీచరు ఎస్. రామమూర్తికి కమ్యూనిస్టుగా వున్న మంచితనం, కమ్యూనిస్టు నాయకులతో వున్న నిత్య సంబంధం, అలాగే సుదర్శనవర్మకు తమ స్వగ్రామం వేంపెంటలో వున్న గుర్తింపు, విశ్వాసం, ఆయన వేంపెంట సమస్యల పరిష్కారం కోసం తీసుకొనే శ్రద్ధ మొదలైన విషయాలన్నీ వివరించింది. తత్ఫలితంగా తటపటాయింపులు లేకుండా కమ్యూనిస్టులపై, పార్టీపై విశ్వాసం పెరిగి, పార్టీని అనుసరించటానికి నా భార్య లక్ష్మమ్మ చాలా తోడ్పడింది.''
సామాజిక చైతన్యశీలి
అల్లూరి మన్మోహిని,
ఐద్వా సీనియర్ నాయకులు
''నాకు తెలిసేప్పటికే లక్ష్మమ్మ ప్రజాఉద్యమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆమె వ్యక్తిత్వంలో అణువణువూ సామాజిక చైతన్యం ఉట్టిపడేది. రాజకీయ తరగతులు జరిగేటప్పుడు ఓవైపు వంటశాల బాధ్యత చూస్తూనే తరగతుల్లో పాల్గొనేవారు. అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఎంతో లోతుగా ఉండేవి. మరోపనిలో ఉన్నా, ఎంతగా ఆకళింపుచేసుకున్నారో కదా! అనిపించేది. నిరంతరం వేదవిద్యలు పఠిస్తూ, సనాతన ఆచారాల్లో మునిగితేలే అగ్రకులంలో పుట్టినా, ఆమె జీవనం మొత్తం రాజకీయ, సైద్దాంతిక స్పృహతో కొనసాగింది. ఒకవైపు గడ్డుపరిస్థితుల్నీ, గంపెడు సంతానాన్నీ చూసుకుంటూనే, మరోవైపు పార్టీ బాధ్యతల్ని శ్రద్ధగా నిర్వహించడం స్ఫూర్తి పొందాల్సినవి. నిరంతరం ఫ్యాక్షనిస్టు, పెత్తందారుల అదుపాజ్ఞలలో ఉన్న సీమ గ్రామాల్లో బడుగుజీవుల అభ్యున్నతికి పాటుపడి, కఠిన పరీక్షల్ని ఎదుర్కొన్నారు లక్ష్మమ్మ దంపతులు. వారి జీవనం ప్రజాతంత్ర ఉద్య మాలతో మమేకమైంది. ఆమె చరితం నేటి తరానికి మార్గదర్శకం.''
నిరాడంబరి
ఎన్.ఎస్ లక్ష్మీదేవమ్మ,
ఐద్వా తెలంగాణ నాయకురాలు.
''మహబూబ్‌నగర్ జిల్లాలో కరువు తాండవిస్తున్నప్పుడు అక్క లక్ష్మమ్మ కర్నూలు జిల్లా నుండి ధాన్యం, నగదు, బట్టలు సేకరించి తెచ్చారు. దాదాపు 20 రోజులు అంబలి పంచే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్క రెండు జతల బట్టలు మాత్రమే తెచ్చుకుంది. రోజూ వాటిని ఉతుక్కునేది. మాకు సామాన్య కామ్రేడ్ ఇంట్లో బస. వాళ్ళు పెట్టింది తిని, గ్రామాలకు వెళ్లేవాళ్లం. జనం కష్టాల్ని చూసి అక్క ఆవేదన చెందేది. జనాన్ని చూస్తే ఆమెకు ఎక్కడ లేని బలం. వాళ్ళని చైతన్యపరిచేలా అక్క ఉపన్యాసం ఇచ్చేది. జీవితాంతం ఆమె మహిళా, ప్రజా ఉద్యమాలకు ఎనలేని కృషి చేసింది. నన్ను 'లక్ష్మీదేవి' అని ఎంతో ఆప్యాయంగా పిలిచేది. మరుపురాని వారిలో అక్క ఒకరు. ఆమె బాటలో కడదాక నడవడమే అక్కకు నేనిచ్చే నిజమైన నివాళి''
శివారెడ్డిని లేపి నిలబెట్టి కూర్చున్నా!
''నేను గార్గేయపురంలోని అత్తగారింటికి వెళ్లాక అవగాహన పెరిగింది. అప్పుడు చిన్న వయస్సు, దూకుడు ఎక్కువ. భూస్వాముల్ని ఎదిరించాలనే తత్వం. వీలైనప్పుడల్లా ప్రతిఘటించే దాన్ని. ఆ రోజుల్లో బస్సులు చాలా తక్కువ. అవీ ప్రైవేటు బస్సులే. ఒకసారి బస్సు పోతే మళ్లీ ఎప్పుడోగానీ రాదు. ఒకసారి కర్నూలులో బస్సు కోసం నిలబడ్డాను. బాగా రద్దీగా ఉంది. అప్పుడు నేను నెలల మనిషిని. కండక్టర్ సీటు ఇస్తానన్నాడు. తీరా బస్సు బయిలుదేరే ముందు పెద్ద శివారెడ్డి వచ్చాడు. ఆయన్ని కాదనలేరు. పైగా మేము ఆయనకు వ్యతిరేకం. రాగానే ఆయనను బస్సెక్కించారు. దాంతో నాకు సీటు లేకుండా పోయింది. డ్రైవర్, కండక్టర్ ఏం చేయలేమన్నట్టు నిస్సహాయులైపోయారు. ఆ పరిస్థితుల్లో మామూలు గ్రామస్తులూ మాట్లాడగలిగింది లేదు. నాకు బాగా కోపం వచ్చింది. బస్సు ముందుకెళ్లి అడ్డంగా నిలబడి, పోనివ్వనని మొరాయించా. అంతా అలజడి. చివరకు 'ఎక్కమ్మా!' అన్నారు. ఎక్కుదామంటే అక్కడ పెద్దరెడ్డి కూర్చుని ఉన్నాడు. ఆయన కూడా 'ఎక్కమ్మా' అన్నాడు. 'ఎలా? మీరు లేవండి' అన్నాను. బస్సులో ఒక్కసారిగా కలకలం. ఆయన మాత్రం మాట్లాడకుండా లేచి, నిలబడ్డాడు. నేను కూర్చున్నా. ఆ రోజు 'పెద్ద శివారెడ్డిని లేపి నిలబెట్టింది' అని మా వూళ్లో ఇప్పటికీ జనం నన్ను మర్చిపోరు. ఇవన్నీ పెద్ద తిరుగుబాట్లనీ, గొప్ప విషయాలనీ అనను. కానీ అన్యాయాన్ని ప్రతిఘటించాలని చెప్పడమే. వీటివల్ల పీడితులకు ధైర్యం, ఎదిరించే తెగువ వస్తాయనేది నా అనుభవం.''
- శాంతిశ్రీ
ఉద్యమాల లక్ష్య మ్మ
