బడా వ్యాపారులకు అనుకూలంగా పని చేయడంలో, బూటకపు వార్తలను చలామణీ చేయడంలో, మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడంలో దిట్ట అయిన మోడీ వుండగా మరో నేతతో పనేముంది?!
చరిత్రలో అతి పెద్ద ఎన్నికలను కేవలం ఒకే ఒక వ్యక్తి గెలిచాడు. ఆయనే నరేంద్ర మోడీ. 1971 తర్వాత, ఒక పార్టీకే వరుసగా రెండోసారి మెజారిటీ సాధించిన మొదటి భారత ప్రధాని మోడీ. 2014లో అవినీతి ఆరోపణల దుమారంలో కాంగ్రెస్ పార్టీ పలుకుబడి కొట్టుకుపోయాక భారతీయ జనతా పార్టీ లోక్‌సభలో పూర్తి మెజారిటీ సాధించగలిగింది. అయిదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను చిందరవందర చేశాక మోడీ పార్లమెంటరీ బలం పెరిగింది. ఇది భారత దేశానికే గాక ప్రపంచం మొత్తానికే చెడ్డ వార్త.
హిందూ జాతీయతావాదానికి రాజకీయ పార్శ్వమే బిజెపి. ఈ వాదం భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తోంది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. హిందూ అగ్రకులాల సామాజిక పెత్తనాన్ని ఆ పార్టీ బలపరుస్తుంది. బడా కార్పొరేట్ల ప్రగతికి అనుకూలమైన విధానాలను అమలు చేస్తుంది. సాంస్కృతికంగా ఆ పార్టీది మితవాద ధోరణి. స్త్రీల పట్ల విద్వేషాన్ని పెంచి పోషిస్తుంది. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ తన చెప్పు చేతల్లోనే అట్టి పెట్టుకుంటుంది. మోడీ ఈమారు సాధించిన ఘన విజయంతో రాజకీయ రంగంలో అలుముకున్న గాఢాంధకారంలో భారతీయ ఆత్మ ఎక్కడికో కొట్టుకు పోయింది. 19 కోట్ల 50 లక్షల మంది ముస్లింలు తక్కువ స్థాయి పౌరులని ఈ పార్టీ భావిస్తుంది.
మోడీకి కుడి భుజంగా వ్యవహ రించే నాయకుడే ఎన్నికల ప్రచారంలో ముస్లింలను 'చెద పురుగులు'అంటూ చీదరించుకున్నాడు. ఎటువంటి జంకూ గొంకూ లేకుండా ముస్లింలపై మూక దాడులు జరిగాయి. ఇంత పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉన్నా, వారు రాజకీయంగా అనాథలు అయి పోయారు! మెజారిటీగా ఉండే హిందువుల మద్దతు, వారి ఓట్లు కోల్పోతామన్న భయంతో భారత దేశంలోని రాజకీయ శక్తులు ముస్లింలను పట్టించుకోడానికి నిరాకరించాయి. గత పార్లమెంటులో ముస్లింలు కేవలం 24 మందే. 1952 నుంచీ ఇంత తక్కువ సంఖ్యలో ముస్లిం ప్రాతినిథ్యం ఎన్నడూ లేదు. బహుశా ఇది ఇంకా తగ్గిపోవచ్చు.
మోడీ ప్రజలను నిలువునా విడదీస్తాడు. అతను నిస్సందేహంగా ఒక ఆకర్షణ కలిగిన ప్రచారకుడే. భారతదేశాన్ని విభజించే మతం, కులం, ప్రాంతం, భాష వంటి పగుళ్లను మూసివేయడానికి బదులు వాటిని బాగా పెద్దవి చేయడమే మోడీ స్టైల్. సామాన్యుల తరపున వకాల్తా పుచ్చుకున్నట్లు ఆధిపత్య శక్తులను వ్యతిరేకిస్తున్నట్లు ఉపన్యసిం చడంలో కడు నేర్పరి. ప్రజల మధ్య జవాబుదారీగా మెలగవలసిన మనిషే అయినప్పటికీ అబద్ధాలను, వక్రీకరణలను, అర్ధ సత్యాలను ప్రచారంలో పెట్టడానికి ఏమాత్రమూ వెనుకాడని వ్యక్తి.
మనం ఎక్కువగా ఆశ్చర్యపడిపోవద్దు సుమా! ఒక 'బలమైన నేత' నిరంకుశ పాలనను ఏ దేశంలో ఎంతమంది ప్రజలు బలపరుస్తున్నారో తెలుసు కోడానికి 2017లో నిర్వహించిన సర్వేలో భారతీయు లలో 55 శాతం సానుకూలంగా స్పందించారు. ఇది ఏ ఇతర దేశంలో కన్నా అధిక శాతం! రష్యాను ఏలుతున్న వ్లాదిమిర్ పుతిన్‌కు ఇంతకన్న తక్కువ మద్దతే లభించింది. ప్రజాదరణ పొందిన జాతీయతా (దురభిమాన)వాదులలో మోడీ కన్న గట్టివాడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. స్వతంత్ర భారత దేశానికున్న అత్యంత విలువైన లక్షణం బహుళ పార్టీ ప్రజాస్వామ్యం. దీనికి ఇప్పుడు మోడీ నుంచి ప్రమాదం దాపురించింది. 'తనతో మరే ఇతర పార్టీ పోటీ పడరాదని బిజెపి స్పష్టం చేసింది. తనను ఎదిరించే పార్టీ ఏదైనప్పటికీ, అది తనకి పోటీదారుగా కాకుండా దేశానికే శత్రువుగా ప్రజల ముందు చిత్రీకరించింది' అని మోడీ రాజకీయాలపై ఇటీవల వెలువడిన 'మెజారిటీ ఆధిపత్య రాజ్యం' అన్న పుస్తకంలో రచయిత వర్ణించారు. కాశ్మీరు వివాదంపై చాలా బాధ్యతా రాహిత్యంగా పొరుగుదేశం పాకిస్తాన్ తో ఘర్షణాత్మక వైఖరిని మోడీ చేపట్టాడు. రెండు దేశాలనూ యుద్ధం అంచుదాకా నెట్టాడు. ఈ ఘర్షణను తనకు ఉపయోగపడేలా మలుచుకోవడం కోసం ప్రతిపక్షాలన్నీ ముస్లిం ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నాయన్న అర్థం లేని నిందా ప్రచారానికి పూనుకున్నాడు.
మోడీని తాము ఏవిధంగా ఓడించాలో కాంగ్రెస్ పార్టీ, దాని నాయకులుగా ఉన్న గాంధీ-నెహ్రూ వారసులు సీరియస్‌గా పునరాలోచించాలి. రాజకీయ విరాళాల విషయంలో దాతల పేర్లు బహిరంగ పరచనవసరం లేదన్న చట్టాన్ని మోడీ తెచ్చిన అనంతరం భారత వ్యాపార దిగ్గజాలు రూ.10,300 కోట్ల నిధులను బిజెపికి రహస్యంగా సమకూర్చాయి. భారతదేశాన్ని బలహీనపరుస్తున్న తీవ్ర ఆర్థిక అసమానతను గురించి బిజెపి కేవలం మాటలకే పరిమితం అయింది. ఈ అసమానతలను తగ్గించే ప్రయత్నం చేసింది శూన్యం.
భారతదేశంలో రాజకీయ విభేదాలు కుల, మత ఘర్షణల వెంబడి విస్తరిస్తూ వచ్చాయి. బడా వ్యాపారులకి అనుకూలంగా వుంటూ, ముస్లిం విద్వేషాన్ని కలగలిపిన జాతీయవాదంతో నడిచే బిజెపికి ఈ పరిస్థితి అనుకూలంగా పరిణమించింది. ప్రతిపక్షాలు ఈ విధానానికి పూర్తిగా భిన్నమైన పద్ధతిలో, సమాజంలో సమానత్వం నెలకొనాలన్న ప్రాతిపదికన ప్రచారాన్ని నడపాల్సి వుంటుంది. సార్వత్రిక కనీస ఆదాయం పేరుతో కాంగ్రెస్ నడిపిన ప్రచారం వంటివి ఏ మూలకూ చాలవు. వివిధ తరహాల అస్థిత్వ భావాలను సొమ్ము చేసుకునేందుకు పోటీ పడే బదులు భారతీయులందరికీ మేలు చేకూర్చే విధానాలపై రాజకీయ యుద్ధం జరపడం అవసరం. ఇది జరగాలంటే ప్రజలకు మరింత ఆమోదయోగ్యమైన, దేశంలోని పేదల జీవితాలతో మరింత సన్నిహితంగా పెనవేసుకునే ప్రతిపక్షం ఎంతైనా అవసరం.
మోడీ ఘన విజయం భారత్ 'ఆత్మ'కు ముప్పు
