'అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' చందంగా ఈ రోజు రాష్ట్రంలోని జలాశయాలన్నీ దాదాపు నిండినా కరువు ప్రాంతాల ప్రజలు మాత్రం నీరు దొరక్క అల్లాడి పోతున్నారు. రాష్ట్రంలో ఉన్న జలాశయాలన్నీ నిండితే 771 టిఎంసీల నీరు లభ్యమవుతుంది. గత సంవత్సరం 189 టిఎంసీలు మాత్రమే చేరగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 579 టిఎంసీలు చేరాయి. దాదాపు 400 టిఎంసీలు అదనంగా వచ్చాయి. తెలంగాణ వాటాతో సహా అన్ని అవసరాలు పోనూ శ్రీశైలం జలాశయంలో 120 టిఎంసీలు వెనకబడిన ప్రాంతాలకు మళ్ళించే అవకాశం వుంది. కానీ పాలకుల దృష్టి లోపం వల్ల నేడు రాయలసీమ ప్రజలు మరోసారి కరువు బారిన పడ్డారు. గత రెండు వారాలుగా సిపిఐ - సిపిఐ(యం) ఆధ్వర్యంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను సందర్శించిన బస్సు యాత్ర నాయకత్వానికి ప్రత్యక్షంగా కనిపించిన దృశ్యాలనేకం. ఈ యాత్ర సందర్భంగా మా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఎక్కడ చూసినా వర్షాలు లేక, ఎండిన పొలాలే కనిపించాయి. వరుసగా నాలుగో సంవత్సరం కరువు కాటకాలు ఎదుర్కొంటున్నారు. చెరువులన్నీ నీరు లేక ఎండిపోయాయి. కృష్ణా, గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల వాటి పైనున్న రిజర్వాయర్లలోకి భారీగా నీళ్ళు వచ్చాయి. కానీ ప్రభుత్వం పాత ఆలోచనల నుండి బయట పడడం లేదు. విద్యుత్ పేరుతోనూ, భవిష్యత్ పేరుతోనూ నీళ్ళను వెనుకబడిన ప్రాంతాల్లోని పొలాలకు వదలడం లేదు. హేతువిరుద్ధంగా ఆలోచిస్తూ వ్యవసాయ రంగాన్ని దెబ్బకొడుతున్నది.
కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ రెండు ముఖ్యమైన ప్రాజెక్టులు. ఈ రెండూ అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు నీరందించాలి. శ్రీశైలంలో గత సంవత్సరం ఇదే సమయానికి దాదాపు 40 టిఎంసీలుండగా ఇప్పుడు 188 టిఎంసీలు ఉన్నాయి. దీని పూర్తి నిల్వ సామర్థ్యం 216 టిఎంసీలు. ఈ రిజర్వాయర్‌కు 885 అడుగుల వరకు నీళ్ళు వస్తే నిండినట్లు లెక్క. ఇప్పటి వరకు (సెప్టెంబర్ 10వ తేదీ) 880 అడుగుల వరకు నీరు చేరింది. ప్రవాహ వేగం తగ్గినా ఇంకా 15,297 క్యూసెక్కుల నీరు పైనుండి చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ వాటా నీళ్ళను ఇక్కడి నుండే పోతిరెడ్డిపాడు, హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు ఇవ్వాలి. తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీళ్ళు ఇస్తే రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు కూడా లాభం చేకూరుతుంది. రిజర్వాయర్లు, కాలువలు పూర్తి కానందున అవకాశం వున్నా ఉపయోగించుకునే స్థితిలో లేము. తెలుగు గంగ నుండి కడప జిల్లాల్లోని బ్రహ్మంగారి మఠం కాలువలు పూర్తి చేసి నింపితే లక్షా 48 వేల ఎకరాలకు నీరు అందించ వచ్చు. కానీ ప్రస్తుతం 9 వేల ఎకరాలకే ఇస్తున్నారు. వస్తున్న కొద్దిపాటి నీళ్ళను కూడా ఈ రిజర్వాయర్‌లో నిలువ చేయకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఆర్‌టిపిపికి (రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్) మళ్ళిస్తున్నారు. కర్నాటక నుండి వస్తున్న తుంగభద్రలో గత సంవత్సరం 72 టిఎంసీలు చేరగా ఈ సంవత్సరం 100 టిఎంసీలు చేరాయి. అయినా అనంతపురం జిల్లా హెచ్ఎల్సి కాలువ చివర భూములకు నీరందించడం లేదు. కేవలం చెరువులు నింపి వదిలేస్తున్నారు. హంద్రీ-నీవా, పూర్తి కానందున అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీరు అందించలేకపోతున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, డోన్ లాంటి కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వవచ్చు. అనంతపురం జిల్లాలో హంద్రీ-నీవా మొదటి దశ పూర్తయినా నీళ్ళు ఇవ్వలేదు. చెరువులు నింపితే దాదాపు 40 వేల ఎకరాలు అదనంగా సాగవుతుంది.
గత సంవత్సరం ఇదే సమయానికి నాగార్జున సాగర్‌లో 115 టిఎంసీల నీళ్ళు నిల్వ వున్నాయి. కానీ ఇప్పుడు 306 టిఎంసీలు ఉన్నాయి. సాగర్ లోకి 7,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. మరో 6 టిఎంసీలు వస్తే రిజర్వాయర్ నిండిపోతున్నది. కానీ యథావిధిగా సాగర్ ఆయకట్టుకు ఆలస్యంగా నీళ్ళు వదిలారు. సాగర్ పరిధిలోని కాలువ చివరి భూముల రైతులు ఇప్పటికీ నిరాశలోనే వున్నారు. ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులకు ఒకసారి మంచినీరు వదులుతున్నారు. గుండ్లకమ్మ రిజర్వాయరు పూర్తయినా దాన్నొక పర్యాటక ప్రాంతంగా మార్చారే తప్ప పంట కాల్వలు పూర్తి చేసి నీరివ్వడం లేదు. 80 వేలు సాగవ్వాల్సి ఉండగా కేవలం వంద, రెండు వందల ఎకరాలకు మాత్రమే నీరందుతున్నాయి. ఇక్కడ సాగర్ నుండి గుండ్లకమ్మకు, గుండ్లకమ్మ నుండి మూసీ నదికి అనుసంధానం చేస్తే ప్రకాశం జిల్లాలోని కాలువ చివరి భూములు, వెనుకబడిన ప్రాంతాలకు నీరందుతుంది. కనీసం భూగర్భ జలాలు పెరిగి బోర్ల కింద సేద్యం చేసుకోగలుగుతారు. కనీసం పంటలు ఎండి పోకుండానైనా కాపాడుకోగలుగుతారు. వాడకానికి, తాగడానికి నీళ్ళు వుంటాయి. వెలుగొండ రిజర్వాయరు పూర్తయినా సొరంగాలు పెండింగ్‌లో ఉండటం వలన నిరుపయోగమవుతున్నది. ప్రఖ్యాతిగాంచిన రాళ్ళపాడు ప్రాజెక్టు గత నాలుగేళ్ళుగా ఎండిపోయి వుంది. తెలుగు గంగ ద్వారా కృష్ణా జలాలు, సోమశిల ప్రాజెక్టులో ప్రవేశిస్తాయి. అక్కడి నుండి రెండున్నర టిఎంసీలు రాళ్ళపాడు ప్రాజెక్టుకు మళ్ళిస్తే 25 లక్షల ఎకరాలకు నీరందుతుంది. సాగర్ నుండి మూసీ నది లోని నీరు వదిలితే అటూ ఇటూ గ్రామాల్లో లిఫ్టుల ద్వారా సాగుచేయవచ్చు. అలాగే సోమశిల నుండి కండలేరు మీదుగా చెన్నైకు వెళ్ళే కాలువ నుండి చిత్తూరు జిల్లాకు నీరందించవచ్చు.
సాగర్ దిగువన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉపయోగపడే పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. కృష్ణా డెల్టా స్థిరీకరణకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. దీని పూర్తి నిల్వ సామర్థ్యం 45 టిఎంసీలు. ఇప్పటి వరకు 15 టిఎంసీలున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి 7 టిఎంసీలు మాత్రమే ఉన్నాయి. పట్టిసీమ నుండి ప్రకాశం బ్యారేజికి 100 టిఎంసీల నీరు పంపింగ్ అవుతోంది. సాగర్ నుండి 20 టిఎంసీలు ఇస్తే కృష్ణా డెల్టాలో పూర్తి సామర్థ్యంతో పంటలు పండించవచ్చు. తద్వారా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలకు ఉపయోగం జరుగుతున్నది. ఆ రీత్యా కృష్ణా డెల్టాకు నష్టం జరగకుండానే శ్రీశైలం, సాగర్ జలాశయాలన్నింటినీ పూర్తిగా వెనుకబడిన ప్రాంతాలకు కేటాయించవచ్చు. పట్టిసీమ ద్వారా గోదావరి నుండి కృష్ణా డెల్టాకు మళ్లించే నీటికి బదులుగా కృష్ణా జలాలను శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు పెట్టారు. కానీ అవేమీ ఆచరణకు రాలేదు.
ఒక సమగ్రమైన ప్రణాళిక, ముందు చూపులేని కారణంగా రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతున్నది. ఉదాహరణకు పెన్నా డెల్టాకు ఉపయోగపడే సంగం-నెల్లూరు ఆనకట్టల నిర్మాణం పేరుతో సంవత్సరాలుగా రెండో పంటకు నీరివ్వడం లేదు. అక్కడ నీరుండి కూడా వృధా అవుతున్నది. ఎప్పటికప్పుడు పనులు వాయిదా వేస్తూ నిర్మాణ వ్యయం పెంచుకుంటూ పోతున్నారు. ఒక పంట కోల్పోయినందు వల్ల పెన్నా డెల్టా కింద రైతులు రూ.400 కోట్లు నష్టపోతున్నారు. అంటే ఈ నాలుగేళ్ళలో రూ.1600 కోట్ల నష్టం జరిగింది. అలాగే రాళ్ళపాడు ప్రాజెక్టు కింద పంటలు పండక దాదాపు రూ.1000 కోట్లు నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ కేంద్రీకరణ విధానాల వల్ల వెనుకబడిన ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. నాలుగైదు ఏళ్ళకొకసారి వరదలు వచ్చినప్పుడు నీళ్ళు నిలవ పెట్టుకొని ఉపయోగించుకుంటే కనీసం కొంత వరకన్నా రైతులకు ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరుకుతుంది. పాలకుల నిర్లక్ష్యం మూలంగా జలాశయాల్లో నీళ్ళు ఉన్నా ఉపయోగించుకోలేని స్థితిలో నేడు రాష్ట్రం వుంది. ఇప్పటికైనా సమగ్ర దృష్టితో ఆలోచించి కాలువలు ఉన్నంత వరకు నీళ్ళు వదలాలి. చెరువులు నింపాలి. దీనికి అవసరమైన మరమ్మతులకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలి. కొద్ది పెట్టుబడితో పూర్తయ్యే లింకు కాలువలను వెంటనే పూర్తి చేయాలి. వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలి. షెడ్యూల్ ప్రకారం సకాలంలో పూర్తిచేయాలి. 'అదిగో ఇదిగో' అంటూ నత్తనడక నడుస్తున్న వెలిగొండ, హాంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులకు సరిపడా నిధులిచ్చి వెంటనే పూర్తి చేయాలి. చెరువులను పునరుద్ధరించాలి. చిన్న, మధ్యతరగతి తరహా ప్రాజెక్టులకు తక్షణం ప్రాధాన్యతనిచ్చి వినియోగంలోకి తేవాలి. రిజర్వాయర్లు నిండితే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. బోరుబావుల ద్వారా ఆ నీటినీ వినియోగించుకుంటే రాష్ట్రం సశ్యశ్యామలమవుతుంది. లేకుంటే మరో నాలుగేళ్ళు కరువు బారిన పడి వ్యవసాయ రంగం మరింత క్షీణించిపోయే అవకాశం వుంది. వ్యవసాయం దెబ్బ తింటే కార్పొరేట్ వ్యవసాయానికి పోవచ్చన్న కాలం చెల్లిన ఆలోచనలకు స్వస్తి చెప్పి సాగు చేసే రైతులకు మేలు చేసే విధానాలు చేపట్టాలి.
- వి శ్రీనివాసరావు ( రచయిత సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు )
కరువు ప్రాంతాల దాహార్తి తీరేదెన్నడు?
