'వామపక్షాల దారి ఎటు?' అని డా|| ఎ.పి విఠల్ 9వ తేదీన 'సాక్షి' పత్రికలో ఒక వ్యాసం రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు చంద్రబాబును ఓడించడమే ప్రధాన కర్తవ్యం అని, అందుకోసం వైఎస్ఆర్సిపితో కమ్యూనిస్టులు చేతులు కలపాలని సలహా ఇచ్చారు. చంద్రబాబును ఎందుకు ఓడించాలి? అంటే ఆయన నమ్మక ద్రోహం చేసే మనిషి గనుక అని చెప్పారు. వైఎస్సార్సిపి నాయకుడు జగన్ నమ్మదగిన మనిషి గనుక ఆయన పార్టీతో చేతులు కలపాలి అని చెప్పారీ 'మార్క్సిస్టు'(?) విశ్లేషకులు. ఆంధ్రలో బిజెపిని ఓడించడం అంత ముఖ్యమైన విషయం కాదు అని కూడా తేల్చేశారు. బిజెపిని ఓడించదగ్గ రాష్ట్రాలు, ఓడించక్కరలేని రాష్ట్రాలు అన్న లెక్కన కమ్యూనిస్టులు ఇకముందు ఎత్తుగడల రూపకల్పన చెయ్యాలి కాబోలు!
చంద్రబాబును ఓడించాలని అన్న అంశం మీద కమ్యూనిస్టులకి అభ్యంతరం లేదు. ఐతే ఎన్నికల లక్ష్యం 'ఓడించడం' మాత్రమేనా? ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ముఖ్యం. అంటే ఏ విధానాలు ప్రజలకు అనుకూలమో, ఆ విధానాలు ఎవరు అమలు చేస్తారో వారందరినీ గెలిపించుకోవడం. అందుకే కమ్యూనిస్టులు వ్యక్తుల్ని బట్టి గాక, విధానాల ప్రాతిపదికన నిర్ణయాలు చేస్తారు. అంతేకాని ఎత్తుగడలు నిర్ణయించేది అవతలివారి నమ్మకద్రోహమో, నమ్మదగిన లక్షణమో కాదు. చంద్రబాబు విధానాలు ప్రజావ్యతిరేకం గనుకనే కమ్యూనిస్టులు గత నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తూనే వున్నారు. పైగా ఈ నాలుగేళ్లుగా చంద్రబాబు కేంద్రంలోని అత్యంత ప్రజా వ్యతిరేకమైన మోడీ ప్రభుత్వంతో సఖ్యత నెరపడమేగాక కేంద్రంలోను, రాష్ట్రంలోను ఆ బిజెపితో అధికారాన్ని పంచుకున్నారు కూడా.
ఈ నాలుగేళ్లలో కమ్యూనిస్టు పార్టీలు రెండూ బలవంతపు భూసేకరణ పైన, ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పైన, దళితులపైన జరుగుతున్న అత్యాచారాలకు, దాడులకు వ్యతిరేకంగా పోరాడాయి. పోరాడుతున్నాయి. పోలవరం, వంశధార నిర్వాసితుల పోరాటాలు, గరగపర్రు, దేవరాపల్లి, అనంతపురం, పచ్చికాపల్లం, ఇలపర్రు దళిత సమస్యలపై పోరాటాలు, తుందుర్రు ప్రజల పోరాటం, రాజధాని ప్రాంత బాధితుల పోరాటం, అక్రమ మైనింగుపై గిరిజనుల పోరాటం, మద్యానికి వ్యతిరేకంగా మహిళల పోరాటం - ఇలా చెప్తూ పోతే చాలా ఉంది. కార్మిక రంగంలో కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు లక్షల మందిని కదిలిస్తున్నాయి. చంద్రబాబు కార్మిక వ్యతిరేకతను చాటిచెప్తున్నాయి. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు - ఇలా అన్ని తరగతుల ప్రజలనూ ఉద్యమాల వైపు నడిపిస్తున్నాయి కమ్యూనిస్టు పార్టీలు. నిన్నటికి నిన్న జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం బాహాటంగా బలపరిచిన సంఘాన్ని ఓడించిందీ కమ్యూనిస్టులు బలపరిచిన సంఘాలే.
నాలుగేళ్లుగా కనీవినీ ఎరుగని స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొన్నది కూడా కమ్యూనిస్టులే. లెక్కకు మించిన అరెస్టులు, కేసులు, గృహ నిర్బంధాలు, లాఠీఛార్జీలు ఈ కాలంలో కమ్యూనిస్టులే ఎదుర్కొన్నారు.
కమ్యూనిస్టులకి ఈ రాష్ట్రంలో బలం లేదని, ఇంగువకి కట్టిన గుడ్డ లాంటి వారనీ విఠల్ గారు సెలవిచ్చారు. పోనీయండి! వారి విలువైన అభిప్రాయం అది. ఐతే ఒక్క సీటు లేని కమ్యూనిస్టులే ఇన్నిన్ని పోరాటాలు చేస్తే మరి 85 సీట్లు గెలుచుకున్న ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఎన్ని పోరాటాలు చేయాలి? చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గపు విధానాలను అనుసరిస్తున్నదని నిజంగా వైసీపీ భావిస్తే ఎంతగా ప్రతిఘటించాలి? మరి ఏది ఆ ప్రతిఘటన?
ప్రతిఘటన సంగతి పక్కనబెడితే అసెంబ్లీ సమావేశాలకే గైర్హాజరయ్యారు. అంటే చట్టసభలో కూడా ప్రతిఘటించడం చేతగాకే గదా? అదీ పక్కనబెడితే, తమ పార్టీ నుండి టిడిపి కి ఫిరాయించి, మంత్రి పదవులు కూడా పుచ్చుకున్న వారి మీద పార్టీ పరంగా ఏమైనా చర్య తీసుకోగలిగారా?
ప్రజల తరపున అసెంబ్లీలో మొనగాడిగా నిలబడి ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టే అవకాశం ప్రతిపక్ష నాయకుడిది. ఏ ఒక్క సమస్యపైన అయినా అలా నిలదీయగలిగారా? అసెంబ్లీ లోపలా లేదు, బైట ముందు నుంచీ లేనే లేదు ప్రతిఘటన. ఎందుకు లేదు? ప్రజలు బాగానే ఓట్లేశారుగా? కారణం జగన్‌కు విధానపరంగా చంద్రబాబుతో పేచీ ఎప్పుడూ లేదు. సిఎం సీటు కోసమే పేచీ.
అందుకే బిజెపితో స్నేహాన్ని కోరుకున్నారే తప్ప ఆ పార్టీ చేస్తున్న దుర్మార్గాల్ని జగన్ ఏనాడూ ఖండించలేదు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో బలపరిచారు. మొన్నటికి మొన్న బిజెపి అభ్యర్థిని ఓడిస్తామని ముందు రోజే ప్రకటించి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో ఆ మర్నాడే ఫిరాయించి ఓటింగుకు గైరుహాజరయ్యారు. ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపి పట్ల జగన్ ఇంత మెత్తగా, మెతకగా ఉన్నాడంటే విధానపరంగా తేడా ఏమీ లేదనే గదా అర్థం? నోట్ల రద్దు, జిఎస్టి విషయాల్లో కూడా బిజెపిని బలపరిచారుగా! దేశమంతటా ఛీకొట్టిన రీతిలో లౌకికవాదాన్ని భ్రష్టు పట్టిస్తూ, నీరవ్ మోడీ వంటి దొంగలకు చేయూతనిస్తూ, అవినీతి ఆరోపణల్లో మునిగితేల్తున్నా, బిజెపిని జగన్ ఏనాడు విమర్శించిందిలేదు. పచ్చి మైనారిటీ విద్వేషం, మనువాద, పురుషాధిక్యత, దళిత గిరిజన వ్యతిరేకత మూర్తీభవించిన బిజెపి పట్ల జగన్‌కు ఎందుకంత సాఫ్ట్ కార్నర్? మోడీ - బాబు ది లాలూచీ కుస్తీ అన్నారు కదా విఠల్ గారు? మరి మోడీ- జగన్ ది ఏమిటి? లాలూచీగాక ఇంకేమిటి?
చంద్రబాబు, జగన్ విధానాలలో తేడా ఏమీ లేదుగనకనే ఆ విధానాలపై ఎటువంటి ప్రతిఘటనా లేదు వైసిపి నుంచి. గరగపర్రులో దళితులపై దాడి జరిగిన సందర్భంగా కమ్యూనిస్టులు వారికి అండగా నిలిచి భూస్వాములు, అగ్రవర్ణాల పెత్తనాన్ని ఎదిరించి పోరాడారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్ ఆనాడు భూకామందులకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనలేదు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న పరిశ్రమల యజమానులకి చంద్రబాబు, ప్రభుత్వం కొమ్ముగాస్తున్నాయి. కమ్యూనిస్టులు ప్రజలకండగా నిలిచి పోరాడుతున్నారు. జగన్ ఎటున్నారు? మౌనంగా ఉండడం అంటే యజమానులకు కొమ్ముగాయడమే కదా?
ఆర్థిక విధానాలపరంగా గాని రాజకీయ విధానాలపరంగా గాని ఏ విధంగా చూసినా చంద్రబాబుకి జగన్ ప్రత్యామ్నాయం కాదు. కనుక చంద్రబాబుని ఓడించడం అంటే జగన్‌ను గెలిపించమని అర్థం కాదు. ప్రజలు కోరుకుంటున్నది విధానాలతో మార్పు తప్ప 'నీ ఎడం చేయి తీసెయ్యి - నా పుర్ర చేయి పెడతా' అన్న చందాన జరిగే మార్పు కాదు.
కమ్యూనిస్టులు జనసేనతో కలిసి పోరాటం చేస్తే చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి. కాబట్టి కమ్యూనిస్టులు జనసేనతో కలవ కూడదు. ఇది వైఎస్సార్సీపీ వాదన. కమ్యూనిస్టులు జనసేనతో కలిసి పోటీ చేస్తే జగన్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి గనుక అలా చేయొద్దని టిడిపి వాదన. వాదనలు వేరైనా సారాంశం ఒకటే. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైసిపి రెండు ధృవాల చుట్టూ మాత్రమే తిరుగుతున్న రాజకీయాలను అలాగే ఉంచాలని, ఈ ఇద్దరిలో ఎవరు గెల్చినా అవే విధానాలు కొనసాగుతాయనేది దాని వెనుక పరమార్థం. ఇది ప్రజలకు పెద్ద ద్రోహం.
అందుకే రాష్ట్రం బాగు పడాలంటే ప్రజల పరిస్థితులు ఏమేరకైనా బాగుపడాలంటే వీరిద్దరికీ విధానపరంగా ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవాలని సిపిఐ, సిపిఎం భావించాయి. ఆ ప్రత్యామ్నాయ విధానాన్ని 2018 జూన్ 20న ప్రకటించాయి. ఆ విధానాల అమలు కోసం జనసేన మాత్రమే కాదు, ఆప్, బిఎస్పీ, లోక్‌సత్తా, ఫార్వార్డ్ బ్లాక్, మరికొందరు వ్యక్తులు, సంస్థలు ఎవరు ముందుకు వచ్చినా వారందరినీ కలుపుకుని నిజమైన ప్రత్యామ్నాయాన్ని, ప్రజల ప్రత్యామ్నాయాన్ని ముందుకు తేవాలన్నది సిపిఎం, సిపిఐల విధానం. అదే రాష్ట్రానికి మంచి భవిష్యత్‌ను గ్యారంటీ చేస్తుంది.
- ఎంవిఎస్ శర్మ