అన్నీ ముందే ఉన్నాయష! ఎప్పుడో ఉన్నాయష!! ఇప్పుడు మాత్రం లేవష!!!
గుండుసూది నుండి రాకెట్ వరకూ అన్నీ మనోళ్ళకు ముందే తెలుసట. ఐతే అన్నీ మరచిపోయా రట. గుర్తుకు రావటం లేదట. ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా, ఎదుటివాడి బుర్రను చీల్చినా వాటి గురించిన సమాచారం దొరకటం లేదట. కానీ ఉన్నాయట. మరి కనిపెట్టేదెట్లా? ఇలా అన్నీ ముందే తెలుసట అన్న బ్యాచ్ ఒకరోజు కూచొని ఆలోచించి, ఆలోచించి అవన్నీ దొంగిలించుకుపోయారని చెబితే ఎలాగుంటదని చర్చించి దాన్నే ఫిక్స్ చేశారట. అన్నీ ఉన్న గ్రంథాలు ఎవరో ఎత్తుకుపోయారట! మరి అలా ఎత్తుకుపోయిన వారికి మన భాష రాదే? వాటిని తమ భాషలోకి ఎలా మార్చుకున్నారబ్బా అన్న అనుమానం రాక తప్పదు. దానికీ సమాధానం చెబుతారు అలాంటి మీటింగ్ ఇంకోటి వేసుకొని!
ఇక భక్తి మార్గం బోధించే టీవీ చానళ్ళు. అసలు టీవీ అన్న పరికరం కనిపెట్టింది సైన్సు శాస్త్రవేత్తలు అన్న విషయమే మరచిపోయారు. అందులో ఒక కార్యక్రమం రావాలంటే షూటింగు తీసిన కెమెరా నుండి టీవీ చూసేటప్పుడు వేసే స్క్రోలింగుల వరకు అన్నీ సైన్సే అన్న విషయం అటు టీవీ వాళ్ళకు, ఇటు వీక్షకులకు ఎవ్వరికీ గుర్తుండదు. అందులో దేవుళ్ళు చేసే సాహస కృత్యాలు, వేసే బాణాలు, కురిపించే వర్షాలు, రాక్షసుల మీదికి వదిలే అగ్ని, ఇలా ఒకటేమిటి ప్రత్యక్షం కావటం, పెద్ద శబ్దంతో మాయమైపోవటం అన్నీ కూడా సైన్సు ద్వారా కనిపెట్టిన పరికరాల నుండే. ఏమన్నా అంటే అన్నీ ముందే ఉన్నాయష అంటే చాలు అన్నీ మనవైపోతాయి.
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపించే కార్యక్రమానికి ముహూర్తం పెట్టటం మనకు మాత్రమే వచ్చే కళ. ఇంట్లో, ఆఫీసుల్లో, బస్సులో ఇంకా ఎక్కడైతే కరెంటు దీపాలు వెలిగిస్తారో అక్కడ దేవుణ్ణి మొక్కుకునే జనాలని చూడొచ్చు. మన బస్సుల్లో కూడా చీకటి పడే వేళకు డ్రైవర్లకు అలవాటై పోయుంటుంది లైట్లు ఒక సారి వేసి ఆఫ్ చేయటం. అసలు నడిచే బస్సు, అందులో వేసే డీజిల్, తారు రోడ్డు, ఫోర్వేలు, మధ్యలో కప్పం కట్టించు కునే టోల్ గేట్లు ఏదీ పై నుండి ఊడిపడింది కాదు. అన్నీ సైన్సు ప్రకారం, దాని ఆధారంగా పని చేసే కొన్ని సూత్రాల ప్రకారం పని చేస్తున్నవే. శాస్త్రీయ అవగాహన పెంచటం అటుంచి దాన్ని మరుగున పడవేయటం పాలకులకు, వ్యాపార వేత్తలకు, పారిశ్రామికవేత్తలకు మొత్తం గా పెట్టుబడిదారీ వర్గానికి ఎంతో అవసరం. కర్మాగారంలో పని చేసే యంత్రం దగ్గర నుండి కంప్యూటర్ వరకు అన్నీ సైన్సే. కానీ అక్కడ సైన్సుకు ఎప్పుడూ మైనస్సే. దేవుడిదే అక్కడ డామినేషన్. ఆ దేవుడిని అడ్డుపెట్టుకుని సైన్సును తొక్కేసే వాడికే లాభాలన్నీ. ఒక పక్క శాస్త్రీయ విజ్ఞానం పెంపొందిస్తామని చెప్పే వారే దానికి వ్యతిరేకంగా ప్రవర్తిం చటం అన్ని రంగాల్లోనూ చూడొచ్చు. సైన్సు ప్రాముఖ్యత గురించి ఉపన్యా సాలిచ్చే పై స్థాయి లోని నాయకులు తాము వ్యక్తిగతంగా చేసుకోవలసిన భక్తి కార్యక్రమాల్ని ప్రజలందరూ చూసే విధంగా చేస్తే సైన్సును కాదని నమ్మకాల్ని ప్రజలకు బోధించినట్టే.
అందుకే సైన్సును సైన్సుగా అంగీకరించి శాస్త్రీయమైన ఆలోచన లతో ప్రజల్లోకి తీసుకుపోవలసిన బాధ్యత జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలు తమ భుజాన వేసుకున్నా యి. వీరికి చదువుకున్న వారు, ఆలోచనలు కలవారు తోడ్పాటునిచ్చి వాటిద్వారా ప్రజలకు శాస్త్రీయ విజ్ఞా నాన్ని అందించవలసిన అవసరం నేడు పెరిగింది. ఆవైపుగా అందరూ అడుగులు వేయాలి.
- జంధ్యాల రఘుబాబు, సెల్ : 9849753298
సైన్సు ఎప్పటినుంచో ఉందష..!!
