విశాఖలో ఆదివారం ముగిసిన సిపిఐ(ఎం) అఖిలభారత 21వ మహాసభ బలమైన పార్టీ, తద్వారా వామపక్ష శక్తుల ఐక్యత, విశాలమైన వామపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించడం సముచితం. గత మంగళవారంనాడు ఆరు వామపక్ష పార్టీలు ప్రారంభ సభ వేదికను పంచుకోవడం, ఆదివారంనాటి ప్రదర్శనకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు పూల జల్లులతో స్వాగతం పలకడం ముదావహం. మతతత్వం, నయా ఉదారవాద విధానాలను కలగలిపి జనంపై ముప్పేట దాడిసాగిస్తున్న మోడీ పాలనను ప్రతిఘటించేందుకు వామపక్ష పార్టీలు, శక్తులు, సంస్థలు, వ్యక్తులంతా సమైక్యంగా కృషి చేయాలన్న మహాసభ పిలుపునకు ఇది ప్రారంభ స్పందనగా భావించవచ్చు. మహాసభల ముగింపులో జరిగిన ప్రదర్శన, బహిరంగసభల్లో అశేష ప్రజానీకం పాల్గొనడం ఆ పార్టీ విధానానికి లభించిన ఆదరణకు సూచిక.
గడచిన 25 ఏళ్లుగా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడల పంథాను ఆత్మవిమర్శనా పూర్వకంగా సమీక్షించుకుని ఇక ముందు చేపట్టవలసిన మార్గాన్ని మహాసభ నిర్ణయించింది. జాతీయ స్థాయిలో ఎలాంటి పొత్తులుండబోవని, రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి, వామపక్ష ప్రజాతంత్ర సంఘటన పురోగమనానికి తోడ్పడే రీతిలో వామపక్షేతర పార్టీలతో సర్దుబాట్లు చేసుకోవచ్చని నిర్ణయించడం ఒక మూల మలుపు. అదే సమయంలో ఎన్నికల ఎత్తుగడలు జాతీయ రాజకీయ విధానానికి లోబడే ఉంటాయని వక్కాణించడం ఆ పార్టీ నిబద్ధతకు తార్కాణం. మతతత్వానికి, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడానికి మహాసభ ఆమోదించిన రాజకీయ తీర్మానాన్ని ఒక సాధనంగా వినియోగించాలని ప్రకాశ్ కరత్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. రాజకీయ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన మహాసభ పార్టీ నిర్మాణాన్ని గురించి లోతుగాచర్చించి తగిన నిర్ణయాలు చేయడానికి ఈ ఏడాది చివరిలోగా ప్లీనం నిర్వహించాలని తీర్మానించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక కావడం తెలుగువారందరికీ గర్వకారణం. 91 మందితో కేంద్ర కమిటీని, 16 మంది పొలిట్‌బ్యూరోతో కూడిన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆ పార్టీలో ఐక్యతకు తార్కాణం. కేంద్ర కమిటీకి 17 మంది కొత్త సభ్యులను (సుమారు 20 శాతం) తీసుకోవడం అభినందనీయం. యువ రక్తాన్ని చేర్చడానికీ, మహిళా ప్రాతినిధ్యం పెంచడానికీ గట్టిగానే ప్రయత్నించింది. పొలిట్‌బ్యూరోలోకి మరో మహిళను తీసుకోవడమే కాక మొత్తం కేంద్రకమిటీలో 14 మంది మహిళలున్నారు. వయోవృద్ధుడు 91 ఏళ్ల కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ మొదలు 27 సంవత్సరాల అతిపిన్న వయస్కుడి వరకు మొత్తం 812 మంది ప్రతినిధులు, పరిశీలకులు హాజరై అనుభవాలు కలబోసుకున్నారు. మహాసభకు హాజరైనవారిలో సగంమందికి జైలు జీవితం వుందంటే సిపిఎం నాయకులపై పాలకవర్గాలకు ఎంతటి ఆగ్రహమో విదితమవుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సమస్యలపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశం జరపాలని, పని ప్రదేశాల్లో పురుషులకు ప్రవర్తనా నియమావళి నిర్ణయించాలని డిమాండ్ చేయడంతోసహా మొత్తం 26 తీర్మానాలను మహాసభ ఆమోదించింది. సిపిఎం నిర్మాతల్లో ఒకరైన హరికిషన్‌సింగ్ సూర్జిత్ శత జయంతి సంవత్సరాన్ని, అక్టోబరు మహావిప్లవం శత వార్షికోత్సవాన్ని నిర్వహించాలని మహాసభ తీర్మానించింది. పాలస్తీనాకు సంఘీభావం మొదలు ప్రత్యేక హౌదా, అభివృద్ధి ప్యాకేజీలపై తెలుగు రాష్ట్రాలకిచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఎన్కౌంటర్ పేరిట పోలీసులు శేషాచలం కొండల్లో కూలీలను, తెలంగాణలో విచారణలోవున్న ఖైదీలను కాల్చిచంపడాన్ని మహాసభ తీవ్రంగా ఖండించడం మహాసభ స్పృశించిన అంశాలవిస్తృతికి నిదర్శనం.
ఆదివారంనాడు మండుటెండను సైతం లెక్క చేయకుండా చేతిన జెండా, చంకన బిడ్డను పట్టుకొని వేలాదిమంది కష్టజీవులు విశాఖ నగరంలో కదం తొక్కడం ఓ అద్భుత ఘటన. వనాలు, కొండలు దాటి అడవి బిడ్డలు రాగా, అటు సముద్ర మార్గాన మత్స్యకారులు పడవలతో బహిరంగసభ వద్దకు రావడం ఎర్ర జెండాపట్ల శ్రామికుల మక్కువకు ఓ మచ్చు తునక. కార్మికవర్గం, మధ్యతరగతి ప్రజలు, చిన్న పెద్దతేడా లేకుండా అన్ని వయసుల వారూ రావడంతో ప్రదర్శన అక్కడికి చేరకముందే ఆర్కె బీచ్ కిక్కిరిసిపోయింది. రండి మార్పు తెద్దాం..... అని కొత్త ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రజలకిచ్చిన పిలుపునకు బహిరంగసభలో వచ్చిన స్పందన ఆమోఘం. పార్టీ నాయకులు విశాఖలో బాక్సైట్ మైనింగ్, రాష్ట్రంలో ల్యాండ్ పూలింగ్ పేరిట టిడిపి ప్రభుత్వం సాగిస్తున్న భూ కబ్జా మొదలు ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ వరకు అనేక ప్రజా సమస్యలను సోదాహరణంగా వివరించడం ఆ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం. నయా ఉదారవాద విధానాల అమలులో మోడీ గత మన్మోహన్ ప్రభుత్వాన్ని మించిపోయిన తీరును ప్రజలకు వివరించడం, మతతత్వాన్ని, సరళీకరణ విధానాలను ఏకకాలంలో ప్రతిఘటించడానికి పిలుపునివ్వడం సముచితంగా ఉంది. రాముని ఆశ్వమేధ యాగాన్ని లవకుశులనే కవల పిల్లలు అడ్డుకున్న రీతిలో నేడు మోడీ సాగిస్తున్న ప్రజా కంటక పాలనాశ్వాన్ని కార్మిక, కర్షకులు ప్రతిఘటించి తీరుతారని ఏచూరి ఉపమానం చెప్పినపుడు మార్మోగిన హర్షధ్వానాలు ప్రజల సంసిద్ధతకు ఆనవాళ్లు.