రెండు వారాలు...మూడు కేసులుప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి
తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే, టిడిపి అభ్యర్థి బొండా ఉమా మహేశ్వరరావు రెండు వారాల్లో మూడు కేసుల్లో ఇరుక్కున్నారు. అధికార బలంతో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేసినా, భూకబ్జాలకు పాల్పడినా పట్టించుకోని ఉన్నతాధికారులు తాజాగా హైకోర్టు జోక్యంతో ఆయనపై కొరఢా ఝురిపించేందుకు సిద్దమయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికలలో అవినీతి మరకలేని పార్టీగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే తెలుగుదేశం పార్టీ తరుపున బొండా ఉమామహేశ్వరరావు సెంట్రల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన ఎన్నికల బరిలో నిలిచిన రెండు వారాల్లోనే ఆయనపై మూడు కేసులు నమోదు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2017లో ఆనాటి ఎంపి కేశినేని శ్రీనివాస్ ట్రావెల్స్‌కు చెందిన బస్‌ల నిర్వహణలో లోపాలను ఎత్తి చూపినందుకు ట్రాన్స్‌పోర్టు అధికారులపై టిడిపి ప్రజా ప్రతినిధులు దాడి చేశారు. సీనియర్ ఐపిఎస్ అధికారిగా ఉన్న ట్రాన్స్‌పోర్టు కమీషనర్ బాల సుబ్రమణ్యంను ఆయన కార్యాలయం వద్దే నడి రోడ్డుపై నిలబెట్టారు. ఆయనకు రక్షణగా ఉన్న పోలీసు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎంపి కేశినేనికి వత్తాసుగా వెళ్లిన బొండా ఉమామహేశ్వరావు కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడం అప్పట్లో ప్రసార మాధ్యమాల ద్వారా హల్చల్ చేసినప్పటికీ అధికార పార్టీ నేతలు కావడం, ఆయా నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు సారీ చెప్పమని ట్రాన్స్‌పోర్టు అధికారులకు చెప్పడంతో అప్పట్లో దాడి ఘటనపై చర్యలు లేకుండా పోయాయి. అయితే ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు తాజాగా కమీషనర్, డిప్యూటీ కమీషనర్, ఇతర సిబ్బందిపై దాడి చేసిన ఎంపి కేశినేని శ్రీనివాస్, ఎంఎల్‌సి బుదా వెంకన్న, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, టిడిపి నాయకుడు నాగుల్ మీరాలపై ఈ నెల 19వ తేదీన చర్యలకు ఆదేశించింది. వారికి నోటీసులు జారీ చేసి విచారణకు దిగింది. ఇదే రీతిలో ఎమ్మెల్యేగా ఎన్నికైన మరుసటి సంవత్సరమే 2015లో దుర్గాపురంలో ఓ ఇంటిని తన అనుచరుల చేత బొండా ఉమామహేశ్వరరావు కబ్జా చేయించడానికి చూసిన ఘటనలో సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో ఈనెల 14వతేదీన కేసు నమోదైంది. సుమశ్రీ అనే మహిళ తన కుమార్తె సాయిశ్రీ పేరుపైఉన్న ఇంటిని అమ్ముకునేందుకు చూడగా దానిని మాదం శెట్టి శివకుమార్ అనే వ్యక్తి ఆక్రమించాడని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అండతోనే ఇదంతా చేశాడని అప్పట్లోనే పోలీసులను ఆశ్రయించగా పోలీసులు పట్టించుకోలేదు. క్యాన్సర్‌తో భాదపడుతున్న తన కుమార్తె వైద్య సదుపాయాల కోసం అప్పట్లో ఆమెను ఇంటిని అమ్మడానికి చూసినా సాధ్యపడక పోవడం, సాయిశ్రీ చనిపోవడంతో సాయిశ్రీ మృతికి బొండా ఉమామహేశ్వరరావు కారణమంటూ అప్పట్లో నిరసనలు మిన్నంటాయి. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పోలీసులు నోరెత్తక పోవడంతో సుమశ్రీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు నుండి కేసు నమోదు చేయాలని ఆదేశాలు రావడంతో ఎట్టకేలకు పోలీసులు చలించారు. నాటి ఘటనకు సంభందించి ఈ నెల 14వ తేదీన సూర్యారావుపేట పోలీసులు మాదంశెట్టి శివకుమార్, బొండా ఉమామహేశ్వరావుతోపాటుగా మరో 10 మందిపై సుమశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ బొండా ఉమామహేశ్వరరావు, అతని కుమారుడు చేసిన దౌర్జన్యంపై అజిత్ సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8వ తేదీన సాధారణ ఎన్నికల నేపథ్యంలో వైసిపి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్న పారిశ్రామిక వేత్త కోగంటి సత్యంపై ఒకింత దాడికి యత్నించారు. దుర్బాషలాడారంటూ కోగంటి ఫిర్యాదు చేయగా విచారణ నిర్వహించిన పోలీసులు బొండా ఉమామహేశ్వరరావుతో పాటుగా అతని ఇద్దరు కుమారులు రవితేజ, సిద్ధార్థలపై కేసు నమోదు చేశారు. దీంతో రెండు వారాల వ్యవధిలో బొండా ఉమామహేశ్వరరావుపై మూడు కేసులు నమోదైనట్లు అయ్యింది. అధికార బలంతో చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడిందంటూ ప్రచారం జరుగుతోంది.
రెండు వారాలు...మూడు కేసులు
