రాజమహేంద్రవరం అర్బన్ : సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల5న జిల్లాకు చేరుకుంటుందని ఆ పార్టీల జిల్లా కార్యదర్శులు టి.మధు, టి.అరుణ్ తెలిపారు. సోమవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. సిపిఎం జిల్లా(రాజమహేంద్రవరం0 కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఉభయ కమ్యూనిస్టుపార్టీలు పలు కార్యక్రమాలను చేపట్టాయన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 రకాల తరగతులు ఎదొర్కొంటున్న సమస్యలపై సదస్సులు నిర్వహించామన్నారు. రెండో దఫాగా రాష్ట్రంలో రెండు బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయన్నారు. నాలుగేళ్ల కాలంలో మోడీ విధానాల వల్ల ప్రజలు అష్టకష్టాలు పడ్డారన్నారు. పెట్రోలు ధరలు పెంపు, రూపాయి పతనం, నోట్లరద్దు, జిఎస్టి వంటి విధానలతో ప్రజాజీవనం అస్తవ్యస్తమైందన్నారు. ఆర్బిఐ లెక్కల ప్రకారం నోట్లరద్దు వల్ల దేశానికి, ప్రజలకు ఒరిగిందేమీ లేదని స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ విధానాలనే బిజెపి ప్రభుత్వం కొనసాగించిందన్నారు. రాష్ట్రంలో టిడిపి ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ గాలిలో కలిసిపోయాయన్నారు. పోలవరం నిర్వాసితులను నట్టేట ముంచారన్నారు. కార్మిక పోరాటాలపై నిర్బంధాన్ని విధించారన్నారు. వైసిపి నాయకుడు జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించడంతో పూర్తిగా విఫలమయాయరన్నారు. టిడిపికి, వైసిపికి విధానాల పరంగా పెద్దగా తేడా లేదన్నారు. ఈ నాలుగు పార్టీలు ప్రజలకు న్యాయం చేసేలాలేవన్నారు. అందుకునే వామపక్షాలు నూతన ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నాయన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు కుటుంబ పార్టీలను ఓడించాలని, మూడవ ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ఆదరించి జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో బయలు దేరిన బస్సు యాత్ర జిల్లాలో ఈ నెల 5వతేదీ యంత్రానికి తుని ప్రాంతానికి వస్తుందన్నారు. అక్కడ నుంచి దివీస్ ప్రాంతానికి, అన్నవరం చేరుకుంటుందన్నారు. 6న ఉదయం అడ్డతీగల, రంపచోడవరం మీదుగా రాజమండ్రి చేరుకుంటుందన్నారు. 7న కాకినాడ భానుగుడి సెంటర్, అమలాపురం గడియార స్తంబం సెంటర్కు చేరుకుని అక్కడ నుంచి పశ్చిమగోదావరిలోకి యాత్ర వెళ్తుందన్నారు. 15న రెండు లక్షల మంది ప్రజానీకంతో విజయవాడలో మహాగర్జన సభను నిర్వహిస్తున్నామన్నారు. మాజీ ఎంఎల్సి జార్జివిక్టర్ మరణం తీరని లోటని ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. స్థానిక వెంకటేశ్వర మార్కెట్లో కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం చలో విజయవాడ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగరకార్యదర్శి పోలినవెంకటేశ్వరావు, సిపిఐ నగరకార్యదర్శి నల్లారామారావు, సిపిఐనాయకులు తోకల ప్రసాద్, కిర్లకృష్ణ, జుత్తుక కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 5 నుంచి బస్సు యాత్ర ప్రారంభం
