కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మళ్లీ పెట్రో ఛార్జీలను భారీగా పెంచాయి. పెట్రోలుపై లీటరుకు రూ.3.13, డీజిల్‌పై రూ.2.71 ధర పెంచాయి. పెరిగిన పెట్రో ధరల కారణంగా జిల్లాలోని పెట్రో వినియోగదారులపై నెలకు రూ.9.44 కోట్ల అదనపు భారం పడనుంది, శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెట్రో ధరలు పెరగడంతో రవాణా, బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసరాల ధరలకూ రెక్కలొచ్చే అవకాశం ఉంది.
ప్రజాశక్తి - రాజమండ్రి ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలను నియంత్రణ నుంచి తప్పుకోవడంతో వినియోగదారులపై ఈ సంస్థలు అదనపు ఆర్థిక భారాలను మోపుతున్నాయి. ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ పేదలు, మధ్యతరగతి ప్రజల చేబులకు చిల్లు పెడుతున్నాయి. నిత్యావసరాలు, కూరగాయల ధరల పెరుగుదలతో సతమత మవుతున్న వినియోగదారులు డీజిల్, పెట్రోలు ధరల పెంపును నిరసిస్తున్నారు. డీజిల్ ధర ప్రతి నెలా లీటరుకు 50 పైసల చొప్పున పెరుగుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు డీజిట్ ధరను చమురు సంస్థలు మళ్లీ పెంచాయి. జిల్లాలో రోజుకు సుమారు ఏడు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నారు. నెలకు 2.10 కోట్ల లీటర్ల వినియోగం అవుతోంది. డీజిల్‌పై రూ.2.71 ధర పెరగడంతో వినియోగదారులపై నెలకు రూ.5 కోట్ల 69 లక్షల 10 వేల అదనపు భారం పడనుంది. అదేవిధంగా జిల్లాలో రోజుకు సుమారు నాలుగు లక్షల లీటర్ల పెట్రోలు వినియోగం అవుతోంది. నెలకు 1.20 కోట్ల లీటర్లు వినియోగిస్తున్నారు. తాజాగా లీటరుకు రూ.3.13 ధర పెరిగింది. దీంతో జిలాలోని వినియోగదారులపై నెలకు రూ.3 కోట్ల 75 లక్షల 60 వేల అదనపు భారం పడింది. పెట్రో ధరల పెంపుపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది.
భారీగా పెట్రో బాదుడు
