నిన్న మొన్నటివరకూ ముంచెత్తిన వరదలు తగ్గుముఖం పట్టాయి. వరదలు తగ్గినా బురద మాత్రం మిగిలింది. ఎక్కడికక్కడ జలవనరులన్నీ వరదనీటితో కొట్టుకొచ్చిన వ్యర్థాల వల్ల కలుషితమై పోయాయి. పరిశుభ్రమైన తాగునీరు మాట అటుంచి, సాధారణ అవసరాలకు వినియోగించే నీరూ రకరకాల వ్యాధులకు కారణమవుతోంది. ముఖ్యంగా స్నానాలకు ఉపయోగించే నీటిలో రకరకాల సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా చేరిపోయాయి. వీటివల్ల రకరకాల చర్మవ్యాధులు తలెత్తుతున్నాయి. వీటిలో దురదలు, గజ్జి, తామర వంటివి తీవ్రంగా ఉన్నాయి. ఈ చర్మవ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా నిత్య జీవితంలో తీవ్ర అసౌకర్యానికీ, ఇబ్బందులకూ గురిచేస్తాయి. చర్మానికి ఎంతో హాని చేస్తాయి. ఈ నేపథ్యంలో వరదలతో కలుషితమైన నీటి వల్ల చర్మానికి సంక్రమిస్తున్న అంటువ్యాధులు, లక్షణాలు, చికిత్సలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వారం 'డాక్టర్ స్పెషలిస్ట్'లో....
చర్మవ్యాధుల బారిన పడనివారు దాదాపు అరుదుగా ఉంటారు. అపరిశుభ్ర వాతావరణం, కాలుష్యంతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారు ఎక్కువగా చర్మవ్యాధుల బారిన పడుతుంటారు. వరదలతో కలుషితమైన నీరు స్నానాలు చేయడానికీ సురక్షితం కాకపోవడంతో ఈ చర్మవ్యాధులు చుట్టుముడుతున్నాయి. వీటిలో గజ్జి, తామర అనేవి ప్రధానమైనవి.
గజ్జి
గజ్జినే 'స్కాబిస్' అని అంటారు. దురదలనీ వ్యవహరిస్తుంటారు. ఈ చర్మవ్యాధి సార్కోప్టస్ స్కాబీస్ అనే పరాన్నజీవి వల్ల సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఉన్న వారితో సంబంధం పెట్టుకున్న వారికి వ్యాపిస్తాయి. వ్యాధి క్రిములతో కలుషితమైన నీటి ద్వారా చర్మంలో తిష్ట వేస్తాయి. ఈ క్రిములు ప్రవేశించిన నాలుగు వారాల్లో దురద మొదలవుతుంది. అది గజ్జిగా మారుతుంది.
లక్షణాలు
చర్మంపై దురద ఏర్పడడం ఈ వ్యాధి లక్షణాల్లో అతి సహజమైనది.
ఈ సూక్ష్మజీవులు నివసిస్తున్న చర్మం మీద చిన్న చిన్న ఎరుపు రంగు పొక్కులు, పుళ్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన దురద వస్తుంది.
రాత్రి వేళల్లో దురద విపరీత స్థాయిలో ఉంటుంది.
గజ్జి పుళ్ల వల్ల చర్మం మీద జరిగే ప్రతిచర్యతో తీవ్రమైన దురద వస్తుంది.
మొదటిసారిగా గజ్జి సోకిన వ్యక్తి ఎన్నో నెలలకుగానీ ఈ దురదకు కారణం తెలుసుకోలేరు.
అంటువ్యాధుల వల్ల ఈ కీటకం చేరిన కొన్ని గంటలలోపు ఆపుకోలేని దురద ప్రారంభమవు తుంది. ఈ కీటకాలు మూడు రోజులు మాత్రమే మనిషి శరీరం మీద జీవించి ఉంటాయి.
గజ్జిని కలిగించే క్రిములు వ్యాధితో ఉన్నవారి దుస్తులపైనా ఉంటాయి. వారి పక్క బట్టలనూ ఆశ్రయిస్తాయి. వాటిద్వారా మరికొన్ని సూక్ష్మజీవులను వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, సహచరులకు వ్యాపింపజేస్తాయి.
దుస్తులను, పక్క బట్టలను శుభ్రపరిచేవరకూ.. తగిన చికిత్స పొందిన తర్వాతా.. ఒక వ్యక్తి తిరిగి ఈ వ్యాధి కలిగియున్న అదే వ్యక్తితో, మరో వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నా ఇది సోకే అవకాశముంది.
ఎక్కడ సోకుతుంది?
చేతి వేళ్ల మధ్య, వేలి పక్కన ఉండే చర్మం, కాలి వేళ్ల వద్ద, తొడల మధ్య, గజ్జలలో, చంకల మధ్య, మోకాలు, మోచేయి కింద భాగంలో, మణికట్టు వద్ద, పొత్తి కడుపు ప్రాంతంలో గజ్జి తొందరగా ఏర్పడుతుంది. అరచేయి కింద ప్రాంతంలో ఎప్పుడో కానీ గజ్జి పుళ్లు కనపడవు. అలాగే కాలి పాదాల మీద ఎప్పుడో కానీ కనపడవు. అలాగే మెడ మీదా కనపడవు.
వ్యాప్తి
గజ్జి వ్యాధి ఉన్న వారి ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ క్రిములతో కలుషితమైన నీటిని స్నానాలకు ఉపయోగించేవారికీ ఇది సోకుతుంది. ఈ వ్యాధికి తగిన చికిత్స జరగనంత వరకూ వారితో సంబంధం గల ఇతరులకు ఇది సంక్రమిస్తుంది. గజ్జిని కలిగించే పరాన్నజీవి 0.3 మిల్లీ మీటర్ల పొడవు ఉండే ఒక కీటకం (మైట్). ఆడ పరాన్నజీవి మనిషి శరీరంలోని చర్మం కింద చిన్న కన్నం చేసుకుని.. అక్కడ రెండు, మూడు గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లు రెండు గంటల్లోగా వృద్ధి చెందుతాయి. అవి పదిరోజుల్లోనే కీటకాలుగా ఎదుగుతాయి. అవి నివసించిన ప్రదేశంలో గజ్జి ఏర్పడి, అంటువ్యాధిగా వ్యాపిస్తుంది. లక్షల సంఖ్యలో ఉన్న ఈ కీటకాల వలన వ్యాధి వ్యాపిస్తే ఏ వ్యక్తి అయినా ఆ పుండ్లను గోకినా, గోకక పోయినా, ఆ వ్యక్తిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి దగ్గరగా చర్మ సంబంధం వల్ల సోకుతుంది. భార్యాభర్తలు ఒకరితో ఒకరు రాత్రి వేళల్లో శారీరక సంపర్కం కలిగి ఉండడం వల్ల సోకుతుంది. ఈ వ్యాధి సోకినవారు నిద్రించిన పరుపులను, పక్కలను ఉపయోగించినా, వారు ధరించిన దుస్తులు ధరించినా లేదా వారితో కరచాలనం చేసినప్పుడు ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. మధుమేహ రోగుల్లో, రక్త క్యాన్సర్ రోగులు, మందులు వాడటం వలన రోగ నిరోధక శక్తి తగ్గినవారిలో, శారీరక అవయవాలను శస్త్ర చికిత్స ద్వారా మార్పిడి చేయించుకుని, మందులు వాడుతున్న వారిలో, ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారిలో గజ్జి తీవ్రంగా ఉంటే దానిని 'క్రస్టడ్ స్కాబీస్, నార్వీజీయన్ స్కాబీస్' అని అంటారు.
చికిత్స
గజ్జి నివారణకు తీవ్రతను బట్టి అనేక రకాల లోషన్లను రాస్తారు. సాధారణంగా ఐదు శాతం పెరిమిథిన్ను లోషన్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ద్రవాన్ని శరీరం మీద రాసి, 12 నుంచి 24 గంటలు ఉంచాలి. దీనిని శరీరమంతా ఒకసారి రాస్తే చాలు. ఒకవేళ ఈ క్రిములు ఒక వారం తర్వాతా శరీరంపైన ఇంకా జీవించి ఉంటే అప్పుడు స్కాబీసైడ్ను తిరిగి రాయాలి. అప్పటికీ కాలమైన్ ద్రవం, యాంటీ హిస్టామిన్ మందులు పూత పూయడం వలన దురద కొంతవరకు ఉపశమిస్తుంది. మరీ తీవ్రంగా ఉంటే యాంటిబయాటిక్ మాత్రలు, ఇంజెక్షన్లనూ ఉపయోగించి చికిత్స చేయాలి.
తామర
వరదలతో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్ల రకరకాల స్కిన్ అలర్జీలు వస్తుంటాయి. అయితే ఇవి తాత్కాలికంగా ఇబ్బందులకు గురిచేసిన తర్వాత తగ్గిపోతుంటాయి. కానీ తామర వంటి చర్మవ్యాధులు దీర్ఘకాలం ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. గజ్జి కన్నా మరింత చికాకుకు గురిచేసే అంటువ్యాధి తామర. దీనిని 'రింగ్వర్మ్' అని కూడా వ్యవహరిస్తారు. ఇది చర్మం మీద వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్ó. డెర్మటోఫైట్స్ అను సూక్ష్మక్రిములు చర్మము మీద తామరను కలుగచేస్తాయి. ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో విపరీతమైన దురద ఉంటుంది.
ఎక్కడ వస్తుంది?
తామర చర్మంపై ఎక్కడైనా రావచ్చు. స్త్రీ, పురుషులలో ఎవరికైనా రావచ్చు. ఎక్కువగా ఇది తొడల మధ్యన వస్తుంది. చంకల్లో, నడుము చుట్టూ, పొట్టకు, చేతులకు, కాళ్ళకూ రావచ్చు. కొందరిలో ముఖం మీద, మెడ మీద వస్తుంది. చిన్న పిల్లలలో తలమీద ఎక్కువగా వచ్చి, వెంట్రుకలు రాలిపోవడం, చీము గడ్డగా మారుతుంది. దీన్ని ''కేరియాన్'' అంటారు. లైంగికంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. జననేంద్రియాల మీద రావచ్చు. వ్యక్తిగత పరిశుభ్రత లేనివారికి, డయాబెటిస్తో బాధపడేవారికి, స్టిరాయిడ్ మందులు వాడేవారికి ఇది త్వరగా సోకుతుంది. బిగుతు వస్త్రాలు ధరించడం, గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి ఈ వ్యాధి రావడానికి ఎక్కువగా దోహదం చేస్తాయి. ఎప్పుడూ సాక్సులు, బూట్లు వేసుకునే వాళ్ళకు కాళ్ల వేళ్ళ మధ్య, పాదాలకూ తామర వచ్చే అవకాశాలున్నాయి. హెచ్ఐవి రోగుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కన్పిస్తుంది. కొందరిలో తామరకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తోడై, చీము పొక్కులతో తామర వస్తుంది. ఇటువంటి వాళ్ళకు ఫంగస్ మందులతో పాటు యాంటీబ్యాక్టీరియల్ మందులు కలిపి వాడాలి. లేకపోతే ఫలితం ఉండదు. రోగుల బట్టలతో పాటు మిగిలిన వారి బట్టలు కలిపి ఉతకడం వల్లా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. అందుకే దీన్ని 'ధోభి ఇచ్' అని కూడా అంటారు.
లక్షణాలు
తామర వ్యాధి ఉన్న ప్రదేశంలో దురద ఎక్కువగా ఉండి, చిన్న చిన్న పొక్కులతో ఎర్రగా, గుండ్రంగా కన్పిస్తుంది.
కాలి వేళ్ళ మధ్య పాచి పోయినట్లు ఉండి, పొరలు పొరలుగా ఉంటుంది.
తల మీద అయితే దురద ఉండి, పొట్టు రేగుతూ వెంట్రుకల కుదుళ్ళకు చిన్నచిన్న చెక్కులు ఉంటాయి. వెంట్రుకలు రాలిపోతుంటాయి.
భార్యాభర్తల్లో ఒకరికి ఉంటే మరొకరికి వ్యాపిస్తుంది.
జబ్బు నిర్ధారించక ముందే స్టిరాయిడ్ ఆయింట్మెంట్లు వాడితే ఈ లక్షణాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
నిర్ధారణ-చికిత్స
తామరను నిర్ధారించడానికి ఎఫెక్ట్ అయిన చర్మ భాగం నుండి చర్మపు పొలుసులు తీసి, ల్యాబ్లో పరీక్షలు చేయాలి. తామరను నివారించడానికి క్లోటైమజోల్, కీటో కొనజోల్, మికోనజోల్, సెర్టాకొనజోల్, టెర్బినఫిన్, లలిఫిన్ వంటి ఆయింట్మెంట్లు ఎక్కువగా వాడాలి. వ్యాధి చాలా తీవ్రంగా ఉంటే ఆయింట్మెంట్లతో ఇది తగ్గదు. అప్పుడు కొన్ని మందులను ఇంజెక్షన్లుగా ఇవ్వాలి. ఏ మందైనా సరైన మోతాదుకు సరైన కోర్సు వాడితేనే, ఇది పూర్తిగా తగ్గుతుంది. మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవు.
అలా కాకుండా, ప్రకటనలు చూసి, స్నేహితులు, మందులషాపుల వారి సలహా మేరకో, అన్ క్వాలిఫైడ్ డాక్టర్ల వద్దో ట్రీట్మెంటు చేసుకుంటే తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది. కానీ ఫంగస్ శరీరంలో ఉండి. వేరేచోట, వేరే రూపంలోనో మళ్ళీ కన్పిస్తుంది. నిపుణుల పర్యవేక్షణలో అయితే ఫంగస్ ఇన్ఫెక్షన్కు మూలాన్ని కనుగొని, జబ్బును పూర్తిగా నయం చేస్తారు.
అప్రమత్తంగా ఉండాలి
* వరదల వల్ల బురదతో కలుషితమైన నీటిని స్నానాదికాలకు వాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి.
* నీటిని బాగా మరిగించి, కొంచెం చల్లారిన తర్వాత డెటాల్, వేపాకులు వంటివి కలిపి స్నానానికి ఉపయోగించాలి.
* దురదలున్న చోట గోకి, గీరి చర్మం పెచ్చులను తీసి వేస్తే ఈ కీటకాలు తొలగిపోయి, కొంతవరకు ఈ వాధులను తగ్గించుకోవచ్చని చాలామంది భావిస్తారు. కానీ అలా పోదు.
* కీటకాలను, క్రిములను పూర్తిగా నిర్మూలిస్తేగానీ గజ్జి, తామర, దురదలు వంటివి తగ్గవు.
* దురదల నివారణకు చిట్కా వైద్యాలు తాత్కాలికంగా పనిచేసినట్లు అన్పించినా పూర్తిగా తగ్గించలేవు.
* సమూలంగా నివారించాలంటే డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి.
* చర్మవ్యాధులు పూర్తిగా తగ్గాలంటే పరిశుభ్రత పాటించాలి.
* రోజూ రెండుపూటలా స్నానం చేయాలి. ఉతికిన దుస్తులు ధరించాలి.
* ఇతరులు ధరించిన దుస్తులు, ఇతర వస్త్రాలు వాడకూడదు.
* కుటుంబంలోని అందరు సభ్యులు ఈ చర్మవ్యాధులకు చికిత్సను ఒకేసారిగా చేయించుకోవాలి.
* కుటుంబంలోని ఎవరికైనా ఈ చర్మవ్యాధులుంటే వారి దుస్తులు, నిద్రించిన పడక, పక్క దుస్తులు బాగా మరిగించిన వేడినీటిలో తడిపి, ఉతకాలి.
* ఆ తర్వాత వాటిని ఎండలో బాగా ఆరనివ్వాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నీటిని బాగా మరిగించి, చల్లార్చి గోరువెచ్చగా ఉన్న సమయంలో స్నానానికి ఉపయోగించాలి.
స్నానం చేసిన తర్వాత శరీరాన్ని ముఖ్యంగా తేమ నిలబడే చోట్ల పొడి తువ్వాలుతో శుభ్రంగా తుడుచుకోవాలి. పొడిగా ఉంచుకోవాలి.
మహిళలు నడుము చుట్టూ , రొమ్ముల కింద భాగాలను తడిలేకుండా చూసుకోవాలి.
ఉదయం వేసుకున్న డ్రెస్సు సాయంత్రం వరకూ అలాగే ఉంచుకోకుండా మధ్యాహ్నం కనీసం ఒక గంట ఇంట్లో వేసుకునే వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి.
తడిగా ఉండే డ్రాయర్లు, బనియన్లు వేసుకోకూడదు.
రాత్రి వేళ పడుకునే ముందు లో దుస్తులు తీసేసి, వదులు దుస్తులు మాత్రమే వాడాలి.
డయాబెటిస్ ఉన్నవాళ్ళు దాన్ని ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి.
హెచ్ఐవి రోగులు తమ రోగస్థితిని తరచుగా సమీక్షించుకోవాలి.
అనవసరంగా స్టిరాయిడ్ మందులు ఎక్కువ కాలం వాడకూడదు.
ఇంట్లో ఒకరికి ఉంటే మరొకరికి వ్యాపించకుండా బట్టలు, టవలు, సబ్బు కొంతకాలం వేరుగా ఉంచుకోవాలి.
తామర లక్షణాలు కన్పించిన వెంటనే నిపుణులను సంప్రదించి, చికిత్స తీసుకోవాలి.
* డాక్టర్ చలసాని ప్రవీణ
ఎంబిబిఎస్, డిడివిల్, డెర్మటాలజిస్ట్,
డాక్టర్ చలసాని ప్రవీణ స్కిన్
అండ్ లేజర్ క్లినిక్,
సూర్యారావు పేట, విజయవాడ.