క్యాన్సర్ వస్తే జీవితంలో అన్నీ కోల్పోయినట్టు మానసికంగా, శారీరకంగా చాలామంది వేదనకు గురవుతారు. అయితే సకాలంలో గుర్తించి చికిత్స పొందితే క్యాన్సర్‌ను కూడా నివారించవొచ్చని వైద్య పరిశోధనల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఉంటాయి. ఇవి సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతో మందికి వస్తున్నాయి. ఇటీవల నటి సోనాలిబింద్రె, అంతకుముందు నర్గీస్‌దత్, ముంతాజ్, లిసారె, మనీషా కొయిరాలా, గౌతమి, మమతా మోహన్‌దాస్ తదితరులెందరో క్యాన్సర్ల బారిన పడ్డారు. వీరిలో చాలా మంది కాన్సర్‌ను జయించారు. ఎలాంటి క్యాన్సర్‌కైనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు ఖరీదైనవి కావడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు క్యాన్సర్ ఒక మహమ్మారిగా మారింది. సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ ఎలా వస్తుంది? లక్షణాలు, నిర్ధారణ, చికిత్స తదితర అంశాలు ఈ వారం తెలుసుకుందాం!
గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్)లో వచ్చే క్యాన్సర్‌ను సర్వైకల్ క్యాన్సర్ అంటారు. ఇది మహిళలకు మాత్రమే వచ్చే వ్యాధి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా దీని ప్రభావం భారత్‌లోనే తీవ్రంగా ఉంది. దేశంలో ప్రతి ఏడు నిమిషాలకు ఒకరు, ఏటా 75 వేల మంది మహిళలు ఈ రకం క్యాన్సర్‌తో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ క్యాన్సర్ హ్యుమన్ పాపిల్లోమా వైరస్(హెచ్‌పీవీ) వల్ల సంక్రమిస్తుంది. పురుషుల్లో ఈ వైరస్ ఉన్నా, వారికి ఎటువంటి హాని చేయదు. కానీ వారి ద్వారా మహిళలకు సంక్రమిస్తుంది. గర్భాశయ ముఖద్వారానికి వచ్చే ఈ క్యాన్సర్ వేగంగా విస్తరించడానికి దీనిపై తగిన అవగాహన లేకపోవడమే ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ వ్యాధి గురించి సరైన అవగాహన లేదు. హెచ్‌పీవీ వైరస్ సోకినపుడు కొన్ని ప్రాథమిక లక్షణాలు కన్పిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతుంది. కొందరు మహిళలు ఈ లక్షణాలను గుర్తించినా బయటకు చెప్పుకోలేక క్యాన్సర్ బారిన పడుతున్నారు. 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో ఈ క్యాన్సర్ ఎక్కువగా బయటపడుతోంది.
ఎన్నో కారణాలు
సర్వైకల్ క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. హ్యుమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) సోకడం వల్ల యోనికీ, గర్భాశయానికీ మధ్య ఉండే ప్రాంతంలో (గర్భాశయ ముఖద్వారం) క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది. జననాంగాల ప్రాంతంలో శుభ్రత పాటించని వారికి, ఎక్కువ మందితో లైంగిక సంబంధాలున్న వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భధారణ సమయంలో వేసుకునే కొన్నిరకాల మాత్రల వల్లా ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చిన్న వయసులోనే రజస్వల అయినవారికి, శారీరక పరిపక్వత రాకముందే వివాహం జరిగినవారికి, తక్కువ వయసులోనే పిల్లల్ని కనేవారికీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
సుఖవ్యాధులు ఉన్నవారిలో అధికంగా వచ్చేందుకు ఆస్కారం ఉంది. హెర్పిస్ టైప్ వైరస్ వల్లా ఇది రావొచ్చు. డీబీస్ వంటి కొన్ని ఔషధాలను గర్భం దాల్చినప్పుడు మహిళలు తీసుకుంటే, వారికి పుట్టబోయే అమ్మాయిలకు ఈ క్యాన్సర్ రావచ్చు. పొగతాగే వారిలోనూ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ఈ హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా.. చర్మం ద్వారా గానీ మ్యూకస్ పొరలవల్ల గానీ వ్యాపిస్తుంది. ఈ వైరస్‌లో దాదాపు వందరకాలున్నా, సుమారు 20 రకాలు మాత్రమే క్యాన్సర్‌కు దారితీస్తాయి. సర్వైకల్ క్యాన్సర్‌లో సైమస్ సెల్ కార్సినోమ అనేది ఎక్కువగా వస్తుంది. 90 శాతం మందిలో ఈ రకమైన క్యాన్సర్ వస్తుంది. మిగతా 10 శాతం మందిలో అడెనో కార్సినోమ, అడెనో సైమస్ కార్సినోమ అనే క్యాన్సర్ వస్తుంది.
లక్షణాలు
హ్యుమన్ పాపిల్లోమా వైరస్ శరీరంలో ప్రవేశించినపుడు ప్రాథమిక దశలో కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఆ తరువాత ఎటువంటి లక్షణాలూ ఉండవు. కానీ కొన్నేళ్ల తరువాత అది క్యాన్సర్‌గా బయటపడుతుంది. మొదటిదశలో నొప్పి ఉండదు. రక్తస్రావం, పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉండటం, సంభోగం తర్వాత రక్తస్రావం, పీరియడ్స్‌కు, పీరియడ్స్‌కు మధ్య పీరియడ్స్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత దశలో మూత్రంలో, మలంలో రక్తం పడడం, రక్తహీనత. నడుం నొప్పి, కాళ్లనొప్పులు ఉంటాయి. నాలుగో దశలో నెలలు ఆగిన తరువాత (మెనోపాజ్) రక్తస్రావం రావడం. వైట్ డిశ్చార్జ్ కావడం. రక్తంతో కలిసి వైట్ డిశ్చార్జ్, వాసనతో కూడిన వైట్ డిశ్చార్జి కావచ్చు. మూత్ర పిండాలలో వాపు, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందిలో కిడ్నీలు పనిచేయడం మానేస్తాయి. చివరికి ప్రాణాంతకమౌతుంది.
ముందే గుర్తిస్తే
సర్వైకల్ క్యాన్సర్‌లో నాలుగు దశలుంటాయి. మొదటి దశలో సర్విక్స్ దగ్గరే వైరస్ ప్రభావం ఉంటుంది. రెండోదశలో కొంత విస్తరిస్తుంది. మూడోదశలో కొన్ని భాగాలకు, నాలుగోదశలో శరీరం మొత్తం అన్నిభాగాలకూ వైరస్ విస్తరిస్తుంది. మొదటిదశలో గుర్తిస్తే 95 శాతం కంటే ఎక్కువగా నయమయ్యే అవకాశాలుండగా, రెండో దశలో 80 శాతం, మూడోదశలో 40 శాతం, నాలుగోదశలో15 శాతం వరకూ నయమయ్యే అవకాశాలున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ ముందుగా వచ్చే ప్రీ- క్యాన్సర్ దశ చాలాకాలం (దాదాపు ఎనిమిది నుంచి పదేళ్లు) కొనసాగుతుంది. అంటే అది పూర్తి క్యాన్సర్‌గా రూపొందడానికి సాగే ముందస్తు దశ ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి అక్కడ వచ్చే మార్పులను ముందుగానే గుర్తిస్తే అది క్యాన్సర్ కాకముందే లేజర్, ఎల్.ఎల్.ఈ.టీ.జడ్ వంటి విధానాలతో చికిత్స చేసి, నివారించవచ్చు.
వ్యాధి నిర్ధారణ
సర్వైకల్ క్యాన్సర్‌ను నిర్ధారించడానికి ప్రధానంగా మూడు పరీక్షలు చేస్తున్నారు.
పాప్‌స్మియర్ స్క్రీనింగ్ టెస్ట్
సర్వైకల్ క్యాన్సర్ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి పాప్‌స్మియర్ స్క్రీనింగ్ టెస్టు చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా గర్భాశయ ముఖ ద్వారం నుంచి కొన్ని కణాలు తీసుకుని, పరీక్షిస్తారు. పెల్విక్ ఎగ్జామినేషన్ ద్వారా సర్వైకల్ నార్మల్‌గా ఉన్నదీ లేనిదీ తెలుసుకుంటారు. సర్వైకల్ ప్రాంతం నుంచి ముక్క తీసి పరీక్ష (బయాప్సీ) చేయడం ద్వారానూ క్యాన్సర్‌ను నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ ఉన్నట్లయితే ఎంతవరకు వ్యాపించింది తెలుసుకోవడానికి అల్ట్రా సౌండ్ అబ్డామిన్, ఎక్స్‌రే వంటి పరీక్షలు చేయాలి. పాప్‌స్మియర్ పరీక్ష ఎంతో సులువుగా, తక్కువ ఖర్చుతో చేయొచ్చు. దీంతో సర్విక్స్ క్యాన్సర్‌ను ప్రీ క్యాన్సర్ దశలోనే గమనించి, సమర్థంగా చికిత్స చేయడానికి వీలౌతుంది. ఇరవై ఏళ్లు దాటిన వారు రెండేళ్లకు ఒకసారి ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది. కనీసం ఐదేళ్లకు ఒకసారైనా చేయించుకోవడం తప్పనిసరి.
కాల్పోస్కోపీ
కాల్పోస్కోప్ అనే ప్రత్యేక పరికరం ద్వారా జననేంద్రియాలూ, గర్భాశయ ముఖద్వారాన్ని పరీక్షిస్తారు. వాపు, పుండు, ఒరుపు వంటి వాటిని గమనిస్తారు. అసాధారణంగా ఉన్న ప్రదేశాన్ని పరిశీలిస్తారు. కణజాల నమూనాలను సేకరించి, పరీక్షిస్తారు.
సెర్వికల్ బయాప్సీ
క్యాన్సర్ అని అనుమానం వచ్చినప్పుడు సర్విక్స్‌లోని కొంతభాగాన్ని తీసి, పరీక్షిస్తారు. ఈ పరీక్షల ద్వారా ఏ రకం క్యాన్సరో, అది ఏ దశలో ఉందో గుర్తించవచ్చు. కణితి ఎంతవరకూ పెరిగింది? ముఖ్యంగా మూత్రాశయం, రెక్టమ్, లింఫ్ గ్రంథులకు వ్యాపించిందా? లేదా? అన్నది తెలుసుకుంటారు. ఇది ఇతర భాగాలకు వ్యాపించకపోతే అదనంగా పరీక్షలు అవసరంలేదు. ఈ క్యాన్సర్ ముదిరిపోతే రక్తపరీక్ష, హిమోగ్లోబిన్ టోటల్ కౌంట్, బ్లడ్ సుగర్, బ్లడ్ గ్రూప్, బ్లడ్ యూరియా, యూరిన్ ఎగ్జామినేషన్లు చేయించాలి. కొంతమందిలో అవసరమైతే సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేసి, వ్యాధి తీవ్రతను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తరవాతే చికిత్స ఉంటుంది.
ముందస్తుగా వైరస్ పరీక్ష
ముందస్తుగా హెచ్‌పీవీ ఉందో లేదో తెలుసుకోవడానికీ పరీక్ష ఉంది. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ఆస్కారం ఉంటే ఈ పరీక్షతో దాన్ని తెలుసుకోవచ్చు. దీన్నీ పాప్‌స్మియర్‌తో పాటే చేస్తారు. గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉండే కణాలను సేకరించి, పరీక్ష చేస్తారు. ఇప్పుడు 30 Ûఏళ్లు దాటిన వారిని పాప్‌స్మియర్‌తో పాటూ దీన్ని చేయించుకోమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ 30 ఏళ్లలోపు మహిళకు పాప్స్మియర్లో అబ్నార్మల్ అని వస్తే, అప్పుడు తప్పనిసరిగా హెచ్‌పీవీ చేయించుకోవాలి. హెచ్‌పీవీ వైరస్ ఉందని తేలితే అదనంగా బయాప్సీ చేయించాలి. ఈ పరీక్షలో హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ లేదంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువని అర్థం. పాప్‌స్మియర్, హెచ్‌పీవీ పరీక్షల్లో నెగెటివ్ అని వస్తే.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే తీవ్రత చాలా తక్కువనుకోవచ్చు. అలాంటప్పుడు ఐదేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకోవచ్చు.
దశల వారీగా చికిత్స
సర్వైకల్ క్యాన్సర్‌కు చికిత్సా దాని దశలను బట్టే ఉంటుంది. తొలిదశ క్యాన్సర్ సమయంలో పాప్ స్పియర్, కాల్పోస్కోపీ ద్వారా గుర్తించవచ్చు. ఇందులో మెల్ట్, మోడరేట్, సివియర్ అని మూడు రకాలుంటాయి. ఈ దశలో చిన్న పద్ధతుల్లో ఈ వ్యాధిని నయం చేయవచ్చు. క్రయో, లేజర్, లూప్ ఎక్సేషన్, కొనైజేషన్ ద్వారా నయం చేయవచ్చు. భవిష్యత్తులో పాప్ స్మియర్ ద్వారా పరీక్ష చేయించుకుంటూ ఉండాలి.
గర్భసంచి తొలగించే సర్జరీ
సర్వైకల్ క్యాన్సర్ సోకినపుడు మొదటి, రెండు దశలలో ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చు. రాడికల్ హిస్టిరెక్టమీ అనే ఆపరేషన్ ద్వారా గర్భాశయం, యోని పైభాగం, అండాశయాలు, పెల్విక్‌నోడ్స్‌ను తొలగించాలి. క్యాన్సర్ సోకిన భాగాలను తొలగించడం వల్ల రోగి త్వరగా కోలుకుంటారు. మూడు, నాలుగో దశలో క్యాన్సర్‌ని గుర్తించినపుడు రేడియేషన్, కీయోథెరపీని ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి బాగా ముదిరినపుడు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా మరికొంతకాలం జీవించే అవకాశం కల్పించవచ్చు. ఒకవేళ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారానికే పరిమితం కాకుండా ఇతర భాగాలకు పాకిందేమో అన్న అనుమానం కలిగితే శరీరం మొత్తాన్ని పరిశీలించడానికి పెట్ సీటీ -స్కాన్ చేయించాలి. ఒకవేళ స్టేజ్ 3బిలో గుర్తించినా కీమో థెరపీ, రేడియో థెరపీ ద్వారా 25 శాతం మందికి పూర్తిగా నయమయ్యే అవకాశాలూ ఉంటాయి. అందుకే ఈ క్యాన్సర్ ఆలస్యంగా బయటపడినా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్యాన్సర్‌ను ఆలస్యంగా అంటే 3బి స్టేజ్ దాటిన తరువాతే గుర్తించినా ఆధునికమైన కొన్ని చికిత్సల ద్వారా వారి జీవితకాలాన్ని బాగా పొడిగించే అవకాశాలు ఉంటాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకకుండా, సోకిన తర్వాత తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
- నెలసరి సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.
- శరీరంలో ఏ చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా.. తేలిగ్గా తీసుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
- ముప్ఫై ఏళ్లు దాటినప్పటి నుంచీ.. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది.
- ఎక్కువమందితో లైంగిక సంబంధాలు కలిగి ఉండటం, లైంగిక చర్యలో పాల్గొనేటప్పుడు ప్రొటెక్షన్ తీసుకోకపోవడం వంటి కారణాలు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణమవుతాయి. అందువల్ల సురక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండాలి.
- ధూమపానం అలవాటుంటే వెంటనే మానుకోవాలి.
- పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.
- మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.
డాక్టర్ ఎన్ సుబ్బారావు
ఎంబిబిఎస్, ఎమ్‌డి, డిఎమ్,
మెడికల్ అంకాలజిస్ట్,
అనీల క్యాన్సర్ సెంటర్,
ప్రకాశం రోడ్, విజయవాడ
అప్రమత్తతో అడ్డుకోవచ్చు!
