పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దే కానీ... ఆరోగ్యం కాదు. చిన్నతనంలో లావుగా ఉంటే పెద్దయ్యాక కూడా అధికబరువుతో బాధపడే అవకాశాలు ఎక్కువ. అందుకే స్థూలకాయ సమస్య నివారణ చిన్నతనంలోనే మొదలు కావాలి. చిన్నపిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, వ్యాయామం నేర్పించాల్సిన బాధ్యత పెద్దలదే. తల్లిదండ్రుల ఆహారపు అలవాట్లు, జీవనశైలి పిల్లలను ప్రభావితం చేస్తాయి. పెద్దలు అనుసరించకుండా పిల్లలను పాటించమంటే వాళ్లు పాటించరు. మనం చెప్పే మాటలకంటే, చేసే పనులను చిన్నారులు ఎక్కువగా గమనిస్తారు, ఆచరిస్తారు. మీరు చిరుతిండ్లు తింటే వాళ్లు తింటారు. మీరు టీవి ఎక్కువ చూస్తుంటే వాళ్లూ చూస్తారు. మీరు వ్యాయామం చేస్తే వాళ్లూ చేస్తారు. కాబట్టి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం నేర్పాలంటే ముందు వాటిని మీరు అనుసరించాలి. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు రుచికరంగా ఉంటాయి. ఒకసారి రుచి మరిగితే వదిలించు కోవడం కష్టం. కాబట్టి బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్డ్రింకులు, ఐస్క్రీములు, కేకులు, స్వీట్లు, పిజ్జాలు, బర్గర్లు, వడలు, పూరీలు, సమోసాలు, బజ్జీలు, పొటాటో చిప్సు, ఫ్రెంచి ఫ్రైసు వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను పిల్లలకు అలవాటు చేయకండి. పుట్టినరోజులకు కేకులను కట్ చేయడం మానండి. కేకులకు బదులు పండ్లను పంచండి. పిల్లలకు బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ఆహార పదార్థాలను బహుమతులుగా ఇవ్వడం మానండి. వాళ్లు భోజనం తినకపోతే, దానికి బదులు చిరుతిండ్లు పెట్టకండి. వారిని రోజూ ఆటలకు పంపించండి. టీవి చూడటం, కంప్యూటర్ల వాడకాన్ని కట్టడి చేయండి.
బొద్దు ముద్దే కానీ...
