సాధారణంగా పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి పాలధర నిర్ణయించబడుతుంది. కనుక పాలలో ఉండే వెన్న శాతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు వెన్న శాతం తక్కువగా ఉండడం సాధారణమే. అయితే పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉండటం, ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, తక్కువ ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల పాడి పశువులు సరిగా మేత తీసుకోవు. ఇలాంటి వాతావరణంలో పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురికావడం వల్ల పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్నశాతమూ తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో పాడి రైతులు చేపట్టాల్సిన చర్యలపై పశువైద్యుల సూచనలు తెలుసుకుందాం.
సాధారణంగా గేదె పాలలో వెన్నశాతం 6 నుంచి 8 శాతం వరకు ఉంటుంది. అదే దేశవాళీ పాడి పశువుల పాలల్లో 4 నుంచి 4.5 శాతం, సంకర జాతి పాడి పశువుల పాలలో 3 నుంచి 4 శాతం వరకు వెన్న ఉంటుంది. పాలల్లో వెన్న శాతాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల గురించి పాడి రైతులకు అవగాహన ఉండాలి.
మేత, మేపు ఇలా ఉండాలి
- పాడి పశువులకు ప్రతిరోజూ 30-40 కిలోల వరకూ పచ్చిమేత ఇవ్వాలి. ఇందులో మూడో భాగం అంటే 10-15 కిలోల వరకు పప్పుజాతి పశుగ్రాసాలను, మిగతా భాగం 28-30 కిలోల వరకు గడ్డిజాతి, ధాన్యపు జాతి పశుగ్రాసాలను ఇవ్వాలి. ప్రతిరోజూ 6-8 కిలోల వరకూ ఎండు గడ్డిని ఇవ్వాలి. ముఖ్యంగా జొన్నచొప్ప, సజ్జచొప్ప, మొక్కజొన్న చొప్పలను ఎండు గడ్డిగా వాడటం మంచిది. ఈ చొప్ప లభ్యంకాని పక్షంలో వరిగడ్డిని ఇవ్వాలి. ఈ విధంగా ఎండు గడ్డిని వాడటం వల్ల పాలల్లో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది.
- పప్పుజాతి పశుగ్రాసాలైన, బర్సీమ్, లూసర్న్, అలసంద, పిల్లి పెసర, జనుము, స్టైలో మొదలగు వాటిని ధాన్యపు జాతి గ్రాసాలతో కాని, లేదా గడ్డిజాతి పశుగ్రాసాలతో కాని కలిపి మేపడం వల్ల పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. సుబాబుల్, అవిశె, హెడ్జ్‌లూసర్న్ వంటి పశుగ్రాసపు చెట్లను పెంచి, వాటి ఆకులను పశుగ్రాసంగా ఇవ్వొచ్చు. పశుగ్రాసాలను పూత దశలో ఉన్నప్పుడు కోసి, మేపినట్లయితే పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది.
ట పశుగ్రాసాలను చాప్‌కట్టర్ ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి, మేపాలి. అయితే ఈ ముక్కలు 1/4 అంగుళం కంటే చిన్నవిగా ఉండకూడదు. ఇంతకంటే తక్కువగా కత్తిరించి, మేపితే పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది.
- పశువుల శరీరంలో ఉన్న సూక్ష్మ క్రిములు విడుదల చేసే సెల్యులోస్ అనే ఎంజైమ్‌ల వల్ల పీచుపదార్థం జీర్ణం జరుగుతుంది. కాబట్టి పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపడం వల్ల పీచు పదార్థం ఎక్కువగా జీర్ణమై, పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పాలలో వెన్న శాతం పాడిపశువులకు ఇచ్చే మేతలో ముఖ్యంగా పశువుకు కావలసిన జీర్ణమయ్యే మాంసకృత్తులు, జీర్ణమయ్యే శక్తినిచ్చే పదార్థాలు, దాణా మిశ్రమం, పశుగ్రాసాలపై ఆధారపడి ఉంటుంది. దాణా మిశ్రమంలో పత్తిగింజల చెక్క, కొబ్బరి చెక్క, సోయా చిక్కుడు గింజల చెక్క, పొద్దుతిరుగుడు చెక్క, వేరుశనగ చెక్క మొదలగు వాటిని కలిపి ఇస్తే పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది.
- పంట అవశేషాలను ఉపయోగించి, సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారుచేసి, పశువులకు మేతగా ఇస్తే దాణాకయ్యే ఖర్చును తగ్గించవచ్చు. ఈ సంపూర్ణ సమీకృత ఆహారంలో పశువులకు కాలవసిన పోషక పదార్థాలు ఉండేటట్లు, పంట అవశేషాలతో పాటుగా ధాన్యపు గింజలు, పత్తి గింజల చెక్కలు, వేరుశనగ చెక్కలు మొదలగు వాటిని ఉపయోగించి, దాణా మిశ్రమాన్ని తయారుచేసి ఇస్తే, పాడి పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. పాలలో వెన్న శాతం కూడా తగ్గకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో గ్రాసాల కొరత ఉన్నప్పుడు సంపూర్ణ సమీకృత ఆహారాన్ని తయారుచేసుకుని, మేతగా ఇవ్వాలి.
- వర్షాకాలంలో, శీతాకాలంలో పశుగ్రాసాల లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి, మాగుడు గడ్డి (సైలేజ్) గా తయారుచేసుకొని, నిల్వ ఉంచుకోవాలి. ఎప్పుడైతే పశుగ్రాసాల కొరత ఉంటుందో అప్పుడు ముఖ్యంగా ఎండాకాలంలోను, కరువు సమయాలలోనే ఈ సైలేజ్ని పశువులకు మేతగా ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వలన పాడిపశువులలో పాల దిగుబడి, పాలల్లో వెన్నశాతం తగ్గకుండా ఉంటుంది.
- పాడి పశువులకిచ్చే దాణా మిశ్రమంలో గోధుమ తవుడు లేదా వరి తవుడును కలిపి ఇస్తే పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. ఈ దాణాను తడిపి ఇవ్వడం మంచిది. పాడి పశువులకు దాణాను, పాల ఉత్పత్తిని బట్టి, పాలల్లో ఉండే వెన్న శాతాన్ని బట్టి, శరీరబరువును బట్టి ఇవ్వడం మంచిది. దాణా మిశ్రమంలో మొలాసిస్ కలిపి ఇస్తున్నప్పుడు 10 శాతం కంటే ఎక్కువగా కలపకూడదు. ఎక్కువగా మొలాసిస్ కలపడం వల్ల పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. పాడిపశువులకు తయారు చేసే దాణా ఖర్చు ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయంగా చౌకగా ఉండే అజొల్లాను పాడి పశువులకు మేతగా ఇవ్వాలి. రోజుకు 1-1.5 కిలోల వరకు అజొల్లాను దాణాలో కలిపి కూడా మేపవచ్చు. అజొల్లాను మేపడం వల్ల పశువులు తేలికగా జీర్ణం చేసుకొని, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది. అజొల్లాను మేపడం వల్ల 25 శాతం వరకూ దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు. అజొల్లాను పాకలకు సమీపంలోనే పెంచవచ్చు. కాబట్టి, అజొల్లా పెంపకానికి ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి దాణాకు ప్రత్యామ్నాయంగా అజొల్లాను మేతగా ఇవ్వాలి. అజొల్లాను వాడడం వలన పాలల్లో వెన్నశాతంతో పాటు ఎస్.ఎన్.ఎఫ్ శాతమూ పెరుగుతుంది.
- పాడి పశువులకు ఇచ్చే మేతలో 20-25 శాతం వరకు పీచు పదార్థం ఉండేటట్లు చూడాలి. మేతలో పీచుపదార్థం తక్కువగా ఉంటే, పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. లేతగా ఉండే పచ్చిగడ్డిలో పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చిమేతతో పాటుగా ఎండుగడ్డిని కలిపి ఇస్తే, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది. దాణాలో ఎక్కువగా గింజలను ఉపయోగించడం వల్ల సెల్యులోజ్ జీర్ణం తగ్గడం, ఆమ్ల శాతం పెరగడం తద్వారా పాల దిగుబడి, పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి దాణాలో అధికంగా ధాన్యపు గింజలను ఉపయోగించకూడదు.
- పాలల్లో వెన్న శాతం పెంచడానికి మార్కెట్లో లభించే బైపాస్ ఫ్యాట్, ఫ్యాట్ ప్లస్ మొదలగు వాటిని రోజుకు 50-100 గ్రా. వరకూ దాణాతో కలిపి ఇవ్వాలి. వీటిలో జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది. ప్రోబయోటిక్స్, ఈస్ట్ కల్చర్ మొదలగు వాటిని దాణాతో పాటుగా కలిపి ఇస్తే, పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. రోజుకు 20-25 లీటర్ల పాలిచ్చే పాడిపశువులకు దాణా మిశ్రమంతో పాటుగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, అదనంగా ఈ బైపాస్ ఫ్యాట్‌ను రోజుకు 100 గ్రా.వరకూ ఇస్తే పాలల్లో వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. పాలల్లో వెన్న శాతాన్ని పెంచడానికి మొక్కజొన్న బయోలిక్విడ్, యూరియా, మొలాసిస్ ఇటుకలు, ఖనిజ లవణపు ఇటుకలను కూడా ఇవ్వవచ్చు. గడ్డి, దాణా, ఖనిజ లవణ మిశ్రమం, విటమిన్లను కలపి మేతగా ఇవ్వడం ద్వారానూ పాల దిగుబడి, పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది.
జన్యు కారణాలు
పాడిపశువులలో జన్యు సామర్థ్యాన్ని బట్టి వెన్నశాతం ఉంటుంది. పశువులలో జాతిని బట్టి కూడా పాలల్లో వెన్న శాతంలో మార్పులు, హెచ్చుతగ్గులు ఉంటాయి. గేదెలలో అయితే ముర్రాజాతి, జాఫరాబాదికి జాతి గేదెల పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా దేశవాళికి చెందిన ఆవులైన సాహివాల్, గిర్, థిమోని, ఒంగోలు జాతికి చెందిన పాడి పశువులలో పాల దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ వెన్నశాతం సంకరజాతి పాడి పశువుల కంటే అధికంగా ఉంటుంది. సంకరజాతి పాడి పశువులలో పాల ఉత్పత్తి అధికంగా ఉండి, వెన్న శాతం గేదెపాల కంటే, దేశవాళికి చెందిన ఆవుపాల కంటే తక్కువగా ఉంటుంది. వీటికీ కారణం జన్యుపరమైన కారణాలని చెప్పవచ్చు. పాలల్లో వెన్న శాతం పాడి పశువుల జాతి, వయస్సు, పాల దిగుబడి, మేత, పాలిచ్చే కాలం (పాడికాలం) వాతావరణ, గృహ వసతి మొదలగునవి కూడా ప్రభావితం చేస్తాయి.
ఇతర కారణాలు
- పాలు పిండేటప్పుడు చివరి ధారల్లో వెన్న శాతం అధికంగా ఉంటుంది. కనుక చివరి పాలను పూర్తిగా పిండాలి. పాడిపశువులు వట్టిపోయే ముందు ఇచ్చే పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. పాలను నెమ్మదిగా పిండితే కూడా వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా 4-5 నిమిషాలలో పాలను పూర్తిగా పిండాలి. పాలను పిండడానికి నైపుణ్యమున్న వారిని వినియోగించడం మంచిది.
- పశువులు ఎదలో ఉన్నప్పుడు పాల ఉత్పత్తితో పాటుగా పాలల్లో వెన్న శాతం కూడా తగ్గుతుంది. పాడి పశువులలో వయస్సు పెరిగిన కొద్దీ ఇచ్చే పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది.
- పాడి పశువుల ఈత చివరిలో పాల ఉత్పత్తి తగ్గి, పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. పాడి పశువులను పరుగెత్తించడం, పాలు పిండే వ్యక్తి మారి, నెమ్మదిగా పాలను పిండటం వల్ల కూడా పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. పాడి పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు, మేత సరిగా తినకపోవడం, తద్వార పాల దిగుబడి తగ్గి, పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి అనారోగ్యానికి గురైన పశువులను గుర్తించి, తగు చికిత్సను వెంటనే ఇప్పించాలి. పాడి పశువులకు ఎండు మేతలను, దాణాను మేపక ముందే మూడు గంటల ముందుగా ఇవ్వాలి. దాణాను మేపిన తర్వాత గ్రాసాలను మేపితే పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది.
- పాడి పశువులకు దాణాను, పశుగ్రాసాలను రోజుకు రెండు సార్లు కాకుండా 3-4 సార్లు మేపడం మంచిది. దాణాను తడిపి మేపాలి.
- పాలల్లో నీళ్ళను కలపడం వల్ల పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి పాలల్లో నీళ్ళను కలపకూడదు.
ఈ విధంగా వేసవిలో పాడి పశువుల పెంపకంలో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, పోషణలో తగు జాగ్రత్తలు తీసుకుంటే పాలల్లో వెన్న శాతం తగ్గకుండా, పాడి పశువుల, పెంపకందారులు అధిక లాభాలు పొందవచ్చు.
వాతావరణ ప్రభావం
వాతావరణంలో మార్పుల వల్ల ముఖ్యంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్లా పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల ఫారెన్‌హీట్ పెరిగితే పాలల్లో వెన్న శాతం 0.1 నుంచి 0.2 శాతం వరకు తగ్గుతుంది. కాబట్టి వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. ఎండా కాలం ముఖ్యంగా సాయంత్రం పూట పిండే పాలల్లో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల పాడి పశువుల శరీరంలో జీర్ణశోషణ ప్రక్రియలపై ప్రభావం ఉంటుంది. దీనివల్ల పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. కనుక ఎండాకాలంలో పాడిపశువులు అసౌకర్యానికి గురికాకుండా, తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సంకరజాతి ఆవులను పెంచేవారు వీలైతే పాకలలో ఫ్యాన్లు, కూలర్లను అమర్చుకోవడం మంచిది. ఎండాకాలంలో పశువులను బయటి మేతకు పంపేవారు, వ్యాయామం కోసం 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం తిరగడం చేత పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. అంతకంటే ఎక్కువ దూరం పశువులను బయట తిప్పితే పశువులు అలసట చెంది, శక్తిని కోల్పోయి, పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. గేదెలను రోజుకు 2-3 సార్లు నీటితో కడగాలి. వీలైతే శుభ్రంగా ఉండే నీటిలో ఈదించాలి.
- డాక్టర్ జి. రాంబాబు
పశువైద్యాధికారి, కడప.