- రుణసాయంలోనూ మొండిచేయి
- అట్టడుగున విజయనగరం జిల్లా
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి:
రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఆపై సాగునీటి వనరులు లేక అతివృష్టి లేదా అనావృష్టితో రైతులు ఏటా కుదేలవుతున్నారు. ఇటువంటి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా బ్యాంకర్లు నిబంధనల పేరుతో అన్నదాతలకు వ్యవసాయ రుణాలిచ్చేందుకు వెనుకాడుతున్నారు. దీంతో, రుణసాయంలోనూ విజయనగరం జిల్లా అట్టడుగు స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అనంతరపురం జిల్లాలో అత్యధికంగా 88 శాతం మేర రుణాలు మంజూరు చేయగా, విజయ నగరం జిల్లాలో 44శాతానికే పరిమితమైంది. తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లోనూ 50 శాతం లోపే బ్యాంకు రుణాలందాయి. వీటిలో ముఖ్యంగా ఆయా జిల్లాల రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తోంది. జిల్లాలో ప్రయివేటు పరపతి లేనివారు సేద్యాన్ని మానుకుని ఎప్పటి మాదిరిగానే పొట్టకూటి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
వరి, మొక్కజొన్న, చెరకు, పత్తి, అపరాలు వంటి వ్యవసాయ పంటలతో పాటు రకరకాల కూరగాయలు, పూలు, పండ్లు వంటి ఉద్యాన పంటలు జిల్లాలో విస్తారంగా సాగవుతాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా 4,77,155 ఎకరాల్లో వివిధ వ్యవసాయ పంటలు, 22,089 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటితో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు రూ.1,635కోట్ల మేర రుణసాయం కల్పించాల్సి ఉంది. సీజన్ ప్రారంభమై దాదాపు మూడు నెలలు గడుస్తున్నప్పటికీ బ్యాంకర్లు కేవలం రూ.720 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో, ముఖ్యంగా వరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉబాల సమయంలో ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ మదుపు అవుతుంది. పత్తి పంటకైతే దీనికి రెట్టింపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు నిబంధనల పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ శాఖ సైతం చేసిన తప్పులు రైతులను తిప్పలకు గురి చేస్తున్నాయి. భూముల వివరాలు ఆన్లైన్ చేసినప్పుడు తగిన పర్యవేక్షణ లేకపోవడంతో రెవెన్యూ సిబ్బంది తప్పులు తడకగా వివరాలను నమోదు చేశారు. ఒకరి భూములను మరొకరి పేరున నమోదు చేసేశారు. దీంతో, రుణ అర్హతకు కీలకమైన 1బి జిల్లాలో మూడో వంతు రైతులకు అందుబాటులో లేవు. వీరంతా బ్యాంకు మెట్లు ఎక్కలేని పరిస్థితి దాపురించింది. నోషనల్ ఖాతా నెంబర్లతో వచ్చిన 1బిలను గతేడాది బ్యాంకర్లు అమోదించి రుణాలిచ్చారు. నోషనల్ నెంబర్లను రెగ్యులర్ ఖాతాలోకి చేర్చుకోకపోతే రుణాలు మంజూరు చేయొద్దంటూ ఈ ఏడాది సాక్షాత్తు రెవెన్యూ అధికారులే బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదే అదనుగా బ్యాంకర్లు భూముల వివరాల్లో ఏ మాత్రం తప్పులున్నా రుణాలకు నిరాకరించడం, లేదా రుణ సాయాన్ని తగ్గించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీంతో, రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.
