మన దేశంలోకి ఇంకా పూర్తిస్థాయిలో 4జీ రానేలేదు. ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే జపాన్ మాత్రం ఒక అడుగు ముందుకేసి 4జీ కాలం చెల్లిందంటూ అప్పుడే 5జీ నెట్వర్క్పై కన్నేసింది. అక్కడ వైర్లెస్ కమ్యూనికేషన్లలో ముందంజలో ఉన్న ఓ కంపెనీ విజయవంతంగా 5జీ డేటా ట్రాన్స్మిషన్ ప్రయోగాలు చేసింది. 2020 నాటికి దీన్ని వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెబుతోంది. ఎన్ఐటి డొకోమో ఇంక్ సంస్థ ఈ ప్రయోగం చేసింది. టోక్యోలోని రొపోంగి హిల్స్ కాంప్లెక్సుల్లో తాము అక్టోబర్ 13వ తేదీన అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్మిషన్ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్ వేగాన్ని అందుకుందని కంపెనీ ఉటంకిస్తూ సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఈ ప్రయోగంలో మిల్లీమీటరు తరంగ ధైర్ఘ్యంతో కూడిన సిగళ్లను అత్యధికంగా 70 గిగాహెర్ట్జ్ పౌన:పున్యంతో పంపారు.ఇప్పటివరకు ఎవరూ 5జీ డేటా ట్రాన్స్మిషన్ ప్రయోగాలు చేయలేదని, సాధారణంగా ఇలాంటి చోట్ల డేటా ట్రాన్స్మిషన్లో రకరకాల సమస్యలు రావడమే ఇందుకు కారణమని డొకోమో సంస్థ తెలిపింది. అయితే తాము బీమ్ ఫార్మింగ్, బీమ్ ట్రాకింగ్ అనే రెండు కొత్త టెక్నాలజీలు ఉపయోగించి, మొబైల్ పరికరం ఎక్కడుంందో అన్న దాని ఆధారంగా బీమ్ దిశను నియంత్రించామని డొకోమో వివరించింది. దానివల్ల తమ ప్రయోగం విజయవంతం అయినట్లు చెప్పింది.
4జీ రాకముందే 5జీ రెడీ
