భారతదేశంలో సాంస్కృతిక విప్లవాన్ని ప్రజ్వలింపజేసిన మహోన్నత మానవతామూర్తి సావిత్రీబాయి ఫూలే. ఆమె సామాజిక విముక్తి దాత. కొడిగట్టిన నిరక్షర దివ్వెలకు వెలుగులు అందించిన ప్రజ్వలన శీలి. కులాలను, మతాలను నిర్మూలించే క్రమంలో సామాజిక విప్లవ కార్యాచరణను అనుభూతం చేసుకున్న కార్యశీలి. స్త్రీల వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఒక యుగకర్తగా నిలబెట్టిన నాయకురాలు ఆమె. మహాత్మా ఫూలేకు అండగా నిలిచి ఆయన పోరాటాల్లో, కార్యక్రమాల్లో, సంస్కరణల్లో, విప్లవాల్లో ఆయువుగా వారిరువురి జీవితాలు విడదీయరానివిగా సాగాయి. దేశ చరిత్రలోనే భార్యాభర్తలు సామాజిక సేవలో ఇంత మమేకమై చేసినవారు లేరు. కొందరు జాతీయ నాయకుల కుటుంబాల్లో ఎన్నో కలహాలు ఉండేవి. ఒకరి జీవితాలకు ఒకరి పొంతన ఉండేది కాదు. అయితే సావిత్రీబాయి ఫూలే తన భర్త క్రియాశీలకమైన కృషిలో భాగస్వామిగా ఉండేది. వీరిరువురూ కలిసి రాత్రి స్కూలును తమ ఇంట్లోనే నడిపారు. దళిత స్త్రీల విముక్తికి విద్య మూల హేతువని సావిత్రీబాయి అప్పుడే గుర్తించారు. వీరి మార్గంలోనే అంబేద్కర్ విద్యను ప్రధాన నినాదంగానూ, ఆయుధంగానూ స్వీకరించారు. నిజానికి బుద్ధుని దగ్గర బోధనను అందుకున్న అంబేద్కర్ సావిత్రీబాయి, మహాత్మా ఫూలే దగ్గర విద్య అనే ఆయుధాన్ని స్వీకరించారు. 1830 వరకు శూద్ర స్త్రీలకు, దళితులకు విద్యను ఊహించే పరిస్థితుల్లో భారతదేశం లేదు. ముఖ్యంగా అగ్రవర్ణ ఆధిపత్యానికి, హిందూవాద నియంతృత్వానికి, బ్రాహ్మణవాద సంస్కృతీ జటిలత్వానికి కంచుకోట అయిన మరాఠా రాజ్యం స్త్రీలను అతి దారుణంగా అణచివేసింది. మరాఠా పీష్వాలు శూద్రులను, దళితులను, స్త్రీలను అణచివేశారు. అందుకే జ్యోతిరావు ఫూలే తన భార్యను ఒక బానిసగా కాకుండా ఒక వ్యక్తిత్వమున్న ఉపాధ్యాయురాలిగా, నాయకురాలిగా తీర్చిదిద్దారు. సావిత్రి తన భర్త అనే జ్యోతికి ఒక నూనెలా వ్యవహరించింది. అంటే ఆమె లేకపోతే ఆ జ్యోతికి వెలుగు లేదు అన్నంతగా మమేకమయ్యింది. ఆమె సహచర్యం వల్ల మహాత్మా ఫూలే ఆలోచనలు స్త్రీల వైపు మళ్ళాయి. మహాత్మా ఫూలే అందరి స్త్రీలనూ శూద్రులుగానే భావించారు. ఆయన బ్రాహ్మణ స్త్రీలను వేరుచేయలేదు. బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణ పురుషుల చేత ఎలా అణగద్రొక్కబడుతున్నారో చాలా శాస్త్రీయమైన విశ్లేషణ చేశారు. సావిత్రీబాయి ఫూలే కూడా ఇదే అవగాహనతో ముందుకు నడిచారు. వీరు 1842లో అన్ని వర్ణాల బాలికలకు విద్యాలయం ప్రారంభించారు. 1863లో సావిత్రీబాయి ఫూలే వితంతువుల రక్షణ కోసం ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఇదేకాలంలో వీరొక బ్రాహ్మణ వితంతువు కుమారుని దత్తత తీసుకున్నారు. బ్రాహ్మణ స్త్రీలకు భర్త చనిపోతే శిరోముండనం చేసే ఆచారాన్ని సావిత్రీబాయి వ్యతిరేకించారు. దీనికోసం నాయీబ్రాహ్మణులను సమీకరించి ఈ దురాచారానికి వ్యతిరేకంగా మేము కత్తి పట్టమని శపథం చేయించారు. బ్రాహ్మణ, శూద్ర, అతి శూద్ర స్త్రీలందరినీ విముక్తి చేయాలని సావిత్రీబాయి, జ్యోతిరావు ఫూలే భావించారు. సావిత్రి వంటి గొప్ప వ్యక్తికి స్త్రీలలో భారతరత్న ఇవ్వవచ్చు. ఇన్ని సంస్థలను భర్తతో కలసి ఆమె నిర్వహించారు. నేడు దళిత బహుజనుల్లో కొద్దో గొప్పో సమాజసేవ చేద్దామనుకున్న కార్యకర్తలకు ఇళ్ళలో సహకారం పెద్దగా లేదు. స్త్రీలు ఉద్యోగస్తులుగా ఉన్నవారికి, ఉపాధ్యాయులుగా ఉన్నవారికి దళితవాడల్లో ఇంకా చదువురానివారికి చదువు చెబుదామనే ఆలోచన తక్కువ. ఎక్కువగా ఉద్యోగులైన దళిత స్త్రీలు తమ ఆహార్యానికి, ముఖ్యంగా వస్త్రాలకు, కాస్మోటిక్స్కు, వస్తు వ్యామోహానికి గురవుతున్నారు. ఇంటిని ఒక విద్యాలయంగా తీర్చిదిద్దే సంస్కృతిని సావిత్రీబాయి నుంచి దళిత ఉద్యోగ స్త్రీలు నేర్చుకోవాల్సి ఉంది. వారి ఇళ్ళల్లో పిల్లల చదువు సాగకపోగా ఒక ఉద్యమ గృహంగా, ఆశ్రమంగా, ఇతరులకు ఆశ్రయమిచ్చేదిగా మారటం లేదు. అందుకే సావిత్రీబాయి ఫూలే భర్తతో చేసిన కార్యమ్రాన్ని ఇంటింటికీ ప్రచారం చేయవలసి ఉంది.
సావిత్రీబాయి స్త్రీలకు పాఠశాలలను ప్రారంభించటం ఒక సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం. ఈ పాఠశాలలను ప్రారంభించటానికి ఫూలేకు ఉన్న ఆత్మవిశ్వాసం ఎంత బలమైనదో ఇక్కడ అభివ్యక్తమౌతుంది. భారతీయ సమాజంలోని ప్రధాన సమస్యను గుర్తించడంలో ఇక్కడ సావిత్రీబాయి, జ్యోతిబా ఫూలే తీసుకున్న నిర్ణయం స్త్రీని హిందూ సాంస్కృతిక సంకెళ్ళ నుంచి విముక్తి చేయడానికి, స్త్రీ భవిష్యత్తుకు బాటలు వేయడానికి దోహదం చేసింది. అయితే ధర్మశాస్త్రాలన్నీ స్త్రీలకు, శూద్రులకు విద్యను నిషేధిస్తుంటే ఒక శూద్రుడు స్త్రీలకు పాఠశాలను తెరవడమా అని బ్రాహ్మణులు తీవ్రంగా తిరుగుబాటు చేశారు. బ్రాహ్మణుల తిరుగుబాటును మనం తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అందునా వారి సంప్రదాయపు కుదురు కదిలేటప్పుడు వాళ్ళు విజృంభిస్తారు. అన్నిరంగాల నుంచి అపహాస్యం చేయాలని చూస్తారు. బ్రాహ్మణ్యం ఉక్కుగోళ్ళు పెంచుకొని ఉన్న ''పూణె''లో ఈ సాంస్కృతిక తిరుగుబాటు ఒక కుదుపు కుదిపిందనటంలో అతిశయోక్తి లేదు. అయితే సావిత్రిబాయి, జ్యోతిబా ఫూలే వెనుకాడలేదు. ఆ స్కూలును మరింత అభివృద్ధి చెయ్యడానికి పూనుకొని జ్యోతిబా ఫూలే తన భార్య సావిత్రిని ఉపాధ్యాయినిగా తయారు చేసి పాఠశాలను నిరాటంకంగా సాగించారు. భర్తకు తగిన పట్టుదల, సంస్కారంగల ధీశాలి ఆమె. సావిత్రి, జ్యోతిబా బ్రాహ్మణుల వ్యతిరేక దుమారాన్ని తట్టుకోగల ఆత్మస్థైర్యాన్ని కలిగి ముందుకు నడిచారు. దేశంలోనే వ్యక్తులుగా బాలికల పాఠశాల తెరిచినవారిగా ఫూలే దంపతులు నిలిచారు. ఆంగ్లేయ పాలకులు బాలికల పాఠశాలను 1819లో కలకత్తాలో ప్రారంభించారు. 1824లో అమెరికన్ మిషన్వారు బాలికల పాఠశాల తెరిచారు. అత్యంత సాహసపూరితంగా తెరిచిన పాఠశాలను మూయించడానికి బ్రాహ్మణవాదులు సావిత్రిబాయి, జ్యోతిబా ఫూలేను పాఠశాల నడపలేని స్థితికినెట్టారు. అయితే పట్టుదల, త్యాగమున్న వ్యక్తుల కృషిని ఎవరు అడ్డగించగలరు? ఆర్థిక పరిస్థితి కొంత చక్కబడిన తరువాత ఆ దంపతులు ఎక్కడా ఇల్లు దొరకకపోయినా పట్టుదలతో పాఠశాల ప్రారంభించారు. ఈ కృషిలో వారు అత్యంత శ్రమతో ముందుకు పోయారు. వారి భావాలతో కలసివచ్చే మిత్రులతో కలసి స్త్రీ విద్యా సంస్థను రూపొందించారు. పూనాలో పలు చోట్ల ఈ సంస్థ పాఠశాలలు తెరిచింది. బాలికలనే కాక నిమ్న జాతులవారికి కూడా ఈ పాఠశాలలు అవకాశం కల్పించాయి. తరతరాలుగా పేరుకుపోయిన అంధకారాన్ని ఛేదించిన ఈ విద్యా భాస్కరులు భారతీయుల గుండెల్లో చిరస్మరణీయులు. ఈ మహనీయుల కృషిని గుర్తించి ప్రభుత్వం 1852 నవంబరు 15న దుశ్శాలువాతో సత్కరించింది. ఆ రోజుల్లో దాని ఖరీదు రూ.193. సన్మానాలకు, సత్కారాలకు మేమే అర్హులమని విర్రవీగే బ్రాహ్మణ్యం ఒక సంస్కర్తకు, ఉద్యమకారుడికి జరిగిన సన్మానానికి ఈర్ష్యాద్వేషాలతో కుతకుతలాడారు.
సావిత్రీబాయి, జ్యోతిబా ఇచ్చిన ఈ స్ఫూర్తితో బొంబాయిలో స్త్రీ విద్యను ప్రోత్సహించే మరో సంస్థ రూపొందింది. ఈ సంస్థ పేరు ''స్టూడెంట్స్ లిటరరీ సైంటిఫిక్ సొసైటీ''. ఈ సంస్థ 1849 అక్టోబరు 18 నాటికి నాలుగు గుజరాతీ, నాలుగు మరాఠీ పాఠశాలలు ప్రారంభించింది. కలకత్తాలో కూడా సంస్కరణా భిలాషుల ప్రోత్సాహంతో స్త్రీ విద్యా సంస్థల నిర్మాణంలో కొంత కృషి జరిగింది. బ్రాహ్మణ్యాన్ని ఎదుర్కొని సావిత్రీబాయి, జ్యోతిబా ఫూలే స్థాపించిన బాలికా పాఠశాలలు అభివృద్ధి చెందడమేకాక విజయవంతంగా పరీక్షలు నిర్వహించాయి. విద్యా ప్రోత్సాహకులనెందరినో జ్వలింపజేసి ఆ పాఠశాలల పునాదులను గట్టి పరుచుకోగలిగాయి. 1853 నాటికి 275 మంది వరకు విద్యార్థినులు పెరగడమే దీనికి నిదర్శనం. ఫూలే దంపతులకు పూనాలో వస్తున్న ప్రతిష్టకు కన్నుకుట్టిన బ్రాహ్మణులు వారి మీద తీవ్ర వ్యతిరేకతను కనబరిచారు.కృషికి సహకరించిన వారిలో కొద్దిమంది బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఆ దంపతుల మీద హిందూ ఛాందసులు హత్యా ప్రయత్నం చేశారు. ఉద్యమకారులు అనేకసార్లు మృత్యువును ఎదుర్కొనవలసి వస్తుంది. సావిత్రీబాయి, జ్యోతిబాఫూలే పూనాలో నిరాశ్రయులైన వితంతువులను, వారికి పుట్టిన సంతానాన్ని రక్షించడానికి ఒక శరణాలయాన్ని నిర్మించారు. వ్యక్తులుగా బయలుదేరి వ్యవస్థగా రూపొంది సాంఘిక సంస్కరణల్లో ఉజ్వల పథంలో గమించిన సావిత్రీబాయి, జ్యోతిబా ఫూలే ''సత్యశోధక్ సమాజ్'' అనే సంస్థను స్థాపించి సాంఘిక న్యాయం కోసం, స్త్రీ విముక్తి కోసం అన్ని సంస్థల కంటే ముందుకు నడిపించారు. ఈ విధంగా సావిత్రీబాయి, జ్యోతిరావ్ఫూలే స్త్రీ విముక్తి ఉద్యమంలో గావించిన కృషి అపారమైంది. భారతీయ సంస్కృతిలో స్త్రీ విముక్తి ఉద్యమానికి నూతన శకాన్ని రూపొందించిన సావిత్రీబాయి, జ్యోతిరావ్ ఫూలేను అధ్యయనం చేయని ఏ సంఘం, ఏ ఉద్యమం సరైన అవగాహనతో ముందుకు పోజాలదు. బ్రహ్మ సమాజానికి, ఆర్య సమాజానికి ఇచ్చిన ప్రచారం సావిత్రీబాయి, మహాత్మా ఫూలే ఉద్యమానికి చరిత్రకారులు ఇవ్వడం లేదు. చరిత్ర రూపొందించే వారిలో కూడా అగ్రవర్ణులే ఎక్కువ కాబట్టి శూద్రులు, అస్పృశ్యుల ఉద్యమాలకు, ఉద్యమకారులకు చరిత్రలో సరైన స్థానం లేదు. ఫూలే దంపతులు భారతభూమిలో స్త్రీ విముక్తి ఉద్యమానికి విముక్తి దాతలు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రెండు దశాబ్దాలుగా సావిత్రీ బాయి ఫూలే జీవితం, సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ప్రధాన కేంద్ర కార్యాలయమైన ఆంధ్రపద్రేశ్ దళిత మహాసభ పొన్నూరు లుంబినీవనంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని, సావిత్రీబాయి ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరిం చింది. ప్రభుత్వాన్ని ఎంతో కాలం నుంచి సావిత్రిబాయిఫూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని కోరుతోంది. 2017కు గాని ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూనుకోలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ సాంస్కృతిక విప్లవ విజయం. ప్రతి మహిళా పాఠశాల, కళాశాలలో సావిత్రీబాయి ఫూలే విగ్రహాన్ని రూపొందించాలని, ఆమె పేరు మీద గ్రంథాలయాన్ని రూపొందిం చాలని, ఆమె జీవిత చరిత్రను పాఠ్య గ్రంథంగా రూపొందించాలని ఆంధ్రప్రదేశ్లోని లౌకికవాదులందరూ కోరుతున్నా రు. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా కాకుండా చిత్తశుద్ధితో సావిత్రీబాయి ఫూలే జన్మదినాన్ని అన్ని విద్యాలయాల్లో జరిపించాల్సిన చారిత్రక సందర్భం ఇది. ఈ చారిత్రక కర్తవ్యాన్ని అన్ని పార్టీలు, అన్ని సంఘాలు నిర్వహించటం ద్వారా సావిత్రీబాయి ఫూలే మహోన్నత జీవిత వ్యక్తిత్వాన్ని వేనోళ్ళ చాటబడుతుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముందు కూడా సావిత్రీబాయి ఫూలే విగ్రహాన్ని ఆవిష్క రించటం ద్వారా ఆమెకు ఘన నివాళి జరుగుతుందని ఆశిస్తు న్నాం. సావిత్రీబాయి ఫూలే ఈ యుగం సాంస్కృతిక విప్లవ యోధురాలు అనేది చారిత్రక సత్యం.
- డాక్టర్ కత్తి పద్మారావు .(వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి)
9849741695