- కోట్ల ప్రజాధనం స్వాహా
- 25 మంది అరెస్టు
- కొనసాగుతున్న విచారణ
షఫివుల్లా-అనంతపురం ప్రతినిధి
అనంతపురం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. నకిలీ పుస్తకాల ఆధారంగా బ్యాంకుల నుండి కోట్లాది రూపాయల రుణాలను పొందారు. తద్వారా పెద్దమొత్తంలోనే సబ్సిడీ కాజేసినట్టు తెలుస్తోంది. 15 రోజుల క్రితం బత్తలపల్లి మండలంలో కారులో తరలిస్తున్న 17,100 పట్టాదారు పాసుపుస్తకాలను పోలీసులు పట్టుకున్నారు. తరువాత అనంతపురం నగరంలోని ట్రాన్సుపోర్టులో ఆరు వేల పాసుపుస్తకాలను పట్టుకున్నారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టడంతో అవినీతి డొంక కదులుతోంది. జిల్లాలో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి కోట్లాది రూపాయలను రుణాలు పొందారన్న విషయం వెల్లడవుతోంది. బోగస్ పట్టాదారు పాసుపుస్తకాలు తయారు చేసే ముఠాతో కొంత మంది రెవెన్యూ సిబ్బంది, బ్యాంకర్లు కుమ్మక్కై నకిలీ పాసుపుస్తకాలను విచ్చలవిడిగా తయారు చేసి విక్రయించినట్టు తెలుస్తోంది. అధికారుల సంతకాలు సైతం ఫోర్జరీ చేసినట్టు పోలీసు విచారణలో తేలుతోంది.
25 వేల దాక పాసుపుస్తకాలు స్వాధీనం
బత్తలపల్లిలో నకిలీ పాసుపుస్తకాలను పట్టుకున్న సందర్భంలో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిచ్చిన సమాచారం మేరకు అనంతపురంలోని ఒక ట్రాన్సుపోర్టు కార్యాలయంలో తమిళనాడు నుంచి వచ్చిన ఆరువేల పట్టాదారు పాసుపుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత జిల్లాలో పలుచోట్ల జరిపిన తనిఖీల్లోనూ నకిలీ పాసుపుస్తకాలు లభించాయి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ రికార్డులు, బ్యాంకుల్లో రుణాలు పొందిన వారి పూర్తి వివరాలను సేకరించడంతోపాటు పాసుపుస్తకాలను తనిఖీ చేస్తున్నారు. జిల్లాలో వివిధ బ్యాంకుల్లో సుమారు ఆరున్నర లక్షల వరకు పట్టాదారు పాసుపుస్తకాలు తాకట్టు పెట్టి పంటరుణాలు పొందారు. ఇందులో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు పెద్దమొత్తంలో ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఒకవైపు పోలీసులు, మరోవైపు రెవెన్యూ సిబ్బంది, బ్యాంకర్లు పట్టాదారు పాసుపుస్తకాల తనిఖీని చేపడుతున్నారు. వీటిలో నకిలీవి ఎన్నివున్నాయో తేలాల్సివుంది. ఇప్పటి వరకు నకిలీ పాసుపుస్తకాల తయారీలో కీలకంగా వ్యవహరించిన 25 మందిని అరెస్టు చేశారు. రాబోయే రోజుల్లో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నట్టు సమాచారం. అందులో కొందరు బ్యాంకర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
వెయ్యి ఖాతాల్లో ఐదు కోట్ల పైగా రుణాలు
గడిచిన వారం రోజులుగా జరుపుతున్న తనిఖీల్లో సుమారు వెయ్యి ఖాతాల్లో ఐదు కోట్ల రూపాయల వరకు నకిలీ పాసుపుస్తకాలను తాకట్టు పెట్టి రుణాలు పొందినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా విచారణ కొనసాగుతోంది. మొత్తం తనిఖీచేస్తే ఎన్ని కోట్లకు చేరుతుందో అంతుబట్టకుండా వుంది. జిల్లాలో చాలాకాలంగా ఈ బోగస్ పాసుపుస్తకాల తయారీ సాగుతోంది. తమిళనాడులోని శివకాశిలో అసలు పట్టాదారు పాసుపుస్తకాల తరహాలోనే తయారు అయి అనంతపురం జిల్లాకు చేరుతున్నాయి. వీటిపై అధికారుల సంతకాలను సైతం పోర్జరీ చేసి అసలు పాసుపుస్తకం తరహాలో చేసేస్తున్నారు. వీటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పంటరుణాలు పొందుతున్నారు. అంతేకాకుండా పంటలబీమా, ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్ మరియు స్ప్రింక్లర్లకు ఉపయోగించి సబ్సిడీలను కాజేస్తున్నారు. ఈ విధంగా ఒక్క పాసుపుస్తకంతో లక్షల రూపాయలు ప్రజాధనాన్ని దోచేస్తున్నారు.
విచారణపై సందేహాలు ?
నకిలీ పాసుపుస్తకాల తయారీపై జిల్లాలో సాగుతున్న విచారణపై అనేక సందేహాలున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బ్యాంకుల్లోవున్న, ఇతర సబ్సిడీలకు ఉపయోగించిన నకిలీ పాసుపుస్తకాలను ఏరివేసే బాధ్యతను సంబంధిత రెవెన్యూ సిబ్బందికే అప్పగించారు. ఈ పాసుపుస్తకాలు ఇంత పెద్దఎత్తున జిల్లాలో ఉండటానికి అసలు కారకుల్లో ఒకరుగానున్న వారికే విచారణ బాధ్యతలు అప్పగించడంతో అసలు విషయాలు పూర్తి స్థాయిలో వెలుగులోకి రాకపోవచ్చునన్న విమర్శలున్నాయి. విజిలెన్సు ఎన్ఫోర్సుమెంటు చేతగాని, ఇతరుల ద్వారానైనా విచారణ చేపడితే వాస్తవ విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. జిల్లాలో సుమారు రెండు లక్షల వరకు నకిలీ పాసుపుస్తకాలు ఉండవచ్చునన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. జిల్లా యంత్రాంగం మాత్రం నకిలీ పాసుపుస్తకాల వ్యవహారాన్ని బ్యాంకర్ల మీదకు తోసేసి, అంతటితో ఫుల్‌స్టాఫ్ పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం.