ఎంఎల్‌సి యండపల్లి సహా పలువురి మద్దతు
ప్రజాశక్తి - తిరుపతి సిటి
ధార్మికక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో కక్షసాధింపు చర్యల పేరుతో కార్మికుల పొట్టగొట్టడం అన్యాయమని, తాజాగా ఐదుగురు కార్మికులను రోడ్డున పడేశారని పట్టభద్రుల ఎంఎల్‌సి యండపల్లి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు. శ్రీనివాసం వద్ద వేకువజాము నుంచి ధర్నా కొనసాగింది. భాస్కర్నాయుడుపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా వారికి మద్దతు పలికిన యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ సిఎం బంధువని చెప్పుకుంటూ భాస్కర్‌నాయుడు కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనీయమన్నారు. టిటిడి పాలకమండలి, ఈవో స్పందించి భాస్కర్నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం తిరుపతి జిల్లా కార్యదర్శి అంగేరిపుల్లయ్య మాట్లాడుతూ తొలగించిన కార్మికులను పనుల్లోకి తీసుకోవాలన్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా హింసిస్తున్నారని, ప్రశ్నించిన వారిని విధుల నుంచి తొలగించడం బాధాకరమన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ టిటిడి కాంట్రాక్టర్ భాస్కర్‌నాయుడు పెత్తందారుగా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడన్నారు. ఇప్పటికే అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. గత ఎనిమిది రోజులుగా కార్మికులు నిరంతరం ఆందోళన చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఉన్నతాధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ టిటిడి ఏమీ భాస్కర్‌నాయుడు జాగీరు కాదన్నారు. జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షులు పులిమామిడి యాదగిరి మాట్లాడుతూ టిటిడి ఉన్నతాధికారులు స్పందించకుంటే ఈనెల 27న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాకారులతో టిటిడి పరిపాలనా భవనం ఎదుట భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ధార్మిక క్షేత్రంలో తమకు అన్యాయం జరుగుతోందని కార్మికులు లబోదిబోమంటున్నా, ఉన్నతాధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం సరైనది కాదన్నారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి మాట్లాడుతూ మహిళలను వేధిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సిఐటియు జిల్లా కోశాధికారి జిబిఎస్ మణ్యం మాట్లాడుతూ భాస్కర్‌నాయుడు ముఖ్యమంత్రి అండ చూసుకుని ఎవరినీ లెక్కచేసే స్థితిలో లేడన్నారు. లేబర్ కమిషనర్ స్వయంగా విచారణకు హాజరుకావాలని పిలిచినా పట్టించుకోలేదన్నారు. టిటిడి కాంట్రాక్టు వర్కర్స్ అసోసియేషన్ నాయకులు టి.సుబ్రమణ్యం మాట్లాడుతూ భాస్కర్నాయుడుపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కళాకారుల సంఘం నాయకులు చంద్రశేఖర్ భాగవతారం మాట్లాడుతూ భాస్కర్‌నాయుడుని వెనకేసుకొస్తున్న సిఎందే అసలు తప్పన్నారు. బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు నారాయణబాబు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలకు పనిచేస్తున్న కార్మికుల పట్ల కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. శ్రామిక మహిళా సంఘం నాయకురాలు ఆర్.లక్ష్మి మాట్లాడుతూ పనులు చేసే చోట మహిళలు కనీసం బాత్రూమ్లకు సైతం వెళ్లినా కాంట్రాక్టర్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మానవహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రజనీకాంత్, బిటిఆర్ కాలనీ కార్యదర్శి వేణు, గురుప్రసాద్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్రనాయకురాలు సుజాత పాల్గొన్నారు.