ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
జిల్లా నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెంలో ఈ నెల 29న 1.50 లక్షల మందితో ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్థానిక మారిశెట్టి ఫంక్షన్ ప్లాజాలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపర్చేందుకు ధర్మ పోరాట దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు, నాయకులు పాల్గొంటా రన్నారు. ఈ దీక్ష కోసం బుధవారం పట్టణ పరిసర ప్రాంతాల్లో మూడు ప్రదేశాలను పరిశీలించినట్లు తెలిపారు. సభ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఈ నెల 22న వెల్లడిస్తామన్నారు. రాష్ట్రంపై విషపు కోరలు చాస్తున్న బిజెపి విధానాలను ఎండగట్టేందుకు ఈ దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినదానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు పొంతన లేదన్నారు. కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రానికి మేలు జరుగుతుందనే లక్ష్యంతో బిజెపితో గత ఎన్నికల్లో జత కట్టామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వంచన చేసిన బిజెపిపై పోరాటం చేసేందుకు దీక్ష చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ మాట్లాడుతూ బిజెపి కుట్ర రాజకీయ విధానం బహిర్గతం చేసేందుకు దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జెడ్పి చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ నాలుగేళ్లుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బిజెపితో పోరాటం చేస్తూనే ఉన్నామని, ఇదే చివరి పోరాటమని అన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడగా టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎంఎల్ఎ ఈలి నాని, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్, పాకలపాటి గాంధీ, జెడ్పి మాజీ చైర్మన్ జయరాజు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
29న గూడెంలో ధర్మపోరాట దీక్ష మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
