ప్రజాశక్తి - టి.నరసాపురం
నూతన రాజకీయ ప్రత్యామ్నయం కోరుతూ వామపక్షాల ఆ్వధర్యంలో 15న విజయవాడలో నిర్వహించనున్న మహాగర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో మండలంలోని ఎఎస్ఆర్ నగర్లో నాయకులు మహాగర్జన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సిపిఎం మండల కార్యదర్శి టి.సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక దళితులు, మైనర్లు, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72ఏళ్లు గడిచినా పేదల సమస్యలు తీరలేదన్నారు. రాష్ట్రంలో టిడిపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తున్నాయన్నారు. ప్రతిపక్ష వైసిపి నాయకులు పాదయాత్రలతో సరిపెడుతున్నారే కాని ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. పాలకుల ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని అందుకే నూతన రాజకీయ ప్రత్యామ్నయం కోసం సిపిఎం, సిపిఐ, జనసేనలు ప్రయత్నిస్తున్నాయన్నారు. వారికి ప్రజలు మద్దతు పలకాలన్నారు. విజయవాడలో జరిగే మహాగర్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తాటి భూషమ్మ, వగ్గాల లక్ష్మి, లక్ష్మణ్, మడకం కుమారి, ఎస్కె మనీష, జయరాజు తదితరులు పాల్గొన్నారు.
మహాగర్జన వాల్పోస్టర్ ఆవిష్కరణ
