ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం, చేతివృత్తిదారుల సమగ్రాభివృద్ధికై ఆగష్టు 13న ఏలూరులో జరిగే చేతివృత్తిదారుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం, సిపిఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో చేతివృత్తిదారుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం శనివారం ఉదయం స్థానిక ఆర్ఆర్.పేటలోని స్ఫూర్తి భవనంలో చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు అధ్యక్షత వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నాలైన చేతివృత్తులు పాలకుల విధానాల వలన దెబ్బతింటున్నాయన్నారు. దీంతొ కొన్ని వృత్తులు కనుమరుగవుతున్నాయని,ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సును జయప్రదం చేసేందుకు జిల్లాలోని చేతివృత్తిదారులు, శ్రేయోభిలాషులు సహకారం అందించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల వృత్తిదారులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. నేడు ప్రపంచీకరణ నేపధ్యంలో పాలకులు కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే పనిచేస్తున్నారని, వృత్తిదారుల ప్రయోజనాలను కాలరాస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యాన ఆగస్టు 13న ఏలూరులో జరుగుతున్న చేతివృత్తిదారుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు బి.జగన్నాధరావు, పలువురు నాయకులు ప్రసంగించారు. జూలై చివరి వారంలో చేతివృత్తిదారుల పట్టణ, మండల సదస్సులు, ఆగష్టు మొదటి వారంలో జీపుజాతాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
13న చేతివృత్తిదారుల రాష్ట్ర సదస్సు
