ఎంఎల్ఎ ఆలపాటి రాజేంద్రప్రసాద్
ప్రజాశక్తి-తెనాలి
ప్రముఖ సినీ నటుడు డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు 91వ జయంతి వేడుకలు సోమవారం స్ధానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిం చనున్నట్లు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. స్ధానిక గౌతమ్ గ్రాండ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెనాలి ప్రాంతంలో పుట్టి పెరిగిన గుమ్మడి ఈ ప్రాంతానికి వన్నె తెచ్చిన కళాకారుడుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారన్నారు. తెలుగు ప్రజల్లో చిరస్మరణీయులుగా గుమ్మడి నిలిచిపోయారని అన్నారు. గత ఏడాది గుమ్మడి విశిష్ట పురస్కారాన్ని రాష్ట్ర నాటక రంగ అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణకు అందజేసినట్లు తెలిపారు. ఈ ఏడాది గుమ్మడి వెంకటేశ్వరరావు విశిష్ట కళాపరస్కారాన్ని, నటుడు, దర్శకుడు, నిర్మాత నాయుడు గోపికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు, రాష్ట్ర మహిళా కమీషనర్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, అన్నం సతీష్ ప్రబాకర్, రాష్ట్ర బాషా సాంస్కృతిక సంచాలకులు డాక్టర్ డి.విజయ భాస్కర్, పలువురు ప్రముఖులు హాజరువుతారని తెలిపారు. అనంతరం గంగోత్రి పెదకాకాని వారి పచ్చ చంద్రుడు నాటిక, అంతర్జాతీయ ప్రముఖ రంగస్ధల నటులు గుమ్మడి గోపాలకృష్ణచే సత్యహరిశ్చంద్ర (కాటిసీను) ప్రదర్శనలు జరుగుతా యన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆగస్టు 14నుండి 20వరకు నాటక అకాడమీ వారోత్స వాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల కళాక్షేత్రంలో ప్రతి శనివారం నాటక ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. దీంతో పాటు కళాకారులకు రాష్ట్ర నాటక రంగ అకాడమీ సహకారంతో శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. కళల కాణాచి తెనాలి సంస్కృతి సంప్రదాయాలు పుట్టినిల్లు అని గత వైభవం తీసుకువచ్చే దిశగా కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర నాటక రంగ అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ నాటక రంగం పట్ల గుమ్మడి వెంకటేశ్వరరావుకు ఉన్న ప్రేమను తెలియజేసేలా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. తెనాలి ప్రాంతంలో కళలకు, కళాకారులకు ఎమ్మెల్యే అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేనిదని అన్నారు. రాష్ట్రంలో టూరిజం ప్రదేశాల్లో ఏడాదికి 3వేల కళా ప్రదర్శనలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. నాటక రంగ అకాడమీ సహకారంతో గ్రామస్ధాయిలోనే నాటక ప్రదర్శనల నిర్వహణకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో గుమ్మడి వెంకటేశ్వరరావు తనయుడు గుమ్మడి హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
రేపు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతి వేడుకలు
