మాచర్ల
వైకల్యం వారి జీవితాన్ని సగం మిగేస్తే.. కొద్దేళ్లకే మరో రూపంలో జీవితమే ముగిసింది. బాల్యాన్ని సంపూర్ణంగా అనుభవించలేని వారు ప్రాణాలే కోల్పోయి విగతజీవులవడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. మాచర్లలో శనివారం కలకలం సృష్టించిన ఘటనపై పోలీసుల వివరాల ప్రకారం.. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన రియలెస్టేట్ వ్యాపారి పుర్రి బ్రహ్మారెడ్డి మేనరికం వివాహం చేసుకున్నాడు. వీరు కొద్దిరోజులుగా మాచర్ల శివారు రాయవరం జంక్షన్ వద్ద నివాసం ఉంటున్నారు. బ్రహ్మారెడ్డిది మేనరికం వివాహం కావడంతో మొదటి ఇద్దరు పిల్లలు శశాంక్‌రెడ్డి(10), ఆదిప్రెడ్డి(8) మానసిక, శారీరక వైకల్యంతో జీవిస్తున్నారు. కాళ్లు సరిగా పనిచేయని దృష్ట్యా మంచంలోనే ఉండాల్సి వస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న మీదట మూడోకుమారుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. బ్రహ్మారెడ్డి కొద్దిరోజుల నుండి తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో రోజూ మాదిరే శుక్రవారం రాత్రి వికలాంగులైన తన ఇద్దరు పిల్లలతో ఒక గదిలో నిద్రకు ఉపక్రమించాడు. మూడో కుమారునితో తల్లి మరో గదిలో నిద్రించింది. శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు బ్రహ్మారెడ్డి తన గదిలో కనిపించలేదు. సెల్‌ఫోన్‌ను అక్కడే వదిలేసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. వాకింగ్‌కు వెళ్లి ఉంటాడని కుటుంబీకులు భావించారు. అయితే రోజూ ఆరు గంటలకు తిరిగివచ్చే బ్రహ్మారెడ్డి మళ్లీ రాకపోవడంతో కుటుంబీకులు అతని గదిలోకి వెళ్లి పరిశీలించారు. అయితే అప్పటికే వికలాంగులైన ఇద్దరు పిల్లలూ మృతి చెంది ఉండడంతో నిశ్శేష్టులయ్యారు. సమాచారం అందుకున్న గురజాల డిఎస్పి ప్రసాద్, మాచర్ల రూరల్ సిఐ దిలీప్‌కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. బ్రహ్మారెడ్డి భార్య అనితతో మాట్లాడి కొన్ని వివరాలు సేకరించారు. ఇదిలా ఉండగా ఇటీవల అనారోగ్యానికి గురైన బ్రహ్మారెడ్డి తనకేమైన అయితే వికలాంగులైన ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమిటా అని ఆందోళనకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పిల్లలు మృతి చెందడం, వారి తండ్రి బ్రహ్మారెడ్డి కనిపించకపోవడం నేపథ్యంలో కేసు దర్యాప్తు వేగవంతం చేస్తామని సిఐ దిలిప్‌కుమార్ పేర్కొన్నారు.
వికలాంగుల ప్రాణం తీయొద్దు
దివ్యాగుల అధ్యక్షుడు కోటేశ్వరావు
వికలాంగులైన పిల్లలు పుట్టడం శాపంగా భావించొద్దని, వారి ప్రాణాలు తీయొద్దని ఎపి వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. మృతుల కుటుంబాన్ని పరామర్శించిన ఆయన సంతాపం తెలిపారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ వికలాంగులు భారంగా మారితే వారి ఆలనాపాలనా చూసేందుకు ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయని, స్వచ్ఛంద, సేవా సంస్థలు ఆశ్రమాలను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. వికలాంగులను వాటిల్లో చేర్చొచ్చుగాని, చంపుకోవద్దని కోరారు.
