బలవంతపు మరణశిక్షలో శాశ్వతంగా నిష్క్రమిస్తూ ఓ క్రైస్తవ సాధువు రాసిన లేఖలోని ఆఖరి సంతకం... 'యువర్ వాలెంటైన్'. స్వీయ నామధేయున్ని ఉటంకిస్తూ నీ/మీ అన్న భావనతో రాసిన అక్షరాలు కాలక్రమంలో లక్షల కోట్ల గుండె చప్పుడును వినిపించే వీణానాదాలయ్యాయి. మూలం తెలియకపోయినా, వాలెంటైన్ మరణించిన రోజుని, తమ ఇష్టులకు సంతోష గీతాలను... సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తే బహుమతులతోనూ, చూడగానే కళ్లల్లో మెరుపులు, హృదయంలో ఆనంద హిందోళాలు పలికించే ప్రణయ భావనలకు ప్రతిరూపమైన రోజుగా మార్పు చెందడం... ప్రేమాన్వితమే! ఓ విషాదభరిత దినం విభిన్న దేశాల్లో ఆయా సంస్కృతుల్లో విప్లవాల్ని తీసుకొచ్చి విభిన్న రూపాలను, తేదీలను మార్చుకుని 'ప్రేమికుల దినోత్సవం'గా మారింది. ప్రపంచవ్యాప్తంగా, ఎంతోమందిని స్పందింపజేసే 'ప్రేమ' అనే రెండు అక్షరాలు నిజస్వరూపం ఏంటి?
యువర్ వాలెంటైన్..!
సాధువులకో తీరున
సంసారులకో రూపున,
ప్రేమికులకో వైనాన,
ప్రేక్షకులకో చందాన,
అనిపించే 'ఇష్క్' ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎవరిని, ఏ వయసులో ఆవహిస్తుందో చెప్పగలగడం... ఆకాశంలోని తారలను లెక్కించే సాహసం చేయడమే! ప్రేమికుల కళ్లకు ఆ చుక్కల్లో తమ ప్రియతముల ధరహాసాలే గోచరించి, ఎంచుకున్న పని ఏ మూలకు పోతుందో? ఎవరికి ఎరుక
'ప్రేమంటే ఏమిటంటే
నిను ప్రేమించినాక తెలిసే
మనసంటే ఏమిటంటే
అది నీకిచ్చినాక తెలిసే' అంటాడో కవి.
నిజమే అప్పటి వరకు అక్షరాలు పరిచయమున్న వారిని కవిత్వ ప్రియులుగా మార్చి పేపర్లను చెమ్మగిల్లిస్తుంది. తెల్లటి పేపర్‌పై చెక్కే అక్షరాలు ఇష్టమైన వారిని ఎన్నెన్నో తీరులుగా వర్ణిస్తాయి. వారితో ఊసులు పలికిస్తాయి. ఏవేవో ఆశలను ఆకాంక్షలను పంచుకుంటూ చెరిసగమై బతుకుదామంటుందీ... 'లవ్'.
రంగు, రూపు, కులం, మతం, జాతి అన్నీ బలాదూరంటూ నచ్చినవారి చేయి చేపట్టమంటుంది. జగమంతా చట్టాపట్టాలేస్తూ తిరుగుతామంటుంది. ఇది ప్రేమ స్వరూపానికి ఒక కోణం.
ప్రేమ పవిత్రమా? స్వచ్ఛమా..?
చాలామంది ఉచ్ఛరించే ఈ పదంలో పవిత్రత అర్థం ఏమిటో? ఆలోచించాల్సిన అంశం. అసలు పవిత్రత అన్న పదమే హాస్యాస్పదం, కలుషితం కానిది పవిత్రమైతే, అసలు ఈ జగంలో కలుషితం కానిది, మరి దేనితోనూ తోడవ్వక ఒంటరి నక్షత్రంలా పరిభ్రమించేది ప్రేమ అవుతుందా? పవిత్రతకు పర్యాయ పదంగా ఉంటుందా? ఒక్కరినే తలచడం.. ఆ ఒక్కరితోనే ప్రణయ భావనలోనో, బాధతోనో బతుకునీడవడం ట్రాష్ కాక... మరేంటి? ఎక్కడుందో రూపు తెలియని మనోఫలకంపై ఓ ఫైన్‌డే ఓ రూపు ముద్ర పడుతుంది. లక్షల భావాలను మనిషిలో లేపుతుంది. కారణాలేమైనా అధిక శాతానికి అందని పండే అవుతుంది. అంత మాత్రాన అదే పవిత్ర ప్రేమనుకుంటూ ఉస్సూరంటూ జీవితాన్ని గడపడం నచ్చిన వ్యాపకమంటూ, శరీరాన్ని గోల పెట్టనీయకుండా జోలకొట్టడం వరకూ సరే..! నచ్చిన వ్యక్తిని స్మరించకుండా ఉండలేకుండా బతుకుతూ... కనురెప్పలలో దాచుకోవడం మాత్రం పవిత్రత ఎలా అవుతుంది? జీవన సహచరులుగా ఎవరో ఒకరితో బతుకు బాట నడవడం మనో కుహురంలో 'మాజీ'లను భద్రపరుచుకోవడం పవిత్రతగా ఎలా భావించగలం? ఇన్ని ఎలా? ఈ ప్రపంచంలో పవిత్రత అన్న పదానికి అర్థమే లేదు. భాషలోని వేలవేల పదాల్లో అదో పదం అంతే! ముఖ్యంగా ప్రేమికులకు అతకని పదం.
ప్రేమికులంటే ఎవరు?
పరిమళించే భావనలతో కొనసాగుతూ, పరస్పర ఇష్టంలో పబ్లిక్గానో, ప్రైవేట్గానో జీవితాలను కొనసాగిస్తూ.... శరీరంలో, మనస్సులో కలిగే భావాలకు ప్రతిరూపమైన ఎదుటివారిని రక్త సంబంధీకుల కన్నా ఆప్తమిత్రుల కన్నా, అధికంగా భావించి మనో సింహాసనంపై కూర్చోబెట్టి, వారినే కొలుస్తూ ఆ రూపానికి బానిసలుగా బతకడం... వీళ్లేగా ప్రేమికులంటే? ఒకరికోసం మరొకరు ఏదైనా చేయాలనుకోవడం, 'ప్రేమైక' మనస్సులను ప్రఫుల్లం చేసే జ్ఞాపికలను అందించడం, అందుకొన్న వాటిలో ఆనాటి స్మృతులను పదిలపరుచుకుంటూ.... చూసినప్పుడల్లా ఓ చిరునవ్వో, ఓ నిట్టూర్పో విడిచేవారేగా ప్రేమికులంటే? కాదా? అలాగనుకుంటే వాలెంటైన్స్ డేని లాటిన్, అమెరికాలో 'డే ఆఫ్ లవ్ అండ్ ఫ్రెండ్షిప్'గా బ్రెజిల్లో మంచి భర్తనో, బారు ఫ్రెండ్‌నో వెతుక్కునే రోజుగా యునైటెడ్ నేషన్స్లోకి ప్రజలు తమ తల్లికో, తండ్రికో, సోదరులకో, భర్తకో, భార్యకో లేక తమ బారు/ గార్ల్ ఫ్రెండ్‌కో బహుమానాలు అందించే దినంగా, చైనాలో 'ప్రేమికుల పండుగ'గా ప్రేమాభిమానాల్ని ప్రకటిస్తారు. ప్రపంచానికి కామసూత్రాలను బహూకరించిన భారతదేశంలో ఇదో ముఖ్య ఘట్టమే కానట్లుగా... కలిసి తిరిగితే తాళి కట్టించేయడమే అని బెదిరింపు రోజుగా, ఇస్లామిక్ దేశాలు యువతీ, యువకులు కలిసి కనిపిస్తేనే నేరంగా భావించే రోజుగానో ఎందుకు భావిస్తున్నారు? ఇరాన్లో తమ తల్లికో, భార్యకో బహుమానాలు అందించే రోజుగా ఎందుకు స్వీకరించరు..?
తాము ఇష్టపడే మగవారికి చాక్లెట్లు అందించే రోజుగా జపనీయులు భావించడం. అందుకున్న వాటికి రెండింతల, మూడింతలో అధిక విలువ ఉన్న వాటిని తిరిగి ఇవ్వకపోతే తమ బంధం మాసిపోతుందని ఆ మగవారు నమ్మడం ఇవన్నీ ప్రేమికుల లక్షణాలేనా? ప్రేమ స్వభావమేనా? తాము వివాహమాడాలనుకునే యువతులకు ప్రపోజ్ చేసే దినంగా లెబనాన్ పురుష ప్రపంచం స్వీకరించడం, ఇది మన సంస్కృతికి విఘాతమంటూ మలేషియాలోని కొంత భాగం అసలా ఆలోచనే తుంచివేయడం, తమ దేశంలో ప్రేమికుల 'దినమే' జరగకూడదంటూ పాకిస్తాన్ నిషేధాలు విధించడం, వివాహానికి సరైన రోజుగా ఫిలిప్పైన్స్ భావించడం, ముస్లీమేతరులు మాత్రమే బంధించిన గోడల వెనుక పండుగ జరుపుకోండంటూ సౌదీ అరేబియా పాలకులు ప్రకటిస్తే ప్రేమ కట్టడి అవుతుందా..! ఇంకా కట్టలు తెంచుకుంటుంది కానీ. అసలా రోజు కోసమే ఆదాయంలో అధిక శాతాన్ని దాచి సింగపూర్ ప్రజలు ఖర్చుపెట్టుకోవడం, తమ పురుషులకు ఆడవారు చాక్లెట్లను వాలంటైన్స్ డే నాడు అందజేస్తే మార్చి 14న వైట్ డేగా భావించి మగవారు తిరిగి బహుమతులందించడం ఓ వైపుంటే... ఏకాకులు ఏప్రియల్ 14ను బ్లాక్ డేగా భావించి 'బ్లాక్ న్యూడిల్స్' ఒక్కరే తినెయ్యడమూ ఉంది.
తమ సంపాదనంతా ప్రేమించిన వారి కోసమేనని యునైటెడ్ కింగ్డమ్ ప్రజానీకం భావిస్తే... స్వచ్ఛమైన ప్రేమ కోరుకునే ఐర్లాండ్‌వాసులు డబ్లిన్‌లోని సెయింట్ వాలెంటైన్ సమాధిని దర్శించి తమకిష్టమైన వారిని మరీ ముఖ్యంగా స్నేహితులను స్మరించుకుని, వారికి బహుమానాలు అందిస్తారు. ఫిన్లాండ్, ఎస్టోనియా ప్రజల రీతీ అదే. ప్రతి రెండేళ్లకోసారి 19వ శతాబ్ది దుస్తులు ధరించి ఫ్రాన్స్‌లోని రోక్మార్ గార్డెన్లో 800 మంది గ్రామస్తులు క్యాథలిక్ చర్చిని సందర్శించి సంబరాలు జరుపుకుంటారు. 'రొమాంటిక్ ప్రేమకు' ప్రతిరూపంగా గ్రీస్వాసులు సంబరాలు జరుపుకుంటే... పోర్చుగల్, రొమేనియా, స్కాండినేవియా, స్పెయిన్ వారు కూడా మతాన్ని ప్రేమను కలగలిపి పరస్పర బహుమతులు పంచుకుంటారు.
ఇవన్నీ సూచించే ప్రధానాంశం 'ప్రేమంటే ఇద్దరి మధ్య అంకురించే లైంగిక భావనలే కాదు.., ఆత్మీయానుభూతులను పరస్పరం పంచుకునే ఉన్నత భావన, ఉత్తమ బంధం అని... మన అన్నవారు మనస్సులోనే కాదు, మనతో కలిసి జీవించే ఎవరైనా కావచ్చు అన్న సందేశాన్నే ఇస్తున్నాయి. ఎవరి సంస్కృతీ వారసత్వాన్ని వారు కొనసాగిస్తూ వాలెంటైన్ వర్ధంతిని తమ శైలిలో పండగ చేసుకుంటున్నారు.
ప్రేమ విశ్వజనీనం...
సైనికులకు సైతం వివాహం జీవితావసరమన్న బలీయమైన ఆలోచనకు రూపమిచ్చి వారికి తోడునందిస్తూ, నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ సైనికులను వివాహితులను చేసి కుటుంబాన్ని వారికందిస్తూ ప్రతిఫలంగా మరణాన్ని శిక్షగా స్వీకరించిన ఆ క్రైస్తవ సాధువును తమకు నచ్చిన వ్యక్తి రూపంలో స్మరించుకుంటుందీ ప్రపంచం. అంటే.., విశ్వజనీనమైన ప్రేమకు ప్రయాణం చేయండనే జీవన సందేశం వాలెంటైన్ డే సారాంశం.
జననం, మరణం మధ్య సాగే జీవితం ఎంతో తెలియని లోకంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే హార్మోన్ల అల్లకల్లోలం పట్ల తీవ్ర వ్యతిరేకత భారతదేశంలో ఉన్నంత కఠినంగా మరెక్కడా కానరాదు. ఖాప్ పంచాయితీలు కన్న బిడ్డలను నరికి వెయ్యడాలు, సమాజంలో పరువంటూ బిడ్డల భాగస్వాములను విగత జీవులను చేయడం వెనుక నేపథ్యం.. కరుడుగట్టిన ఛాందస భావం ఓ దిశ కాగా, ఏమనుకుంటారో అన్న 'స్యూడో పరువు' గోడలు..! ఏ మతమూ సాటి మనిషిని చంపమనడం లేదు. ఏ కులమూ నేడు తమ కుల వృత్తులను కొనసాగించడంలేదు. అలాంటి భారతీయ సమాజంలో కనిపించని గోడలను మనుషులే నిర్మించుకుంటున్నారు. చిత్రమైన విషయమేమంటే .. వ్యవస్థ గురించి, కులాల పుట్టుక పరిణామాల గూర్చి ఉపన్యాసాలిచ్చే 'ఆదర్శవంతులు' కూడా తమ బిడ్డల వివాహ సమయంలో, ఉపకులాలను గూడా పరిగణనలోకి తీసుకుని నూతన కుటుంబ సభ్యులను ఎంచుకోవడం... తమ వంశాభివృద్ధి తమ కులక్షేత్రంలోనే వర్ధిల్లాలనుకోవడం... శోచనీయం. పైన పేర్కొన్న అంశాలను గణనలోని తీసుకోకుండా బిడ్డల సంతోషమే ముఖ్యమంటూ వివాహాలు జరిపించే వారు కొందరు. కానీ, వీరు అక్కడక్కడా ఉంటారు. వీరు వధూవరుల చదువు, సంపాదన, ఇరు కుటుంబాల ఆర్థిక స్థోమతలు బేరీజు వేసుకుని తమ బిడ్డలను జంటలను చేస్తున్నారు. అతి కొద్దిశాతం మంది మాత్రం తమ సిద్ధాంతాలకు అనుగుణంగా జీవన సాఫల్యత అందించే జంటను వెదుక్కొని ముందడుగు వేస్తున్నారు. అంటే 90% ఆర్థిక భద్రతను 10% జీవన సంతోషాన్ని వెదికిపుచ్చుకుంటూ సమాజం నిర్దేశించిన సామాజిక సూత్రాలలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మరి కొంతమంది భిన్నమైన జీవితాలను సాగిస్తున్నారు.
వీరిదీ హృదయమే.. అది ప్రేమే...
హార్మోన్ల ప్రభావం కావచ్చు, మానసిక గాయాలు కావచ్చు... మనకు అసహజంగా అనిపించొచ్చు.. ప్రకృతి విరుద్ధంగా కనబడొచ్చు.. కానీ, ఎల్జీబీటీక్యూ జంటలదీ అదే వాలెంటైన్ హృదయమే. వారిని కలిపే ఆ బంధానిదీ ప్రేమ పునాదే. ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ జంటల్ని అర్థం చేసుకుంటోంది.. అంగీకరించే ప్రయత్నం చేస్తోంది. వారిప్పుడు కలిసి జీవించే వాతావరణం కనిపిస్తోంది. వారి వివరణలు పోరాటాలయ్యాయి. వారి దాపరికాలు సమాజం ఎదుట గుండెను ఆరబోశాయి. వివాదాలు, చీత్కారాలు, దాడులు, జరిమానాలు, జైళ్లు, హత్యలు, ఆత్మహత్యలు... దాటి భద్రత చట్టాలు, అనుకూల తీర్పులతో మార్పులొచ్చాయి. ఇన్నాళ్లూ లైంగిక వికృతి కోణంలోనే చూసిన కళ్లకు... వారి పరిపూర్ణ హృదయాలు, స్వచ్ఛమైన అనుబంధాలు అవగతమయ్యే స్థితికి చేరుతున్నాం. సామాన్యుల్లానే ఈ అసామాన్య జంటల పెళ్లిళ్లకు పెద్దల ఆశీర్వాదాలు దక్కుతున్నాయి. ఎవరి కారణాలు వారివి అందుకే, ఇద్దరు స్త్రీలు, ఇద్దరు పురుషులు కూడా కలిసి జీవనం గడుపుతున్నారు. ప్రకృతి సహజ ధర్మాల కన్నా కలసి బతకడమే ముఖ్యమంటూ ప్రభుత్వాలు వారి వ్యథని, భగహృదయాల్ని అర్థంచేసుకుని వారి బంధాన్ని చట్టబద్ధం చేస్తున్నాయి.
ప్రేమ మైనసైతే... పెళ్లిప్లస్సేనా..!
పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య కాంట్రాక్ట్‌గా పేపర్లలో ఉంటుంది. కావాలంటే, విడాకులు తీసుకుని బయటపడొచ్చనీ ఉంటుంది. కానీ, దంపతుల మధ్య బంధం అంత తేలికా..? ఇలా చూసి తీసుకునే బ్రేకప్లకి, వివాహ బంధంలో కూడా ఎవరి 'చాయిస్' వారిదేననే కొత్త వాదనలకి వివాహ వ్యవస్థ కదిలిపోతోంది. వివాహేతర సంబంధాల్లో అనేక కోణాలుంటాయి. అనేక సమస్యలుంటాయి. వివరణలుంటాయి. ఎన్నున్నా ఓ జంట పెళ్లి అయినా, కాకున్నా ఒక్కటిగా సుదీర్ఘకాలం మెలగాలంటే అది కేవలం బాధ్యతో, బరువో, భయమో, కాంట్రాక్టో, ఒట్టో, కట్టడో, జీవన్మరణ సమస్యో అయితే ఎలా..? ప్రేమపూరితం కానీ, ఏ బంధమైనా మరో సంబంధం అక్కరలేకుండానే ముక్కలవుతుంది. జంటలై చట్టం, సమాజం, నిర్దేశించిన సూత్రాల మధ్య నివసిస్తూ తమ మనసులోకి ప్రవేశించి, శరీరానికి సౌఖ్యాన్నిచ్చే అవసరం వైపు మరులుతున్నవారు నేటి సమాజంలో అధిక శాతం ఉన్నారు. వైవాహిక వ్యవస్థలోని సంకెళ్లను తెంచుకోలేక బిడ్డల భవిష్యత్తు మరీ ముఖ్యంగా వారికి పెళ్లి జరగదేమో అన్న ఆలోచనలతో ఒకే కప్పు కింద కలసి బతుకుతూ ఎవరికి వారు విడిగా బతికే జంటలు భారతీయ సమాజంలో అధిక శాతమని అంటారు. ఈ విషయంలో పాశ్చాత్య దేశాలే నయమనే వారూ ఉన్నారు. ఇష్టమైతే కలిసి బతుకుతారు, లేకుంటే విడిపోయి ఎవరికి నచ్చినవారితో వారు మనుగడ సాగిస్తారు. ఆ స్వేచ్ఛ వారికుందని వాదిస్తారు. అటూ, ఇటూ కాని సామాజిక నిబంధనలున్న సమాజంలోని వివాహేతర సంబంధాలలోని ప్రేమ, విషాదాంతంగానే ముగుస్తుంది. అంటే వీరి మధ్య ప్రేమ భావనని కుటుంబం అంగీకరించదు, ఇరుగు పొరుగు హర్షించదు.. సమాజం ఊరుకోదు. ఏదో ఉపద్రవం జరిగిపోయి భారీ నష్టం సంభవించిపోతున్న భావాల మధ్య కొనసాగే వివాహేతర సంబంధాలు ముగింపు ఎప్పుడూ అసహజమే. సుదీర్ఘకాలం, జీవితాంతం అనబడే వివాహ బంధంలో ప్రేమ ఉంటుందా?
ఇదో పెద్ద డిబేట్... ఉంటుందని అధిక శాతమనవచ్చు. ఉండకున్నా మనుగడ తప్పదన్న భావన మరికొందరిలో ఉండొచ్చు. బయటకు వెళ్లి బతకలేక కొందరు కొనసాగవచ్చు. కొత్త ప్రయోగాలు ఎందుకనుకుంటూ కొనసాగింపే కావచ్చు. తమ దాంపత్య ఫలాలు సమాజం నుంచి ఇబ్బందులు ఎదుర్కొనకూడదన్న భావనగానే జంటగా బతికేవారి మధ్య అంకురించిన అనురాగమే వివాహ బంధాలను బంధించి ఉంచుతుందని అనుకోవచ్చా..? లేదా, కొన్నాళ్లకు ఆ బలవంతపు బంధాల్లోనూ ప్రేమాప్యాతలు చిగురించే అవకాశాలున్నాయనుకోవచ్చా..? ఒకరి గురించి ఒకరు తెలుసుకుని, ఒకరి కోసం ఒకరనుకుని, ఒక్కటిగా జీవితాంతం బతకాలని నిర్ణయానికొచ్చాక ప్రేమను వ్యక్తం చేయడం, ఆమోదించడం... బంధంలోకి అడుగుపెట్టడం.. లవ్ స్టోరీల్లో ఎలా హిట్ అవుతుందో... అరేంజ్డ్ మ్యారేజీల్లోనూ అదే పరిణామ వికాసం ఫలవంతమవుతుందా...! ఎవరు నిజనిర్ధారణ చేయగలరు. సర్వే చేసే సాహసం ఎవరు చేయగలరు. ఏదేమైనా ఏ బంధమైనా సజీవంగా, నిక్కచ్చిగా నిలిచుండాలంటే ప్రేమ తప్పనిసరి.
మీ బహుమతేది..?
వాలెంటైన్ అంటే నిస్సందేహంగా ప్రేమైక హృదయమే... ఎవరి మధ్య ఎలా, ఏ రూపంలో అంకురించినా... ప్రణయ భావనో స్నేహ భావనో, ఆత్మీయానుభూతులనో మనకు కలిగించిన వారు వాలెంటైన్‌గా స్వీకరించాలి. ఎందరో సంఘసంస్కర్తలు మూఢాచారాలను ధిక్కరించి సమాజాభివృద్ధికి దోహదపడినట్లే ఆనాటి ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి సైనికులకు వివాహాలు చేసిన 'వాలెంటైన్' ఎంచుకున్న మార్గం ఆనంద హిందోళ రాగం. 'అసంతృప్తుల అరకొర జీవితం కన్నా.... ఆనందకరమైన జీవనమే మిన్న' అన్న సందేశాన్నిచ్చిన వ్యక్తి జీవితం.
ఆయన వర్ధంతిని వినిమయ సంస్కృతిలో 'ఇచ్చి పుచ్చుకునే' వ్యవస్థగా మార్చడం మార్పులో భాగమే. దీన్నీ వారైతే వ్యాపారం చేశారు సరే, మీరేం చేయాలన్నది మీ చేతుల్లోనే ఉంది. పరివర్తన, పరిణామం, వికాసం.. ఇద్దరి జీవితాలకే కాదు, సమాజం మొత్తానికీ ప్రేమ విలువ తెలిపే తీరుగా ప్రేమికుల దినోత్సవానికి మన్నన తెస్తే సరి. అందుకే, మీకిష్టమైన వారికి మీకు నచ్చిన ఓ బహుమతిని 'వాలెంటైన్స్ డే'కి అందించండి. అది పువ్వా? పత్రమా? హృదయమా? జీవితమా? చాయిస్ మీదే సుమా!
- శమంతకమణి
9491962638